Published On: Tue, Nov 26th, 2019

సేల్స్ ఫోర్స్ ఏడీఎక్స్ 2019 టెక్నాలజీపై ఆరు రోజుల కార్యశాల

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ఐసీటీ అకాడమీ సహకారంతో సేల్స్ ఫోర్స్ ఏడీఎక్స్ 2019 టెక్నాలజీపై ఆరు రోజుల కార్యశాల సోమ‌వారం నుండి ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా యువతకు ఉద్యోగ అవకాశాలు అందిస్తున్న తొలి 10 నైపుణ్యాలలో సేల్స్ ఫోర్స్ సాఫ్ట్వేర్ అగ్రగామిగా నిలిచిందని ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లోని ఏ విశ్వవిద్యాలయం, కళాశాల కూడా ఈ అత్యాధునిక టెక్నాలజీని  పరిమితుల వల్ల పాఠ్యాంశాలలో చేర్చలేకపోయాయని కానీ  ఐసీటీ అకాడమీ నిపుణుల సహకారంతో తమ విద్యార్థులకు ఈ కార్యశాల నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. వర్కుషాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కృష్ణా విశ్వవిద్యాలయం ఇన్చార్జ్ వైస్ ఛాన్సలర్ ఆచార్య వై సుందర కృష్ణ మాట్లాడుతూ ఐటీ రంగంలో వేగంగా మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా విద్యార్థులు అంతర్జాలం ద్వారా లేదా ఇటువంటి కార్యశాలల ద్వారా తమ సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. సేల్స్ ఫోర్స్, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలలో విస్తృతంగా  ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఐసీటీ అకాడమీ తరఫున ఈ కార్యశాల శిక్షకుడిగా విచ్చేసిన క్రాంతికుమార్ ఆరు రోజులపాటు జరిగే శిక్షణా ప్రణాళికను, విద్యార్థులు పూర్తి చేయవలసిన సూపర్ బ్యాడ్జీల వివరాలను తెలియజేశారు. ఈ కార్యశాల సమన్వయకర్త కావూరి శ్రీధర్ మాట్లాడుతూ కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవసరమైన ఆధునిక నైపుణ్యాలను అందించేందుకు ఐసీటీ అకాడమీ సహకారంతో తరచుగా ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి  డాక్టర్ టీ.యస్. రవికిరణ్, అధ్యాపకులు శంకరానంద్, శివకుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.

Just In...