Published On: Mon, Mar 11th, 2019

స్వ‌ల్ప త‌ప్పిదాల‌కు సైతం ఆస్కారం ఉండ‌కూడ‌దు

* ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌ధ్య‌నిషేధ‌ము, అబ్కారీ శాఖ క‌మీష‌న‌ర్ ముఖేష్‌కుమార్ మీనా

* ఎన్నిక‌ల వేళ అద‌నంగా మ‌రో 40 స‌రిహ‌ద్దు త‌నిఖీ కేంద్రాలు 

* రానున్న ప‌దిరోజుల పాటు ప్ర‌త్యేక డ్రైవ్‌లు

* ఆయా జిల్లాల‌కు న‌లుగురు ప్ర‌త్యేక అధికారుల నియామకం 

* గ‌తేడాది ఇండెట్ మేర‌కే ఇప్ప‌టి మ‌ద్యం స‌ర‌ఫ‌రా

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ నోటిఫికేష‌న్ వెలువ‌డిన నేప‌ధ్యంలో ఉన్న‌తస్దాయి అదికారి మొద‌లు సాధార‌ణ కానిస్టేబుల్ వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌ధ్య‌నిషేధ‌ము, అబ్కారీ శాఖ క‌మీష‌న‌ర్ ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. ప్ర‌స్తుత ప‌రిస్డితుల‌లో ఎన్నిక‌ల క‌మీష‌న్ దృష్టి అబ్కారీ శాఖపైనే ఉంటుంద‌ని స్వ‌ల్ప త‌ప్పిదాల‌కు కూడా అస్కారం ఇవ్వ‌ని రీతిలో వ్య‌వ‌హ‌రించాల‌ని హెచ్చ‌రించారు. ఈ సంద‌ర్భంగా విజ‌య‌వాడ ప్ర‌సాదంపాడులోని ఎక్సైజ్ క‌మీష‌న‌ర్ కార్యాల‌యంలో సోమ‌వారం ఎన్నిక‌ల స‌న్న‌ద్ధ‌త‌పై మీనా ఉన్న‌త స్దాయి స‌మీక్ష నిర్వ‌హించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌ర్ హ‌రికుమార్‌తో కలిసి స‌మావేశమైన క‌మీష‌న‌ర్ షాపుల త‌నిఖీల‌కు సంబంధించి రానున్న ప‌ది రోజుల పాటు ప్ర‌త్యేక డ్రైవ్ నిర్వ‌హించాల‌ని ఈ సంద‌ర్భంగా అదేశించారు. స‌రుకు ధృవీక‌ర‌ణ‌కు సంబంధించి మూస‌ధోర‌ణుల‌ను విడ‌నాడి, ఆధునిక సాంకేతిక‌త‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. ప్ర‌తి లిక్క‌ర్ షాపును ఫిజిక‌ల్‌గా వెరిఫికేష‌న్ చేయాల‌ని, స్టాక్‌ను లెక్కించాల‌ని స్ప‌ష్టం చేసారు. స్టాక్ రిజిస్ట‌ర్‌ను త‌నిఖీ చేసి ఎప్ప‌టి కప్పుడు కేంద్ర‌కార్యాల‌యానికి నివేదిక పంపాల‌న్నారు. ఫాపుల‌లో అయా రాజ‌కీయ పార్టీల‌కు చెందిన ప్ర‌చార సామాగ్రికి ఉంటే త‌క్ష‌ణం తొలిగించాల‌ని, మ‌ద్యం దుకాణాలు ఎన్నిక‌ల ప్ర‌చార వేదిక‌లుగా మార‌రాద‌ని హెచ్చ‌రించారు. మ‌రోవైపు ఇప్ప‌టికే రాష్ట్రంలో నాటుసారా త‌యారీ కేంద్రాల‌ను పూర్తిగా నిర్మూలించిన్ప‌టికీ ఎన్నిక‌ల వేళ అవి మ‌ళ్లి మొగ్గ‌తొడిగే అవ‌కాశం ఉన్నందున పూర్వ‌పు స‌మాచారాన్ని అనుస‌రించి అయా ప్రాంతాలు, వ్య‌క్తుల‌పై ప్ర‌త్యేక నిఘా ఉంచాల‌ని మీనా రాష్ట్ర స్దాయి అధికారుల‌కు దిశానిర్ధేశం చేసారు. వివిధ రాజ‌కీయ ప‌క్షాలు ఎన్నిక‌ల‌వేళ లిక్క‌ర్‌ను పెద్ద ఎత్తున నిల్వ ఉంచే అవ‌కాశం ఉన్నందున ఆవైపుగా దృష్టి సారించాల‌ని, గ‌తంలో ఈ వ్య‌వ‌హారాల‌కు