Published On: Wed, Feb 12th, 2020

స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీగా మార్పులు…

* స్థానికులకే అధిక ప్రాధాన్యం

* అవకతవకలు జరిగితే ఎన్నిక రద్దు

* ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే జైలుకే

* మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: స్థానిక సంస్థలైన పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలను తీసుకుందని రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సచివాలయంలోని ప్రచార విభాగంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి ఎన్నికల నియమావళిలో మార్పులు తీసుకువచ్చినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రామ సచివాలయ వ్యవస్థను అమలులోకి తీసుకువచ్చిన నేపథ్యంలో ప్రతీ 50 ఇళ్లకు ఒక వలంటీర్, ప్రతీ 2వేల కుటుంబాలకు గ్రామ సచివాలయ వ్యవస్థలను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. స్థానికంగా నివాసం ఉంటున్నవారికే పోటీ చేసే అవకాశం ఇవ్వాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ప్రకటించారు. మంత్రి మండలి సమావేశంలో చర్చించిన తరువాత పంచాయతీ కార్యకలాపాలల్లో మార్పులను తీసుకురావడం జరిగిందని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రజల సమస్యలను గుర్తించి, వారి ఆకాంక్షలను నెరవేర్చే వ్యక్తులే ప్రజాప్రతినిధులుగా ముందుకు సాగాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి వ్యాఖ్యానించారు. డబ్బు ఉందని కొందరు ప్రతిష్ట కోసం స్థానిక సంస్థల పదవులకు పోటీ చేస్తున్నారని,   గెలిచిన తరువాత ఆ ఊరిని, ఆ వార్డును, ఆ మున్సిపాలిటీని, ఆ డివిజన్ ను విడిచిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గెలిపించిన ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నారనే విమర్శలు ఉన్నాయని  వాపోయారు. దీనివల్ల స్థానికంగా ఏ సమస్య వచ్చినా ప్రజలు ఎవరికి మొరపెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి తలెత్తుతుందన్నారు. మౌలికపరమైన అంశాన్ని పరిశీలించిన తమ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుందని పేర్కొన్నారు. మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాలను క్షుణ్ణంగా చర్చించి వాటికి ఆమోదం తెలిపామన్నారు. ప్రజల పట్ల బాధ్యత, వారి సమస్యల పట్ల అవగాహన ఉన్నవారే రాజకీయాల్లోకి రావాలని ఈ సందర్భంగా గ్రామస్థాయిలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్న వారికి సేవ చేసే అవకాశాలను కల్పిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రజల కష్టాలను, సమస్యలను అర్థం చేసుకుని పనిచేసే వ్యక్తులకు పెద్దపీట వేయాలనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. అలాంటి నిజాయితీపరులు, ప్రజల కోసం పరితపించే వారే ప్రజలకు ప్రతినిధులుగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటుందన్నారు. గతంలో సర్పంచ్ ల నుంచి ఎంపిపిలు, ఎంపిటిసిలు, జెడ్పీటీసిలు కూడా పల్లెలకు అందుబాటులో లేకుండా, ఎక్కడో పట్టణాల్లో ఉంటూ వారిని పట్టించుకోని  పరిస్థితిని చూశామని మంత్రి  గుర్తుచేశారు. స్థానికంగానే ప్రజా ప్రతినిధులు నివాసం ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి  పేర్కొన్నారు.  పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్ధులు మద్యం, డబ్బు పంపిణీకి పాల్పడినట్లు రుజువైతే, ఆ వ్యక్తులు గెలిచిప్పటికీ ఆ పదవుల్లో కొనసాగేందుకు అనర్హులుగా మారతారని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి సెక్షన్ 211 ప్రకారం అక్రమ మార్గాల ద్వారా  ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా గానీ ఓటర్లను ప్రలోభ పరచడం, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా చేయడం వంటి నేరాలకు పాల్పడితే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.10వేల వరకు జరిమానా విధించేలా మార్పులను తీసుకువచ్చామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఎక్కువ రోజుల పాటు ఉండటం వల్ల అభివృద్థి కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నాయని తెలిపారు. ఈ కాలపరిమితిని సెక్షన్ 201-A (1), A (2) ద్వారా తగ్గిస్తూ తీర్మానం చేయడం జరిగిందని వివరించారు. ఎంపిటిసి, జెడ్పీటిసి ఎన్నికలు 18 రోజుల్లో నిర్వహించాలని, గ్రామపంచాయతీ ఎన్నికలు 13 రోజుల్లో నిర్వహించాలని నిర్ణయించామన్నారు. పంచాయతీరాజ్‌ చట్టం సెక్షన్ -25 కి సవరణలు చేయడం ద్వారా గ్రామపంచాయతీ సర్పంచ్ లకు అదనపు బాధ్యతలు అప్పగించేలా మార్పులు తెచ్చామన్నారు. పారిశుధ్య నిర్వహణ, మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ బాధ్యతలను సర్పంచ్ లకు అప్పగించాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. సర్పంచ్ పంచాయతీ పరిధి గ్రామంలోనే నివసించాల్సి ఉంటుందన్నారు. పంచాయతీ కార్యాలయానికి క్రమం తప్పకుండా సర్పంచ్ హాజరు కావాల్సి ఉంటుందన్నారు.
గ్రామపంచాయతీలను ప్రాదేశిక నియోజకవర్గంగా  “వార్డు “ను గుర్తిస్తామన్నారు. గిరిజన జనాభా ఉన్న పంచాయతీల్లో గ్రామ సర్పంచ్ పదవిని (సెక్షన్ 15(1), (a) కింద, వార్డు సభ్యుల పదవులను (సెక్షన్ 9 (1) (a) కింద అన్నింటిని గిరిజనులకే రిజర్వు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి వివరించారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని జెడ్పీటిసి స్థానాలను గిరిజనులకే రిజర్వ్ చేస్తూ ( సెక్షన్ 242D ప్రకారం) నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 6, ప్రభుత్వ ఉత్తర్వులు 791 (సాధారణ పరిపాలనా శాఖ, తేదీ 7.11.2013) ప్రకారం గ్రామసభలను నిర్వహించకపోయినా, పంచాయతీ వ్యయాల అకౌంట్ లను నిర్ణీత కాలంలో ఆడిట్ చేయించకపోయినా సదరు సర్పంచ్, ఉపసర్పంచ్ లను పదవుల నుంచి తొలగించడం జరుగుతుందని మంత్రి ప్రకటించారు. తద్వారా సర్పంచ్, ఉపసర్పంచ్ లకు మరింత జవాబుదారీతనం పెరుగుతుందన్నారు.పంచాయతీ ఎన్నికలు అనగానే గ్రామాల్లో హడావుడి, ప్రలోభాల పర్వం చూస్తున్నామన్నారు. ఎన్నికల తేదీ ప్రకటించగానే భారీఎత్తున మద్యాన్ని పల్లెలకు తరలించి, తాగించి, డబ్బుపంపిణీతో ప్రలోభాలకు గురి చేయకుండా తగిన విధంగా మార్పులను తెచ్చామన్నారు. రాజకీయ పార్టీలకు ఈ ఎన్నికలతో ప్రత్యక్ష్యంగా సంబంధం లేక పోయినా, ఈ పదవులను ఒక ఆలంబనగా తీసుకోవడం వల్ల, ప్రతిష్టకు పోయి లక్షలకు లక్షలు ఖర్చు పెడుతున్నారన్నారు.  ఇకనుంచి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఏదో రకంగా పదవుల్లోకి రావాలనే వారికి ప్రభుత్వ నిబంధనలు చెంపపెట్టులా ఉంటాయన్నారు.  ఆహ్లాదకర వాతావరణంలో ప్రజలు మెచ్చిన వ్యక్తులు స్థానిక సంస్థల ప్రతినిధులుగా ఎన్నిక కావాలనేది ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి మద్య నియంత్రణ, ఆరోగ్యకర సమాజం కోసం ప్రభుత్వం  పని చేస్తుందన్నారు.  స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రభుత్వ స్పూర్తితో నిర్వహించాలనేది మంత్రులందరూ వ్యక్తం చేసిన అభిప్రాయమన్నారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని గతంలో 24 రోజులు ఉంటే దానిని 13 నుంచి 17 రోజులకు తగ్గించామన్నారు. ఎన్నికల ప్రచార కాలపరిమితిని 5 నుంచి 7 రోజులకు పరిమితం చేశామన్నారు. ఈ సందర్భంగా అభివృద్థి వికేంద్రీకరణతో మూడు ప్రాంతాల్లోని ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

 

Just In...