Published On: Sat, Feb 22nd, 2020

సీఎం జ‌గ‌న్‌ను క‌లిసిన మహారాష్ట్ర హోంమంత్రి, ఏపి డీజీపీ

* మహిళలు, చిన్నారులు తీసుకుంటున్న చర్యలపై ప్రశంసలు

* దిశ స్ఫూర్తితో తమ రాష్ట్రంలో మంచి చట్టాలను తీసుకొస్తామని వెల్లడి

* మహిళల భద్రత, రక్షణ విషయంలో ఓ అడుగు ముందుకేశామన్న సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డి

* ‘దిశ’లో భాగంగా తీసుకుంటున్న చర్యలను అమలు చేస్తామని వెల్లడి

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: మహిళలు, చిన్నారుల రక్షణకోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌దేశ్‌ముఖ్, ఆరాష్ట్ర డీజీపీ సుబోద్‌ కుమార్‌ జైశ్వాల్‌ ప్రశంసించారు. దిశచట్టంలోని అంశాలు గొప్ప నిర్ణయాలుగా అభివర్ణించారు. మహిళలు రక్షణ, భద్రత కల్పించమే కాకుండా నేరాన్ని నివారించడానికి ముందస్తుగా తీసుకుంటున్న చర్యలను, దీనికోసం ఏర్పాటుచేసుకున్న ఎమర్జున్సీ వ్యవస్థలపై హర్షం వ్యక్తంచేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ మోహన్ రెడ్డిని అభినందించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని మహారాష్ట్ర హోంమంత్రి, డీజీపీ సహా ఆ రాష్ట్రానికి చెందిన పలువురు అధికారులు కలుసుకున్నారు. చట్టంలో గట్టి నిర్ణయాలను తీసుకోవడమే కాదు, ఆ నిర్ణయాలను అమలుచేసే వ్యవస్థల పర్యవేక్షణ కోసం పోలీసు విభాగం నుంచి ఒక అధికారిని, మహిళా శిశుసంక్షేమశాఖ నుంచి ఒక అధికారిని నియమించడం కూడా చాలా చక్కటి నిర్ణయమని అనిల్‌దేశ్‌ముఖ్‌ వ్యాఖ్యానించారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమం, సమాజంలో దిగువ వర్గాల అభ్యున్నతికోసం తీసుకుంటున్న చర్యలపైకూడా హర్షం వ్యక్తంచేశారు. మహిళలు, చిన్నారుల రక్షణకోసం దిశచట్టం ఒక అడుగని, దీంట్లో పేర్కొన్న అంశాలను అమలు చేసుకుంటూ.. సత్వర న్యాయం జరిగేలా ముందడుగు వేస్తున్నామని, ఈ దిశగా చేయాల్సినవన్నీ చేస్తున్నామని సీఎం అన్నారు. భేటీలో రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనతి, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, దిశ ప్రత్యేక అధికారులు దీపిక, కృతికా శుక్లా ఉన్నారు.

Just In...