Published On: Mon, Sep 14th, 2020

సీఎం జగన్, విజయసాయిలకు భయం పట్టుకుంది

* డీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: ఆంధ్రప్రదేశ్‌లో నేరగాళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా వైసీపీ మారిపోయిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులపై వివిధ కోర్టుల్లో ఉన్న కేసుల వివరాలు అందజేయాలని రాష్ట్రాల హైకోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశించడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి సహా వైసీపీ నేతలకు భయం పట్టుకుందన్నారు. 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలపై సీరియస్ క్రిమినల్ కేసులు, 9 మంది మంత్రులపై  క్రిమినల్ కేసులు, 7గురు ఎంపీలపై మహిళలపై అత్యాచారాలు చేసిన  కేసులున్నాయన్నారు. సీఎం జగన్‌పై ఉన్నకేసులు 8 ఏళ్లుగా పెండింగులో ఉన్నాయని కళా వెంకట్రావు అన్నారు.
ముఖ్యమంత్రి కుంటి సాకులు చెప్తూ విచారణకు హాజరవటం లేదని విమర్శించారు.
తమపై ఉన్న కేసులు త్వరగా విచారణ చేయాలని సుప్రీం కోర్టుకు జగన్, విజయసాయిరెడ్డి  లేఖ  రాయగలరా? అని ప్రశ్నించారు. జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కాకుండా ఎందుకు విచారణను  ఆలస్యం చేస్తున్నారని నిలదీశారు. ప్రజా జీవితంలో ఉన్నవారు తమ సచ్చీలత నిరూపించుకోవాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. ‘నేను నా అక్రమ సంపాదన’ అనే పుస్తకం వేసి ప్రజలకు  తెలియజేయవచ్చు కదా అని అన్నారు. ముఖ్యమంత్రి,  విజయసాయిరెడ్డి, వైసీపీ నేతలు వారిపై ఉన్న కేసుల విచారణకు కోర్టులకు సహకరించి నిజాయితీ నిరూపించుకోవాలని కళా వెంకట్రావు డిమాండ్ చేశారు.

Just In...