Published On: Tue, Nov 13th, 2018

సీల్డ్‌కవర్‌లో హైకోర్టుకు జగన్‌ కేసు దర్యాప్తు నివేదిక

సెల్ఐటి న్యూస్‌, క్రైం డెస్క్‌: వైకాపా అధినేత వైఎస్ జగన్మోహ‌న్‌రెడ్డిపై దాడి కేసును మంగళవారం హైకోర్టు విచారించింది. ఈ కేసులో కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులకు నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా కేసులో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర ప్రభుత్వం, ఏపీ, తెలంగాణ హోంశాఖ కార్యదర్శులు, రెండు రాష్ట్రాల డీజీపీలతో పాటు విశాఖ ఏసీపీ, ఎయిర్‌పోర్ట్ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో రెండు వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై జరిగిన దాడికి సంబంధించి వైవీ సుబ్బారెడ్డి, మరో ఇద్దరు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు వివరాలను అడ్వ‌కేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ సీల్డ్ కవర్‌లో ఉన్నత న్యాయస్థానానికి సమర్పించారు. హత్యాయత్నం వెనక కుట్ర దాగి ఉన్నదని.. జగన్ తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి వాదించారు. ఈలోగా దర్యాప్తు తుది నివేదికను స్థానిక కోర్టుకు సమర్పించవద్దని హైకోర్టు సూచించింది. సీల్డ్ కవర్‌లో సమర్పించిన వివరాలను పరిశీలించిన హైకోర్టు పూర్తి స్థాయి విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేసింది.

Just In...