Published On: Sat, Apr 20th, 2019

సమాజ సర్వతోముఖాభివృద్దే సివిల్ సర్వెంట్ల అంతిమ లక్ష్యం

* సివిల్ స‌ర్వీసెస్ దినోత్స‌వ వేడ‌క‌ల్లో ఏపి సీఎస్ ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: స‌మాజం సర్వతోముఖాభివృద్ధికి ప్రజల ఆశయాలకు అనుగుణంగా దీర్ఘకాలిక ప్రయోజనాలు, లక్ష్యాల సాధనలో అఖిల భారత సర్వీస్ అధికారులు చురుకైన పాత్రను పోషించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.శనివారం అమరావతి సచివాలయంలోని ఎపి హెచ్ఆర్డి ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో జరిగిన 13వ సివిల్ సర్వీసెస్ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ప్రజల ఆశయాలకు అనుగుణంగా దీర్ఘకాలిక ప్రయోజనాలు,లక్ష్యాల సాధనే ధ్యేయంగా సమాజ సర్వతో ముఖాభివృద్ధికి అన్ని విధాలా కృషి చేయాల్సిన బాధ్యత సివిల్ సర్వెంట్లపై ఉందని ఆదిశగా ప్రతి సివిల్ సర్వెంట్ పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం సూచించారు. సివిల్ సర్వెంట్ గా సమాజంలో ఎదురయ్యే సవాళ్ళను అర్దం చేసుకుని వాటిని అధికమించేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేయాలని చెప్పారు. వివిధ పధకాలు,పాలసీలు అమలులో సివిల్ సర్వెంట్లు నిబ్ధతతో పనిచేసి మెరుగైన లక్ష్యాల సాధనలో కీలకపాత్ర పోషించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సిఎస్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ,మానవత్వం, సంక్షేమ పాలనే సివిల్ సర్వెంట్ల అంతిమ లక్ష్యం కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.అదేవిధంగా వారసత్వ సంపద,సాంప్రదాయాలు,భాషా పరిరక్షణ,ప్రోత్సాహానికి సివిల్ సర్వెంట్లు అన్ని విధాలా కృషి చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలిపారు.సివిల్ సర్వెంట్ జీవితం క్రికెట్ మ్యాచ్ వంటిదని ఒక్క బంతి సరిగ్గా ఆడకపోయినా అవుట్ అవ్వాల్సిందేనని అదే బ్యాట్ మెంటన్లో అయితే మరోసారి సర్వీస్ చేసే అవకాశం ఉంటుందన్నారు. విలువలను కాపాడడంలో సివిల్ సర్వెంట్లు కీలకపాత్ర పోషించాలని,సీనియర్ సివిల్ సర్వెంట్లు మిగతా వారికి ఆదర్శంగా నిలవాలని చెప్పారు.దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తమ డెస్టినేషన్ గా నిలిపేందుకు కృషి చేయాలని సిఎస్ సుబ్రహ్మణ్యం సూచించారు. కార్యక్రమంలో హైదరాబాదు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అబివృద్ధి సంస్థ పూర్వపు డైరెక్టర్ జనరల్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్తు సిస్టమ్స్ అధ్యక్షులు మరియు డీన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి డా.ప్రశాంత మహాపాత్ర మాట్లాడుతూ సివిల్ సర్వెంట్ల విధానం పుట్టు పూర్వోత్తరాలు మన దేశంలో ఎప్పుడు అమలులోకి వచ్చింది తదితర వివరాలను తెలియ జేశారు.చైనా దేశంలో సివిల్ సర్వెంట్ల విధానం మనకంటే ముందుగా ఉండేదని తదుపరి 1806లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు సివిల్ సర్వీసెస్ విధానాన్ని మన దేశంలో ప్రవేశపెట్టారని తెలిపారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మానవ వనరుల అభివృద్ధిలో దేశంలో ముందంజలో ఉందని పేర్కొన్నారు.
