Published On: Thu, Nov 8th, 2018

సిట్ నివేదిక‌తో నా నిర్దోషిత్వం బయటపడింది

* మంత్రి గంటా శ్రీనివాస‌రావు

సెల్ఐటి న్యూస్‌, విశాఖప‌ట్నం: భూ కుంభకోణాలపై సిట్‌ ఇచ్చిన నివేదికతో తన నిర్దోషిత్వం బయటపడిందని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మాన‌వ వ‌న‌రుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ భూ కుంభకోణంపై ప్రభుత్వానికి సిట్‌ నివేదిక సమర్పించిన నేపథ్యంలో విశాఖలో గురువారం మంత్రి గంటా శ్రీనివాస‌రావు మీడియాతో మాట్లాడారు. అడిగిన వెంటనే సిట్‌ విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను అనకాపల్లి ఎంపీగా ఉన్నప్పుడు ఏ ఆస్తులు ఉన్నాయో వాటితో పాటు ఈరోజున సైతం తన పేరిట ఉన్న ఆస్తుల వివరాలను ఎవరు అడిగినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తన ఎదుగుదలను చూడలేకే ఆరోపణలు చేశారని గంటా మండిపడ్డారు. విభజన తర్వాత రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందని ఆరోపించారు. కడప ఉక్కు పరిశ్రమ విషయంలో చాలాకాలం ఎదురుచూశామని పేర్కొన్నారు. విశాఖ రైల్వేజోన్, ‌మెట్రో రైలు‌ అంశాల్లో కేంద్రం న్యాయం చేయలేదని గంటా మండిపడ్డారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై వైకాపా అధ్యక్షుడు జగన్‌, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రాష్ట్రం పట్ల చేసిన తప్పును కాంగ్రెస్‌ పార్టీ తెలుసుకుందన్నారు. అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేకహోదాపైనే చేస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారని.. రాష్ట్రానికి మేలు చేసే రీతిలో ఆ పార్టీ నడుచుకుంటోందని మంత్రి గంటా శ్రీనివాస‌రావు పేర్కొన్నారు.

Just In...