Published On: Thu, Jul 11th, 2019

సీఎం జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ..

* పోలవరం కుడి కాలువ నుంచి నీటి మళ్లింపునకు విద్యుత్‌ సరఫరా చేయాలని విజ్ఞ‌ప్తి

* సానుకూలంగా స్పందించిన సీఎం జ‌గ‌న్

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఏపి సీఎం వైఎస్ జగన్మోహ‌న్‌రెడ్డితో తెదేపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహ‌న్‌ భేటీ అయ్యారు. పోలవరం కుడి కాలువ నుంచి నీటి మళ్లింపునకు విద్యుత్‌ సరఫరా చేయాలని సీఎంను వంశీ కోరారు. ఇప్పటికే సీఎంకు లేఖ రాసిన వంశీ.. తాజాగా ఆయనతో గురువారం నుంచి ప్రారంభ‌మైన బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా భేటీ అయ్యారు. పోలవరం కుడికాల్వ నుంచి గోదావరి జలాల‌ను త‌న నియోజ‌క‌వ‌ర్గం అయిన గన్నవరం నియోజకవర్గంలోని మెట్ట గ్రామాలకు తరలించేందుకు సహకరించాలని ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే వంశీమోహ‌న్ సీఎంకు విజ్ఞప్తి చేశారు. గత నాలుగేళ్లుగా సొంత ఖర్చులతో 500 మోటార్లు ఏర్పాటు చేసి నీటిని మళ్లించానని, దీనికి అవసరమయ్యే విద్యుత్తును ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందని పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే విద్యుత్తు సరఫరా ఇచ్చేలా ఏపీఎస్పీడీసీఎల్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని వంశీ కోరారు. వంశీ విజ్ఞప్తిపై జగన్‌ సానుకూలంగా స్పందించారు.

Just In...