Published On: Thu, Jan 30th, 2020

సివిల్స్‌లో సత్తా చాటిన బస్సు కండక్టర్ …

బెంగుళూరు, సెల్ఐటి న్యూస్‌: పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ ఉండదని ఓ కండక్టర్ నిరూపించారు. కర్ణాటక రాష్ట్రంలో కండక్టర్ ఉద్యోగం చేస్తున్న మధు యూపీఎస్‌సీ ప్రిలిమ్స్ పరీక్షలో తన సత్తా చాటాడు. కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లా మళవల్లికి చెందిన ఎన్.సి.మధు బెంగుళూరులోని కొత్తనూరు 34ఎ బీఎంటీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. మధుకు 19 ఏళ్ల వయస్సులోనే కండక్టర్ ఉద్యోగం వచ్చింది. చిన్నప్పటి నుండి మధుకు చదువుపై మక్కువ ఎక్కువ. ఐఎఎస్ కావాలని మధు కలలు కన్నాడు. కండక్టర్ ఉద్యోగం చేస్తున్న కారణంగా మధు రెగ్యులర్‌గా డిగ్రీ పూర్తి చేయలేదు. దీంతో డిస్టెన్స్ పద్దతిలో డిగ్రీ పూర్తి చేశాడు. అంతే కాదు ఇదే పద్దతిలో పీజీ కూడా పూర్తి చేశాడు. 2014లో కేఎఎస్, 2018, 2019లో యూపీఎస్‌సీ పరీక్షలు రాశాడు. 2019లో కన్నడ మీడియంలో సివిల్స్ రాశాడు. మంచి మార్కులతో ఉత్తీర్థుడయ్యాడు. రాజనీతి శాస్త్రం, జనరల్‌ స్టడీస్‌ను ఎంపిక చేసుకొని రాసిన మెయిన్స్‌ పరీక్షల్లో పాసై ఇంటర్వ్యూకు ఎంపికయ్యాడు. మార్చి 25న ఢిల్లీలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఈ ఇంటర్వ్యూ కోసం మధు ప్రిపేర్ అవుతున్నాడు. యూపీఎస్‌సీ సివిల్స్ పరీక్షల కోసం యూట్యూబ్‌లో సివిల్స్ పరీక్షల మెళకువలను నేర్చుకొన్నాడు. ప్రతిరోజూ ఐదు గంటల పాటు యూట్యూబ్‌లో వీడియోలను చూస్తూ ఐఎఎస్ పరీక్షల కోసం సిద్దమైనట్టుగా మధు తెలిపారు.

Just In...