Published On: Thu, Aug 8th, 2019

సర్వే ద్వారా వాస్తవ భూములను గుర్తించడంలో కార్యాచరణ అవసరం

* ఉగాది నాటికి లబ్ధిదారులకు ఇళ్లపట్టాలు, ఇళ్ల పంపిణీ ప్రారంభించాలి

* రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్

* రెవెన్యూ భూముల సంస్కరణలకు ఇదే సరైన సమయం

* ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయకల్లాం

* రూరల్, అర్బన్ సెక్టార్లలో ఇంటి స్థలాల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఫిబ్రవరి కల్లా పూర్తి చేయాలి

* ప్రభుత్వ సలహాదారు ఎమ్.శామ్యూల్

సెల్ఐటి న్యూస్, అమరావతి: చట్టబద్ధమైన విధానాల్లో భూముల రీసర్వే తప్పనిసరిగా చేపట్టాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. అందుకనుగుణంగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రణాళికను రూపుదిద్ది పూర్తి స్థాయి శిక్షణతో సర్వేను చేపట్టాలన్నారు. వెలగపూడి సెక్రటేరియట్ లోని ఐదవ బ్లాక్ లో జాయింట్ కలెక్టర్లతో ఇండ్ల స్థలాలు, భూములు, డాటెడ్ ల్యాండ్స్,రెవెన్యూ సంస్కరణలు తదితర అంశాలపై సమన్వయ శాఖల ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ, గత నెలరోజులలో ప్రభుత్వం అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలను తీసుకోవడం జరిగిందన్నారు. దేశంలోనే ప్రప్రథమంగా ల్యాండ్ టైటిలింగ్ బిల్లు-2019 ప్రవేశపెట్టడం ద్వారా భూయజమానులకు పూర్తి రక్షణ కల్పించడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా డీడీ రిజిస్ట్రేషన్ కు బదులుగా టైటిల్ రిజిస్ట్రేషన్ చేపట్టడం జరుగుతోందన్నారు. సాగుదార్ల హక్కు చట్టం-2019 తీసుకురావడం ద్వారా సాగుదార్లకు ప్రత్యేక హక్కులు కల్పించడం తో పాటు పట్టాదారు హక్కుదార్లకు భంగం కలగకుండా చట్టం చేయడం జరిగిందన్నారు. సమగ్ర భూ సర్వేను చేపట్టడంలో భాగంగా ప్రతి గ్రామానికి ఒక సర్వేయర్ ను నియమించడం దేశ చరిత్రలోనే తొలిసారని ఆయన తెలిపారు. భూముల సమగ్ర సర్వేను చేపట్టడంలో నిర్ధిష్ఠమైన ప్రణాళికలను రూపొందించుకొని తదనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి సమగ్ర విధానాల్లో భూ సర్వేను చేపట్టాల్సి ఉందని, సిబ్బందికి తగిన విధంగా శిక్షణను అందించి పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయాలన్నారు. 25 లక్షల మందికి ఉగాది నాటికి ఇళ్లు లేదా ఇళ్ల స్థలాలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పించారని అందుకనుగుణంగా క్షేత్రస్థాయిలో ఆ దిశగా ప్రయత్నాలు 2020 ఫిబ్రవరి నాటికల్లా పూర్తి చేయాలని మన్మోహన్ సింగ్ తెలిపారు.లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరగాలని గ్రామసభలను నిర్వహించి ఎంపికను చేపట్టాలన్నారు. అనర్హులను ఎంపిక చేయకుండా తగిన జాగ్రత్తలను తీసుకోవాలని ఆయన తెలిపారు. డాటెడ్ ల్యాండ్స్ : రెవెన్యూ పరంగా 22A మరియు డాటెడ్ ల్యాండ్స్ కు సంబంధించి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాటికి సకాలంలో రెవెన్యూ శాఖ పరిష్కారం చూపాలన్నారు. రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణ(ఫ్యూరిఫికేషన్) ప్రక్రియను వేగవంతం చేయాలని వారికి వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించేలాగా క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. సమస్యలను ఒక డేటాబేస్ గా రూపొందించుకొని పరిష్కారాలు చూపాల్సి ఉందన్నారు. మ్యూటేషన్, వెబ్ ల్యాండ్ అడంగల్ లలో వ్యత్యాసాలు ఉన్నాయని జిల్లాస్థాయిలో సమీక్షించి త్వరితగతిన పరిష్కారాన్ని చూపాలన్నారు. ప్రభుత్వ విధానాల్లో భాగంగా త్వరలోనే రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతుందన్నారు. రెవెన్యూ సంస్కరణల్లో జాయింట్ కలెక్టర్లు తగిన సలహాలు, సూచనలతో ముందుకు రావాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కోరారు. సమావేశాల్లో భాగంగా ఇంటిస్థలాలు, కౌలుదారు చట్టం, 22A, డాటడ్ ల్యాండ్స్, ROFR – రైట్ టూ ఫస్ట్ రిఫ్యూజల్(అటవీ భూములు) , రీ సర్వే, గ్రామ సెక్రటేరియట్ లు, శిక్షణ మరియు వినియోగం, స్పందన కార్యక్రమం, ల్యాండ్ సీలింగ్ పెండింగ్ కేసులు, భూ సంస్కరణలు, రెవెన్యూ సదస్సులు, రెవెన్యూ సంస్కరణలు, రోడ్లు,భవనాలు, పౌర సరఫరాలు తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయ ప్రధాన సలహాదారు అజేయకల్లాం, ప్రభుత్వ సలహాదారు ఎమ్.శామ్యూల్, ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాంబశివరావు, వ్యవసాయ ముఖ్య కార్యదర్శి మధుసూధన్ రెడ్డి, సర్వే అండ్ సెటిల్ మెంట్ సంచాలకులు ప్రభాకర్ రెడ్డి, 13 జిల్లాల జాయింట్ కలెక్టర్లు, సర్వే లాండ్ రికార్డ్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Just In...