Published On: Fri, Jun 14th, 2019

సుపరిపాలన దిశగా ప్రారంభమైన యాత్ర

* ప్రజా సంక్షేమానికి అందలం

* ప్రణాళికాబద్ధంగా వాగ్దానాల అమలు

* విభజన హామీలకు కేంద్రంతో సంప్రదింపులు

* ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: రాష్ట్ర ప్రజలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, ఈ దిశగా గడచిన పది రోజుల్లో తీసుకున్న విధాన నిర్ణయాలు తమనిజాయితీకి నిబద్ధతకు నిదర్శనమని రాష్ట్ర గవర్నర్ ఈ.ఎస్.ఎల్ నరసింహన్ స్పష్టం చేశారు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం కింద ఇచ్చిన హామీలు కేంద్రం పూర్తిగా నెరవేర్చాలన్న డిమాండే ఈ ప్రభుత్వ అజెండాలో అత్యధిక ప్రాధాన్యత గల అంశమని, వాటిని సాధించే దిశగా ప్రయత్నాలు ఉంటాయని గవర్నర్ అన్నారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. 30 నిమిషాల పాటు సాగిన తన ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలను, తీసుకుంటున్న నిర్ణయాలను వివరించారు. శాసన సభ, శాసన మండలి ఉమ్మడి సమావేశం శుక్ర‌వారం ఉదయం 9 గంటలకు ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు సభ ప్రాంగణానికి చేరుకున్న గవర్నర్ నరసింహన్‌కు శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలి అధ్యక్షుడు ఎం.ఏ. షరీఫ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వాగతం పలికారు. తమ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలిచేందుకు ద్విముఖ వ్యూహం అవలంబిస్తుందని గవర్నర్ స్పష్టం చేశారు. ఒకటి అవినీతిని నిర్ములించి పాలన అందించడం, రెండు సేవల బట్వాడా యంత్రాంగాన్ని ప్రజల ముంగిటకు తెచ్చేందుకు ప్రభావవంతమైన, సమర్థవంతమైన చర్యలు చేపట్టడం. మునుపటి పాలన విధానాలకు పూర్తి భిన్నంగా పారదర్శకత, జవాబుదారి తనంతో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచుతామని గవర్నర్ తెలిపారు. అందుకే రాష్ట్రంలో దర్యాప్తులను నిర్వహించేందుకు వీలుగా సిబిఐ కి గత ప్రభుత్వం ఉపసంహరించిన సాధారణ సమ్మతిని పునరుద్ధరించామని వెల్లడించారు. ఇప్పటి వరకు ఎవరు వినని మరో పెద్ద నిర్ణయం తీసుకున్నామని, వివిధ పనులకు టెండర్లు ఇవ్వడానికి ముందే వాటిని పరిశీలించేందుకు జ్యూడిషయల్ కమిషన్ సహాయాన్ని ప్రభుత్వం కోరిందని గవర్నర్ అన్నారు. పారదర్శకతకు ఇదే నిదర్శనమని తెలిపారు. కులం, మతం, రంగు, రాజకీయాలకు అతీతంగా అర్హులైన అందరికి తమ పాలనలో సంక్షేమ పథకం చేరుతుందని, అవినీతికి ఆస్కారం ఉన్న విచక్షణ అధికారాలన్నిటిని తొలగించేలా చర్యలు కట్టుదిట్టంగా ఉంటాయని గవర్నర్ స్పష్టం చేశారు. అధిక ధర టెండర్ల ద్వారా ప్రభుత్వ ధనం వృధా కాకుండా టెండర్లు, కాంట్రాక్టులను కేటాయించడంలో ద్రవ్యోల్బణ ధోరణులను నిపుణుల కమిటీ పరిశీలిస్తుందని అవసరమైన చోట దిద్దుబాటు చేస్తామని గవర్నర్ తెలిపారు. ఈ ప్రయత్నం దేశంలోనే ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందని చెప్పారు.

ప్రజల ఫిర్యాదుకు 72 గంటల్లో పరిష్కారం …
వివిధ సమస్యలతో ఫిర్యాదు చేసే పౌరుడికి 72 గంటల్లో తమ ప్రభుత్వం పరిష్కారం చూపే గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నామని గవర్నర్ తన ప్రసంగంలో వెల్లడించారు. పూర్తి పారదర్శకత, ప్రజల్లో వంద శాతం సంతృప్తి ఉండేలా ముఖ్యమంత్రి కార్యాలయమే నేరుగా ప్రజా సమస్యలను పర్యవేక్షిస్తుందని ఆయన తెలిపారు. ఒక్కో గ్రామా సచివాలయ పరిథిలో పది మంది యువతకు వాలంటీర్లుగా నెలకు రూ.5 వేలు గౌరవ వేతనంతో నియమిస్తుందని గవర్నర్ వెల్లడించారు.

ఏకీకృత సంక్షేమ ఎజెండా – నవరత్నాలు ….
మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి భావజాలానికి అనుగుణంగా పేదలు, నిరుపేదలు, అభాగ్యులకు సహాయపడే లా నవరత్నాలు అమలు చేస్తున్నట్టు గవర్నర్ వెల్లడించారు. వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్సుమెంట్, వైఎస్ఆర్ పింఛన్, పేదలందరికీ గృహాలు, యువతకు ఉపాధి, ఉద్యోగ కల్పనా, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, దశల వారీగా మద్యనిషేధం, జలయజ్ఞం సమర్థవంతంగా అమలు ప్రారంభించినట్టు గవర్నర్ చెప్పారు.

