Published On: Fri, May 18th, 2018

సౌర విద్యుత్తుతో న‌డిచే పంపు సెట్ల వినియోగంలో రాష్ట్రంలోనే కృష్ణా ఫ‌స్ట్‌

* కలెక్టర్‌ను స‌త్క‌రించిన రైతులు 

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: సౌర విద్యుత్తుతో నడిచే పంపు సెట్ల వినియోగంలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నట్లు కలెక్టరు బి.లక్ష్మీకాంతం తెలిపారు. సౌర పంపు సెట్ల లబ్ధిదారులైన రైతులు, విద్యాసంస్థల ప్రతినిధులు విజ‌య‌వాడ‌లోని క‌లెక్ట‌ర్ విడిది కార్యాలయంలో బుధవారం కలెక్టర్ ల‌క్ష్మీకాంతంను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ల‌క్ష్మీకాంతం మాట్లాడుతూ.. 2400 పంపు సెట్లను రైతులకు అందించినట్లు చెప్పారు. ఎన్టీఆర్‌ జలసిరిలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రూ.6 వేలు, ఓసీ, బీసీలకు రూ.25 వేలతో నామ మాత్రపు రుసుమును లబ్ధిదారుని వాటాగా చెల్లిస్తే, మిగతా మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నూజివీడు సమీపంలోని సుంకొల్లు తండాకు చెందిన భూక్యారాజు, బాణావతు రాజు, వదిత్యారాజు తదితరులు మాట్లాడుతూ.. సౌర పంపు సెట్ల వల్ల ప్రతి ఏటా రూ.50 వేల నుంచి రూ.60 వేల విలువైన విద్యుత్తును ఆదా చేస్తున్నట్టు తెలిపారు. దుర్గామల్లేశ్వర ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూట్‌, పీవీపీ సిద్ధార్థ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, వీఆర్‌ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాల, ఉషారామ ఎడ్యుకేషన్‌ అకాడమీ, లకిరెడ్డి బాలిరెడ్డి చారిటబుల్‌ ట్రస్టు, కొల్లి రామయ్య ఎడ్యుకేషన్‌ సొసైటీకి చెందిన ప్రతినిధులు మాట్లాడుతూ.. రాయితీతో కూడిన సౌర విద్యుత్తు ద్వారా నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ విద్యుత్తు బిల్లుల ఆదా అవుతోందని వివరించారు. కార్యక్రమంలో నెడ్‌ క్యాప్‌ జిల్లా మేనేజర్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Just In...