Published On: Mon, Apr 16th, 2018

సీఎం దీక్షకు మద్దతుగా సామూహిక దీక్షలు

* తెదేపా స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశంలో నిర్ణయం

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదాతో పాటు విభ‌జ‌న బిల్లులోని హామీల‌ను నెర‌వేర్చాల‌ని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టనున్న నిరసన దీక్షకు మద్దతుగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో సామూహిక దీక్షలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. నియోజకవర్గ దీక్షల్లో ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లు పాల్గొననున్నారు. 13 జిల్లాల్లో 13మంది మంత్రులు దీక్షల్లో పాల్గొని మిగిలిన మంత్రులు రాజధానిలో ముఖ్యమంత్రి దీక్షలో పాల్గొనాల‌ని నిర్ణ‌యించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో సోమ‌వారం వెల‌గ‌పూడిలోని స‌చివాల‌యంలో జ‌రిగిన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్‌ఛార్జ్‌లు హాజరయ్యారు. ఈ నెల 21 నుంచి ప్రతి నియోజకవర్గంలో సైకిల్ యాత్రలు నిర్వహించాలని ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా నేతలకు సూచించారు. పదిహేను నుంచి ఇరవై రోజులపాటు అన్ని గ్రామాల్లో తెదేపా సైకిల్ యాత్రలు నిర్వహించాలని… నియోజకవర్గ కేంద్రాల్లో భారీ బహిరంగ సభలు జరపాలని, అన్ని నియోజకవర్గాలలో ప్రభుత్వ విజయాల పండుగలు నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. రోజుకో విజయం గురించి ప్రచారం చేయాలని… ఒకరోజు సిమెంట్ రోడ్ల గురించి, మరొకరోజు విద్యుత్ విజయాలు, ఇంకో రోజు పింఛన్లపై ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేశారు. పనులు చేయడం ఎంత ముఖ్యమో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం అంతే ముఖ్యమని తెలిపారు. ఏపీలో అభివృద్ధి అద్భుతంగా ఉందని తమిళనాడులో ప్రచారం జరుగుతోందని.. చరిత్రలో గతంలో జరగని అభివృద్ది ఈ నాలుగేళ్లలో చేశామన్నారు. ఆ మోతాదులో వాటి గురించి ప్రచారం చేయలేకపోయామని.. తెదేపా సైకిల్ యాత్రలను సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. సైకిల్ యాత్రలు ప్రజల్లో కదలిక తీసుకురావాలని, జనంలో ఒక ఊపు రావాలన్నారు. నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి చెప్పాలని, సాధించిన విజయాలు వివరించాలని, హక్కుల కోసం చేస్తున్న పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం సూచించారు. వైకాపా ఒక ఫేక్ పార్టీ అని ఫేక్ ఫొటోలు, ఫేక్ వీడియోలు, ఫేక్ ప్రచారం, వాళ్ల రాజకీయమే ఫేక్‌ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
 

Just In...