Published On: Sat, Apr 4th, 2020

స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోండి..

* విజ‌య‌వాడ పోలీస్ క‌మిష‌న‌ర్ ద్వార‌కా తిరుమ‌ల‌రావు విజ్ఞ‌ప్తి

* కుమ్మ‌రిపాలెం సెంట‌ర్‌లో కంటోన్మెంట్ జోన్ ప‌రిశీల‌న

విజయవాడ, సెల్ఐటి న్యూస్‌: క‌రోనా వైర‌స్‌కు సంబంధించి న‌గ‌రంలో మొత్తం18 కేసులు నమోద‌య్యాయ‌ని విజ‌య‌వాడ పోలీస్ కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. క‌రోనా వైర‌స్ ప్ర‌మాద ఘంటిక‌లు మ్రోగ‌డంతో పాత‌బ‌స్తీలోని గ‌ట్టువెనుక ప్రాంతంలో ఉన్న కుమ్మ‌రిపాలెం సెంట‌ర్‌ను పోలీసులు కంటోన్మెంట్ జోన్ ప్రకటిస్తూ రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఈ సంద‌ర్భంగా కుమ్మ‌రిపాలెం సెంట‌ర్‌కు శ‌నివారం ఉద‌యం విచ్చేసిన సీపీ ద్వారకా తిరుమ‌ల‌రావు మాట్లాడుతూ ఇదే ప్రాంతంలో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ వ‌చ్చింద‌న్నారు. ప్రజల్లో ధైర్యం నింపేందుకే ఈ ప్రాంతంలో పర్యటించినట్లు సీపీ తెలిపారు. ఆయ‌న మాట్లాడుతూ విజయవాడ లో మొత్తం18 కేసులు నమోద‌య్యాయి. 11కేసులు ఢీల్లి నిజాముద్దీన్ సమావేశంలో పాల్గొన్న‌వారే. 5 కేసులు విదేశాల నుండి వచ్చినవారు ఉన్నారు. పాజిటీవ్ కేసుల వ్యక్తుల కుటుంబ సభ్యులకు వైద్య పరిక్షలు నిర్వహిస్తున్నాం. డీల్లి సదస్సుకు వెళ్ళి వచ్చిన‌ వ్యక్తి కుటుంబంలో ఐదుగురు కరోనా పాజిటీవ్ వచ్చింది. కరోనా కారణంగా ఈ కుటుంబలో అతని తండ్రి చనిపోయారు. మేము ఎవరిని తప్పు పట్టటంలేదు.. డిల్లీ సదస్సుకు వెళ్ళి వచ్చిన వారు, వారిని కలిసిన వారు తప్పనిసరిగా వైద్య పరిక్షలు నిర్వహించుకోవాలి. చాలామంది స్వచ్చందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. మిగతావారు కూడా ముందుకు రావాలని కోరుతున్నాం. విజయవాడ నగరంలో కొన్ని ప్రాంతాలలో ఆంక్షలు విధించాం. మరికొన్ని కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించాం. రాష్ట్రంలో కరోనా తొలి మరణం విజయవాడలో జరగడం బాధాకరం. ఈ ప్రాంతంలో 67మంది స్వచ్ఛందంగా క్వారంటైన్ సెంటర్లకు రావ‌డం శుభ‌ప‌రిణామం. వారిని గంగూరు ప్రాంతంలో పర్యవేక్షణలో ఉంచాం. ప్రజలు కూడా స్వీయ నియంత్రణ పాటిస్తేనే కరోనా వ్యాప్తిని నిరోధించవచ్చు అని సీపీ ద్వార‌కా తిరుమ‌ల‌రావు స్ప‌ష్టం చేశారు. కార్య‌క్ర‌మంలో డీసీపి విక్రాంత్ పాటిల్‌, ఏసీపీ సుధాక‌ర్‌, భ‌వానీపురం సీఐ మోహ‌న్‌రెడ్డి, ఎస్ఐలు ఇజ్రాయేల్‌, క‌విత త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

Just In...