రైతు సంక్షేమం…
రైతు సంక్షేమం పైనే తమ ప్రభుత్వం అధిక దృష్టి పెడుతుందని గవర్నర్ వెల్లడించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు- వాటి పరిష్కారంతో పాటు రైతుకు సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడానికి రాష్ట్ర రైతు కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు గవర్నర్ తన ప్రసంగంలో వెల్లడించారు. సాగు వ్యయం తగ్గించడమే కాకుండా వ్యవసాయ కార్మికులకు తగు విధంగా పని కల్పించే విధానాన్ని కూడా తమ ప్రభుత్వం రూపొందిస్తుందని గవర్నర్ తెలిపారు. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ఈ రబి కాలంలోనే అక్టోబర్ 15 నుండి ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.12,500 చెల్లిస్తామని గవర్నర్ ప్రకటించారు. హామీ ఇచ్చిన దానికంటే సంవత్సరం ముందుగానే ఈ పథకాన్ని అమలులోకి తెస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా రూ.10,000 కోట్లు రైతులకు చేరుతుందని, దీనిలో ఐదో వంతు నిధులు కౌలు రైతులకు కూడా అందుతాయని గవర్నర్ వెల్లడించారు. వ్యవసాయ భూముల యజమానులు ప్రయోజనాలకు, హక్కులకు భంగం కలగకుండానే కౌలు రైతుల హక్కులను కూడా పరిరక్షిస్తామని గవర్నర్ స్పష్టం చేశారు.

బలహీన వర్గాలకు ప్రాధాన్యత…
ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లోని నిరుద్యోగ యువతకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని గవర్నర్ నరసింహన్ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో కాపు సంక్షేమానికి రూ. 10,000 కోట్లు కేటాయిస్తామని గవర్నర్ చెప్పారు. గ్రామ సచివాలయాల్లో పోస్టుల భర్తీ ద్వారా 1.60 లక్షలమందికి ఉపాధి కల్పిస్తామని గవర్నర్ తెలిపారు.మహిళల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు గవర్నర్ నరసింహన్. వాగ్దానాలను అమలు చేయడంలో తం ప్రభుత్వం నిబద్ధతతో వ్యవహరిస్తుందని, గడచిన పది రోజుల్లో తీసుకున్న నిర్ణయాలే దీనికి అద్దం పడుతుందని గవర్నర్ ఈ నిర్న్యాయాలను తన ప్రసంగంలో వివరించారు.

* పెరిగిన పింఛను రూ. 2250
* ఆశా వర్కర్లకు పెరిగిన జీతం రూ.10,000
* కాంట్రిబ్యూటరీ పింఛను పథకం రద్దుకు కమిటీ ఏర్పాటు
* అమ్మ ఒడి పథకం అమలుకు విధి విధానాల మదింపు
* ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీ విలీనానికి కమిటీ
* పురపాలక పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు రూ.18వేల‌కు పెంపు
* వచ్చే జులై నుంచి ఉద్యోగులకు అందనున్న 27 శాతం మధ్యంతర భృతి
* సామాజిక ఆరోగ్య కార్యకర్తల జీతాలు రూ.4వేల‌కు పెంపు
* అంగన్‌వాడీ, హోంగార్డులకు వేతనాల పెంపు
* 2020 ఉగాది నుండి పేదలకు 25 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ
* నూతన ఇసుక విధానంతో అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట

సుపరిపాలనకు నాంది…
కొత్త ప్రభుత్వానికి తక్షణ సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని గవర్నర్ అన్నారు. తన ప్రభుత్వానికి దాదాపు ఖాళీ ఖజానా సంక్రమించిందని, అందువల్ల ప్రజా ధనాన్ని, ఇతర వనరులను జవాబుదారీగా, సమర్థవంతంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజానికానికి సంతృప్తికరమైన ప్రజా సేవలు అందించే అన్ని చర్యలు తీసుకుంటామనే విశ్వాసం ఉందని గవర్నర్ అన్నారు. “సుపరిపాలన అందించడానికి యాత్ర మొదలైంది. మనం ఆశించిన మార్పు 5 కోట్ల ప్రజానీకం సంపూర్ణ సహకారం మద్దతు తోనే వీలవుతుంది. కేంద్ర ప్రభుత్వం, పొరుగు రాష్ట్రాల సహకారంతో ప్రభుత్వం ధృడ నిశ్చయంతో ముందుకు అడుగు వేస్తుంది. సుస్పష్టమైన ప్రజా తీర్పును దృష్టి లో ఉంచుకుని అయిదు కోట్ల ప్రజల ఆశయాలు, ఆకాంక్షల మేరకు, వారి కళలు సాకారం చేయడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది ” అని గవర్నర్ నరసింహన్ స్పష్టం చేసారు. ఉపనిషత్తులోని శాంతి మంత్రంతో తన ప్రసంగాన్ని ముగించారు. జాతీయ గీతాలాపనతో ప్రారంభమైన సభ కార్యక్రమం మళ్ళీ జాతీయ గీతాలాపనతో ముగిసింది.

   

Just In...