Published On: Mon, Apr 16th, 2018

సామాజిక మార్పు కోసం స‌హ‌కారం అందించండి

* ప్ర‌వాసాంధ్రుల‌తో వీసీలో కృష్ణా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీకాంతం ముఖాముఖి 

* కలెక్టర్ అభ్యర్థనకు ప్రవాసాంధ్రుల నుంచి అద్భుత స్పందన 

* వీసీలో పాల్గొన్న అమెరికాలోని 35 రాష్ట్రాలకు చెందిన 108 మంది ప్రవాసాంధ్రులు 

* జిల్లాలో మానవ అభివృద్ది సుచికల పెంపుదలకు ప్రవాసాంధ్రుల సహకారం అవసరం

* జిల్లా కలక్టర్ బి.లక్ష్మీకాంతం 

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: జిల్లాలో మానవ అభివృద్ధి సూచికలు (హ్యూమన్ డవలప్‌మెంట్ ఇండెక్స్) పెంచే విధంగా కార్యక్రమాలు చేస్తున్నామని.. దీనికోసం ప్రవాసాంధ్రులు ఆర్ధిక, హార్దిక సహకారం అందించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం కోరారు. ఆదివారం ఉదయం తమ విడిది కార్యాలయం నుండి ప్రవాసాంధ్రులతో నిర్వ‌హించిన వీడియో కాన్పరెన్స్ (వీసీ) పిలుపు మేరకు అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన 35 రాష్ట్రాల నుండి 108 మంది ప్రవాసాంధ్రులు పాల్గొని జిల్లా కలక్టర్‌తో మాట్లాడారు. ఈ సందర్బంగా కలెక్టర్ ల‌క్ష్మీకాంతం మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే కృష్ణా జిల్లా అన్ని రంగాల్లో వేగవంతంగా అభివృద్ది చెందుతుంద‌న్నారు. మరింత అభివృద్ధిపరచేందుకు ప్రవాసాంధ్రుల సహకారం చాలా అవసరం ఉందన్నారు. ముఖ్యంగా గర్భిణీ, బాలింతలు, కిశోర బాలికల రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని వీరి కోసం మేము సైతం కార్యక్రమం ద్వారా దాతల సహకారం తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ఇలాంటివారు 60 వేల మంది ఉన్నారని నెలకు రూ.25 లక్షలు విలువైన సజ్జలడ్డులు అందించే కార్యక్రమం చేపట్టామన్నారు. ఇప్పటికే మూడు నెలలకు సరిపడా నిధులు సేకరణ జరిగిందని.. ఇంకా మూడు నెలలకు సజ్జలడ్డు పంపిణీ చేయాల్సి ఉంద‌న్నారు. ఇందుకోసం ప్రవాసాంధ్రుల సహకారం కోరారు. సెప్టెంబర్ నాటికి అనీమియారహిత, పౌష్టికాహార జిల్లాగా ప్రకటించే విధంగా జిల్లా యంత్రాంగం దృఢ‌సంకల్పంతో పనిచేస్తుందన్నారు. జిల్లాలో 200 పాఠశాలల్లో 75 వేల మంది పిల్లలకు రూ.3 కోట్లతో ప్రవాసాంధ్రుల సహకారంతో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేసుకొన్నామని తెలిపారు. వీటి ఫలితాలు సంతృప్తిస్థాయిలో ఉన్నాయన్నారు. జిల్లాలో ఇంకా 234 పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయాల్సి ఉందని వీటికి ప్రవాసాంధ్రుల సహకారం అందించాలని కోరారు. సర్వశిక్షా అభియాన్ ద్వారా రూ.50 లక్షలు అందించడం జరుగుతుందని.. ప్రవాసాంధ్రులు సహకరిస్తే నూటికి నూరుశాతం జిల్లాలో డిజిటల్ తరగతులు అవుతాయన్నారు. వచ్చే జూన్ 12న పాఠశాలలు, వసతిగృహాలు తెరిచే నాటికి ప్రవాసాంధ్రులు, తల్లితండ్రులతో పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవాసాంధ్రులు పాల్గొనాల‌ని ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీకాంతం వారిని ఆహ్వానించారు. జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల‌ను మోడల్ అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే జిల్లాలో 4 అంగన్‌వాడీ కేంద్రాలను పూర్తిచేయడం జరిగిందని, పెదపారుపూడి, ఆత్కూరు కేంద్రాలను మే 2న‌, మిలిన‌వి జూన్ మాసంలో ప్రారంభిస్తామన్నారు. ఈ మోడల్ అంగన్‌వాడి కేంద్రాలు కార్పొరేట్ తరహాలో ప్రణాళికలను రూపొందించామని పేర్కొంటూ ఈ సంద‌ర్భంగా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలక్టర్ ప్రవాసాంధ్రులకు వివరించారు. జిల్లాలో ఇంకా 200 అంగన్‌వాడి కేంద్రాలు నిర్మించాల్సి ఉందని వీటికి సహకారం అందించాలని కలెక్ట‌ర్ ప్ర‌వాసాంధ్ర‌ల‌ను కోరారు.