సంబంధించి న‌మోదైన కేసుల‌లోని నిందితుల‌పై నిఘా ఉంచ‌టంతో పాటు, అనుమానం ఉన్న ప్ర‌తి గిడ్డంగిని త‌నిఖీ చేయాల‌ని ఈ విష‌యంలో జిల్లా స్దాయిలో డిప్యూటి క‌మీష‌న‌ర్లు, స‌హాయ క‌మీష‌న‌ర్లు కీల‌క భూమిక పోషించ‌వ‌ల‌సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. జాతీయ‌, రాష్ట్ర ర‌హ‌దారుల‌ వెంబ‌డి ఉండే ప్రయాణీకుల అతిధ్య కేంద్రాలు, విడిది కేంద్రాలు, డాబాలు వంటి వాటిని నిత్యం త‌నిఖీ చేసే జాబితాలో చేర్చాల‌ని నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌ల‌కు వెనుకాడ‌వ‌ద్ద‌ని సూచించారు. లిక్క‌ర్ డెలివ‌రీ విష‌యంలో ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీవ‌రేజెస్ కార్పోరేష‌న్‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసామ‌ని, గ‌త ఏడాది ఈ నెల‌లో అయా రోజుల‌లో న‌మోదైన మ‌ధ్యం విక్ర‌యాలు ఇప్ప‌డు కూడా ఉంటాయ‌ని, అంత‌కు మించి స‌ర‌ఫ‌రా చేయ‌బోర‌ని ముఖేష్ కుమార్ మీనా స్ప‌ష్టం చేసారు.
                 ప‌న్ను చెల్లించ‌ని మ‌ధ్యం విష‌యంలో మ‌రింత జాగురుక‌త అవ‌స‌ర‌మ‌న్న క‌మీష‌న‌ర్ ఇందుకోసం స‌రిహ‌ద్దుల‌లో చెక్‌పోస్టుల‌ను మ‌రింత ప‌టిష్ట‌ప‌రుస్తున్నామ‌న్నారు. ఇప్ప‌టికే 31 స‌రిహ‌ద్దు చెక్‌పోస్టులు ఉండ‌గా ఆసంఖ్య‌ను 71కి పెంచుతున్నామ‌ని, ఎన్నిక‌ల నేప‌ధ్యంలో కొత్త‌గా 40 చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నామ‌ని ముఖేష్ పేర్కొన్నారు.  ఎన్నిక‌ల వేళ అబ్కారీ శాఖ స‌మ‌ర్ధ‌వంతంగా వ్య‌వ‌హ‌రింప‌ చేసే క్ర‌మంలో రాష్ట్రాన్ని నాలుగు భాగాలుగా విభ‌జించి ప్ర‌త్యేక అధికారుల‌ను నియ‌మించాల‌ని క‌మీష‌న‌ర్ నిర్ణ‌యించారు. విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం, శ్రీ‌కాకుళం జిల్లాలకు అద‌న‌పు క‌మీష‌న‌ర్ కెఎల్ భాస్క‌ర్, తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి, కృష్ణా, గుంటూరు జిల్లాల‌కు సంయిక్త క‌మీష‌న‌ర్ చంద్ర‌శేఖ‌ర నాయిడు, నెల్లూరు, ప్ర‌కాశం, చిత్తూరు జిల్లాల‌కు సంయిక్త క‌మీష‌న‌ర్ జోస‌ఫ్, క‌ర్నూలు, క‌డ‌ప‌, అనంత‌పురం జిల్లాల‌కు మ‌రో సంయిక్త క‌మీష‌న‌ర్ దేవ‌కుమార్‌ల‌ను ప్రత్యేక అధికారులుగా నియ‌మించారు. ఉన్న‌త స్దాయి స‌మీక్ష‌లో అడిష‌న‌ల్‌, జాయింట్ క‌మీష‌న‌ర్‌ల‌తో పాటు ఉప క‌మీష‌న‌ర్ (కంప్యూటర్స్‌) రేణుక‌, జిఎం-ఆప‌రేష‌న్స్ శ్రీ‌ష‌, కేంద్ర కార్యాల‌యం ఉప కార్య‌ద‌ర్శి స‌త్య ప్ర‌సాద్‌, ఎక్సైజ్ సూప‌రిండెంట్ నాగేంద్ర పాల్గొన‌గా త‌రువాత ఆయా జిల్లాల డిప్యూటీ క‌మీష‌న‌ర్లు, ఉప క‌మీష‌న‌ర్‌ల‌తో వీడియో కాన్పెరెన్స్ నిర్వ‌హించారు.

Just In...