Published On: Fri, May 18th, 2018

సి.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులపై ఆందోళన వద్దు

* చెక్కులు ఎస్.బి.ఐ కి పంపితే నగదు చెల్లింపు

* సి.ఎఫ్.ఎం.ఎస్ సాంకేతిక లోపాలను సరిచేశాం

* ముఖ్యమంత్రి చంద్రబాబు

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: కొత్తగా ప్రవేశపెట్టిన సమగ్ర ఆర్ధిక నిర్వహణ వ్యవస్థతో కొన్ని సాంకేతిక ఇబ్బందులు వచ్చాయని, వాటిని పరిష్కరించామని, ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఇస్తున్న చెక్కులపై లబ్దిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. తనకు ఇచ్చిన చెక్ (A/c No.34243087405) వెనక్కిచ్చేశారని ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సహాయం మంజూరైన మహిళ వరమ్మ తమ దృష్టికి తెచ్చారని ఆయన చెప్పారు. సి.ఎం.ఆర్.ఎం. ఎస్ ద్వారా చెక్కులు పొందిన లబ్దిదారులకు ఏరకమైన ఆందోళన అవసరం లేదని, వారు తమ చెక్కులను ఆయా శాఖల ద్వారా  విజయవాడ ఎం.జి రోడ్డు (బందరు రోడ్డు)లోని స్టేట్ బ్యాంకుకు పంపించి నగదుగా మార్చుకోవచ్చని ముఖ్యమంత్రి వివరించారు. ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన సి.ఎఫ్.ఎం.ఎస్ వల్ల కొంత అసౌకర్యం తర్వాత మే 1వ తేదీ నుంచి తిరిగి ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఇస్తున్న చెక్కులను నగదుగా మార్చుకోవడానికి వీలుగా రాష్ట్రంలోని అన్ని బ్యాంకులకు ఆదేశాలిచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సి.ఎం.ఆర్.ఎఫ్ సహాయంపై లబ్దిదారుల్లో అపోహలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, సహాయం పొందిన వారు ఇటువంటి దుష్ర్పచారాన్ని నమ్మవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు లబ్దిదారులకు విజ్ఞప్తి చేశారు. సహాయనిధి కింద ఇచ్చే చెక్కులకు డబ్బును ఒకే ఒక్క రోజులోగా చెల్లించే విధంగా చూడాలని ఆర్ధిక శాఖ కార్యదర్శికి తాము ఇప్పటికే ఆదేశాలు జారీచేశామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

Just In...