Published On: Thu, Aug 17th, 2017

సేంద్రీయ పంట‌లు పండించే రైతుల‌కు ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ తప్పనిసరి

* ఉద్యాన శాఖ క‌మిష‌న‌ర్ చిరంజీవి చౌద‌రి

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించే రైతులు తమ ఉత్పత్తులను ప్రీమియం ధరకు అమ్మాలంటే ముందుగా ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ తప్పనిసరిగా తీసుకోవాలని ఉద్యాన శాఖ కమిషనర్‌ చిరంజీవి చౌదరి అన్నారు. నగరంలోని సిద్ధార్థ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలలో నిర్వహిస్తున్న ఆర్గానిక్‌ ఎక్స్‌పోలో భాగంగా రెండో రోజైన బుధవారం రైతులకు ప్ర‌త్యేక శిక్షణ తరగతులను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మూడేళ్ల పాటు నిరంతరం సేంద్రియ పద్ధతులను పాటించి పంటలను పండిస్తే రైతులకు మొదటి సంవత్సరం ఇన్‌ కన్వర్షన్‌ సర్టిఫికెట్‌ ఇస్తారన్నారు. మూడో సంవత్సరం పూర్తయ్యేసరికి పూర్తి సర్టిఫికెట్‌ ఇస్తారని చెప్పారు. సర్టిఫికెట్‌ పొందిన రైతులు ఈ ఉత్పత్తుల మార్కెట్‌లో తమ పంటను మంచి ధరకు అమ్మవచ్చని పేర్కొన్నారు. దళారుల బెడద లేకుండా నేరుగా వినియోగదారునికి అందించవచ్చని తెలిపారు. సదస్సులో వేదిక్‌ ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ ఏజన్సీ నుంచి డాక్టర్‌ మౌనిష్‌, అత్తిలి ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ ఉపాధ్యక్షుడు నారాయణ రైతులు, ఉత్పత్తిదారుల సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం నర్సరీ మేనేజ్‌మెంట్‌ రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సును నిర్వహించారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, కడప జిల్లాల నుంచి దాదాపు 200 మంది రైతులు పాల్గొని నర్సరీ పెంపకంలో ఆధునిక పద్ధతులు గురించి నర్సరీలో చీడపీడీల నివారణ గురించి అవగాహన కల్పించారు. ఈ సదస్సులో డాక్టర్‌ వై.ఎస్‌.ఆర్‌ హార్టికల్చర్‌ యూనివర్శిటీ, ఎన్‌హెచ్‌బి, ఎన్‌ఐపీహెచ్‌ఎం నుంచి శాస్త్రవేత్తలు పాల్గొని చర్చించారు. ఉద్యాన శాఖ నుంచి ధర్మజ, డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌, ఏపీఎంఐపి నుంచి ప్రాజెక్టు ఆఫీసర్‌ సూర్యప్రకాష్‌, నెటాఫిన్‌ నుంచి సుబ్బారావు, జైన్‌ ఇరిగేషన్‌ సిస్టమ్‌ వారు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా సూక్ష్మ సేద్యం గురించి నర్సరీ రైతులకు వివరించారు. సేంద్రియ పద్ధతుల్లో ఉద్యాన పంటలు పండించే రైతులు, బయ్యర్స్‌ సమావేశాన్ని నిర్వహించారు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల రైతులు ఇందులో పాల్గొన్నారు. ఏపీఎంఐపీ ప్రాజెక్టు ఆఫీసర్‌ సూర్యప్రకాష్‌, డీడీహెచ్‌లు పావులూరి హనుమంతరావు, ఎస్‌.రామమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

organic_farming_certification_3 organic_farming_certification_2 organic_farming_certification_4 organic_farming_certification_5 organic_farming_certification_1

Just In...