                                    గుజరాత్ రాష్ట్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాష్టర్ మేనేజిమెంట్ డైరెక్టర్ జనరల్ మరియు ఆరాష్ట్ర విశ్రాంత అదనపు సిఎస్ పికె తనేజ మాట్లాడుతూ రెగ్యులేటరీ సెక్టార్లో సివిల్ సర్వెంట్ గా తన అనుభవాలను గురించి సివిల్ సర్వెంట్ గా లీడర్ షిప్పు లక్షణాలను ప్రదర్శించాలని శాంతి భద్రతలను కాపాడడంలో న్యాయబద్దమైన నియమాలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పారు.ఈరోజుల్లో అవినీతి అనేది క్యాన్సర్ వ్యాధికంటే ప్రమాదకరంగా తయారైందని దానిని నియంత్రించుటలో ధైర్యంగా పనిచేయాలని సివిల్ సర్వెంట్లకు సూచించారు.అంతేగాక సమాజంలోని పేదలు తదితర బలహీన వర్గాల పట్ల సానుభూతితో,పాదర్శకంగా,వివక్షత రహితంగా బాధ్యతా యుతంగా వ్యవహరించాలని హితవు చేశారు.అదేవిధంగా కింది స్థాయి ఉద్యోగులను ఎల్లవేళలా ప్రోత్సహిస్తూ వారు అన్ని విధాలా మెరుగైన రీతిలో పనిచేసేలా కృషి చేయాలని చెప్పారు.మనకంటే ముందు పనిచేసిన అధికారులు వారు చేసిన సేవలను గౌరవ వించడం వాటిని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలని సూచించారు.అంతేగాక ఎల్లప్పుడు ఉత్తమ విధానాలను తీసుకుని వాటిని అమలు చేసేందుకు కృషి చేయాలని చెప్పారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎపి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ డి.చక్రపాణి మాట్లాడుతూ ప్రతి ఏటా ఏప్రిల్ 21వతేదీని సివిల్ సర్వీసెస్ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతోందని తెలిపారు.అనంతంరం హెచ్ఆర్డి ఇనిస్టిట్యూట్ అందిస్తున్న వివిధ శిక్షణా కార్యక్రమాలు తదితర వివరాలను తెలియజేశారు.పంచాయితీరాజ్ శాఖ విశ్రాంత ఇఎన్సి ఆర్.కొండల రావు స్టేబుల్ రోడ్ల ఎపెక్టివ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ తదితర అంశాలపై మాట్లాడారు. భోజన విరామం అనంతరం ఒడిస్సా ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ ఫర్ రూరల్ ఇన్నోవేషన్ కు చెందిన అనిల్ ప్రధాన్,మహారాష్ట్ర అకోలాకు చెందిన జడ్పి సిఇఓ ఆయుష్ ప్రసాద్,సీతంపేట ఐటిడిఓ బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి,యూనిసెఫ్ డిఆర్ఆర్ ఆఫీసర్ మహేంద్ర రాజారామ్ రిస్క్ ఇన్పార్మ్డ్ ప్రోగ్రామ్ ఫర్ రెసిలైన్స్ పై మాట్లాడారు.అలాగే ఖమ్మం నీటిపారుదల శాఖ విశ్రాంత సిఇఆర్‌ఎ పద్మనాభం మాట్లాడారు. కార్యక్రమంలో ముఖ్య కార్యదర్శులు ప్రవీణ్‌కుమార్, కె.దమయంతి, కార్యదర్శులు ఎన్.శ్రీకాంత్, సునీత, హెచ్ అరుణ్‌కుమార్, గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లు కె.శిశిధర్, ఇంతియాజ్, ఆ రెండు జిల్లాల జెసిలు హిమాంసు శుక్లా, కృతికా శుక్లా, అదనపు సిఇఓ వివేక్ యాదవ్, ఇతర అధికారులు, హెఆచ్ఆర్డి సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Just In...