Published On: Tue, Mar 12th, 2019

సోష‌ల్ మీడియాపై నిఘా

* సోషల్ మీడియాలలో వచ్చే ప్రతికూల వార్తల పరిశీలనకు క‌మిటీ ఏర్పాటు

* రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది 

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: వివిధ పత్రికలలో, మాధ్యమాలలో, సోషల్ మీడియాలలో వచ్చే ప్రతికూల వార్తల పరిశీలన కోసం రాష్ట్ర స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ మరియు పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. మంగళవారం సచివాలయంలోని 5వ బ్లాకులో మీడియా సర్టిఫికేషన్ మరియు పర్యవేక్షణ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ద్వివేది మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ఎంసీఎంసీ కమిటీ పనిచేయడం ప్రారంభించిందన్నారు. వివిధ రాజకీయ పార్టీలు చేసే ప్రచారంపై దృష్టి కేంద్రీకరిస్తామని, రాష్ట్ర స్థాయిలో చేపట్టే కార్యక్రమాల అనుమతుల కోసం రాష్ట్ర స్థాయి ఎంసీఎంసీ కమిటీకి రాజకీయ పార్టీలు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుందన్నారు. సాధారణంగా జిల్లా స్థాయి కమిటీ అధ్వర్యంలోని అనుమతులను జారీ చేయడం జరుగుతుందని, వారి పరిధిలోకి రానివి రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలిస్తుందన్నారు. పార్టీలు, అభ్యర్ధులు చేసే ఖర్చులు, ప్రచారాలు జిల్లా పరిధిలోని కమిటీ పరిశీలించడం జరుగుతుందన్నారు. ఆయా పార్టీలు, అభ్యర్ధులు కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా ప్రవేశపెట్టిన “న్యూ సువిధ” యాప్ ద్వారా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సివుంటుందన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకులోబడి దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర స్థాయిలో ఏర్పాటుచేసిన న‌లుగురు సభ్యుల కమిటీ అందుకు అనుగుణంగా అనుమతులను ఇవ్వడం జరుగుతుందన్నారు. వ్యక్తిగత దూషణలు, ఇతరులను కించపరిచే సంభాషణలు వంటి వాటిని ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా పరిగణించడం జరుగుతుందన్నారు. ఈ కమిటీకి   ఛైర్మన్¬గా అదనపు సిఈఓ వివేక్ యాదవ్ వ్యవహరిస్తారని, సభ్యులుగా జాయింట్ సిఈఓ డి. మార్కండేయులు, దూరదర్శన్ డైరెక్టర్ డి.సురేష్‌కుమార్, సమాచార శాఖ జాయింట్ డైరెక్టరు పి.కిరణ్‌కుమార్‌లను నియమించడం జరిగిందన్నారు. ఈ కమిటీలో కందుల రమేష్, విజయ్‌కుమార్‌లు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యే అంశాల పరిశీలనకు కమిటీకి నివేదికలను అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కమిటీ ఆయా రాజకీయ పార్టీలు చేసే దరఖాస్తులు, జిల్లా ఎన్నికల అధికారుల నుంచి వచ్చే దరఖాస్తుల పరిశీలన కోసం సందర్భానుసారం సమావేశం నిర్వహించి అందుకు అనుగుణంగా అనుమతులపై ఉత్తర్వులను జారీ చేస్తారన్నారు. ఎంసీఎంసీ కమిటీ మానిటరింగ్ సెల్ అధ్వర్యంలో వార్తా విశ్లేషణలు, ఇతర ప్రసారా మాధ్యమాల వార్తల పరిశీలన కోసం ప్రత్యేక సెల్ పనిచేయడం జరుగుతుందని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మ్యాగ్జేన్ ఎడిటర్ కందుల రమేష్, సీనియర్ జర్నలిస్ట్ విజయ‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Just In...