Published On: Thu, Apr 18th, 2019

స్వరాజ్యమైదానంలో సమ్మర్ ఎగ్జిబిషన్ ప్రారంభం

* కొలువుదీరిన 35 ర‌కాల ఎమ్యూజ్‌మెంట్‌ రైడ్స్‌, 150కి పైగా స్టాల్స్

* నెల రోజులపాటు సంద‌ర్శ‌కుల‌కు క‌నువిందు

* ప్రతిరోజు కళావేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: వేసవిలో చ‌ల్ల‌ని సాయంత్రం వేళ న‌గ‌రవాసుల‌కు ఆహ్లాదం, ఆన‌దం కలిగించేెందుకు సమ్మర్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయ‌డం జరిగిందని శ్రీ క్రియేటర్స్ అధినేతలు గరిమెళ్ళ నానయ్య చౌదరి, గరిమెళ్ళ జానకి రామయ్య తెలిపారు. విజ‌య‌వాడ స్వ‌రాజ్య‌మైదానంలో గురువారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ
స్వరాజ్యమైదానంలో ఏర్పాటు చేసిన స‌మ్మ‌ర్ స్పెష‌ల్ ఎగ్జిబిషన్‌ను శుక్రవారం సాయంత్రం కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బ‌న్ క‌త్తిరించి ప్రారంభిస్తారని చెప్పారు. ఎన్నో సంవ‌త్స‌రాల అనుభ‌వంతో విజ‌య‌వాడ మ‌హాన‌గ‌రంలో సంద‌ర్శ‌కుల‌ను ఆక‌ట్టుకునేలా స్వరాజ్య‌మైదానంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిష‌న్‌లో అతిపెద్ద జెయింట్‌విల్‌తో పాటు, 60 అడుగుల లోతు బావిలో కారు, బైక్ రైడ్ ఎగ్జిబిషన్ ప్రత్యేకత అన్నారు. కొలంబస్, కప్ అండ్ సాసర్, కమెండో, ట్రైన్, బ్రేక్ డ్యాన్స్ షో వంటి 35కు పైగా లేటెస్ట్ ఎమ్యూజిమెంట్ రైడ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే 150కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. అదేవిధంగా ఫుడ్ కోర్ట్స్‌, వివిధ రాష్ట్రాల‌కు చెందిన దుస్తులు, కలంకారీ వస్తువులు, కాటన్ వస్త్రాలు, ప్లాస్టిక్ ఐటెమ్స్, క్రోకరీ ఐటెమ్స్ చేనేత త‌దిత‌ర ఉత్ప‌త్తులు ఎగ్జిబిష‌న్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో అందుబాటు ధ‌ర‌ల్లో ల‌భిస్తాయ‌ని పేర్కొన్నారు. ఎగ్జిబిష‌న్ నెల రోజులపాటు ప్ర‌తిరోజూ సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగుతుంద‌న్నారు. ఈ ప్ర‌ద‌ర్శ‌న‌ను న‌గ‌ర‌వాసులు సద్వినియోగం చేసుకోవాల‌ని వారు కోరారు. ప్రతిరోజు గరిమెళ్ళ సుబ్బారావు కళావేదికపై వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని, ఈ క్రమంలోనే కళాకారులను సన్మానించడం జరుగుతుందని తెలిపారు. విలేకరుల సమావేశంలో బి.వెంకట్, టి.శివ తదితరులు పాల్గొన్నారు.

Just In...