                 జిల్లాలో శ్మశానవాటికలను ఉపాధి హామీ నిధులతో అభివృద్ధి పరుస్తున్నామని వీటిని 970 గ్రామ పంచాయతీల్లో ఉండే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. వీటిలో అన్ని మౌలిక వసతులు కల్పించడానికి ప్రభుత్వ నిధులతో పాటు దాతలు సహకారం తీసుకుంటున్నామని పేర్కొంటూ వాటి అభివృద్ధికి ప్రవాసాంధ్రుల సహకారం కోరారు.
జిల్లాలో 6 వేల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించవలసి ఉందని వీటి నిర్మాణానికి ప్రవాసాంధ్రుల సహకారం కావాలన్నారు. జిల్లాను ఇప్పటికే ఓడిఎఫ్‌గా ప్రకటించడం జరిగిందని వీటి ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. ముఖ్యంగా డయేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు తగ్గుముఖం పట్టినట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఓడిఎఫ్ ప్రకటించిన తరువాత ఆధార్ , రేషన్ కార్డు ఉండి ఇంటిపట్టా లేనివారికి 6 వేల మందికి పట్టాలు ఇవ్వడం ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించవలసి ఉందన్నారు. జిల్లాలో ఓడిఎఫ్ ప్లస్ అమలుపరుస్తున్నామని దీని ముఖ్య ఉద్దేశ్యం నిర్మించిన మరుగుదొడ్లను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడం లక్ష్యం అన్నారు. గ్రామంలో ఎవరూ ఆరుబయట మలమూత్రాలు విసర్జించకుండా పాఠశాల, ఇంటర్, డిగ్రీ చదివిన విద్యార్ధులచే అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న‌ట్లు తెలిపారు. జిల్లాను పర్యాటక కేంద్రంగా మారుస్తున్నామని, పోస్టర్ రహిత నగరంగా విజయవాడను తీర్చిదిద్దుతున్నామని, పెద్ద ఎత్తున పచ్చదనం పెంచుతున్నామని, కాలుష్యాన్ని తగ్గించగలుగుతున్నామని కలక్టర్ విసి ద్వారా ప్రవాసాంధ్రులకు వివరించారు. విజయవాడ నగరం ప్ర‌స్తుతం సర్వాంగ సుందరంగా తయారవుతుందని వివరించారు. అదేవిధంగా గ‌న్న‌వ‌రం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంగా మార‌బోతున్న గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం, జిల్లాలోని సాధికారమిత్ర‌ల ప‌నితీరు, డ్వాక్రా మ‌హిళ‌ల ఆర్థిక స్వావ‌లంభ‌న‌, ఈ-క‌లెక్ట‌ర్ యాప్ ప‌ని తీరు త‌దిత‌ర అంశాల‌కు సంబంధించి క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీకాంతం ప్ర‌వాసాంధ్రుల‌కు వివ‌రించారు. జిల్లా ప్ర‌జ‌ల జీవన విధానం మెరుగుప‌ర్చేందుకు సంపూర్ణ స‌హ‌కారం అందించాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌వాసాంధ్రుడు డాక్ట‌ర్ ప్ర‌సాద్ కాక‌ర్ల మాట్లాడుతూ ఒక జిల్లా అధికారిగా ప‌నిచేస్తూ పూర్తి సేవాభావంతో జిల్లా ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ఈ విధంగా ముందుకు రావ‌డం గొప్ప విష‌య‌మ‌ని పేర్కొన్నారు. ప్ర‌వాసాంధ్రుల త‌ర‌ఫున సంపూర్ణ స‌హ‌కారం అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. వీసీలో 108 మంది ప్ర‌వాసాంధ్రులు పాల్గొన‌గా.. ఉత్త‌ర అమెరికా ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధి కోమ‌టి జ‌య‌రామ్ సంధాన క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించారు. క‌లెక్ట‌ర్ లక్ష్మీకాంతం విడిది కార్యాల‌యం నుండి ప్ర‌వాసాంధ్రుల ప్ర‌తినిధిగా ప్ర‌దీప్ కారుటూరి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌వాసాంధ్రులు నాదెండ్ల సురేష్‌, కాశికుర్తి రాజ‌, పామ‌ర్తి రామ‌కృష్ణ‌, న‌ల్ల‌మ‌ల్ల రాధాకృష్ణ‌, రావ్ ఎన్ లింగ‌. గుమ్మ‌డి ర‌త్న‌ప్ర‌సాద్‌, యార్ల‌గ‌డ్డ ర‌వి, వై.కిషోర్ త‌దిత‌రులు జిల్లాలో అమ‌లు జ‌రుగుతున్న ప్రాజెక్టులు, వాటి అమ‌లు తీరును ఆస‌క్తిగా అడిగి తెలుసుకున్నారు.

Just In...