Published On: Fri, Jun 7th, 2019

సీఎం జగన్ ఆకాంక్షల మేరకు స్వచ్ఛమైన పాలన అందించడమే ధ్యేయం

* ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షల మేరకు అన్ని శాఖలతోనూ సమన్వయం చేసుకుంటూ రాష్ట్రంలో నీతివంతమైన, స్వచ్ఛమైన పాలన అందించడమే ధ్యేయమని ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ వెంకట రమేష్ పెనుమాక (పీవీ రమేష్) స్పష్టం చేశారు. శ్రీశైల దేవస్థానం వేద పండితుల ఆశీర్వచనాల నడుమ ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సచివాలయంలోని ఒకటో బ్లాక్ లో శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఢిల్లీలో విధులు నిర్వహించుకుంటున్న తనపై నమ్మకంతో కీలకమైన బాధ్యతలు అప్పగించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ అవినీతికి తావులేని స్వచ్ఛమైన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, నిర్ధేశించిన కాలంలో ప్రభుత్వ పథకాలన్నీ అర్హులకు చేరాలని సీఎం జగన్ చెప్పారన్నారు. ప్రజా సంక్షేమంపై అంకుఠిత దీక్ష కలిగిన సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామం కావడం తన అదృష్టమన్నారు. గతంలో ఫైనాన్స్, ఆరోగ్య శాఖల్లో విధులు నిర్వర్తించానన్నారు. అన్ని శాఖలతోనూ సమన్వయం చేసుకుంటూ నవరత్నాలు అమలుకు కృషి చేస్తానన్నారు.
అందరికీ ఆరోగ్య శ్రీ సేవలు…
ప్రజలకు నాణ్యమైన ఆరోగ్యం, విద్య, వైద్య సేవలు అందినప్పుడే మెరుగైన సమాజం ఆవిష్కరమవుతుందని ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ వెంకట రమేష్ పెనుమాక(పీవీ రమేష్) అన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా అందరికీ ఆరోగ్య శ్రీ సేవలు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అమలు చేసిన 104, 108, ఆరోగ్య శ్రీ వంటి సేవలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. రాష్ట్రంలో గాడితప్పిన ప్రభుత్వ ఆరోగ్య సేవలను సక్రమంగా ప్రజలందరికీ అందించడమే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రథమ లక్ష్యమని, దీనిలో భాగంగా తన నేతృత్వంలో ఏర్పాటయ్యే కమిటీ ఇందుకు అవసరమైన కసరత్తులు ప్రారంభిస్తుందని ఒక ప్రశ్నకు జవాబిచ్చారు. రాష్ట్రంలో అమలవుతున్న పీపీపీ పద్ధతి సేవలపై అధ్యయనం చేస్తున్నామన్నారు.
డాక్టర్ నుంచి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వరకూ…
తమిళనాడులోని వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కళాశాల నుంచి డాక్టర్ గా పట్టాపొంది ఎం.ఎస్.(జనరల్ సర్జన్) చదువుతూ పీవీ రమేష్ 1985లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కు ఎంపికయ్యారు. ఐఎఎస్ అధికారిగా 34 ఏళ్లలో ఎన్నో కీలక బాధ్యతలు చేపట్టి, మరెన్నో విజయాలు సాధించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలతో పాటు ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధిగా పలు దేశాల్లో కీలక బాధ్యతలు నిర్విర్తించారు. దేశంలో ప్రతి ఇంటికీ విద్యుత్ సదుపాయం కల్పించడంలో ఆర్.ఇ.సి. చైర్మన్, ఎం.డిగా పీవీ రమేష్ విజయవంతమయ్యారు. రాష్ట్రంలోనూ కుటుంబ సంక్షేమం, వైద్య, ఆరోగ్యం, ముఖ్య కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కీలక సేవలందించారు. హెల్త్ యూనివర్శిటీ వైఎస్ చాన్సలర్ గానూ, హైదరాబాద్ నిమ్స్ డైరెక్టర్ గానూ ఎనలేని సేవలు అందించారు.

Just In...