Published On: Mon, Nov 5th, 2018

స‌మ‌న్వ‌యంతోనే ఎఫ్‌1హెచ్‌2ఓ విజ‌య‌వంతం

* రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మ‌కాయల చిన‌రాజ‌ప్ప

* అద‌న‌పు పోలీసు బ‌ల‌గాల‌ను సిద్దం చేసుకోండి

* జిల్లా యంత్రాంగం, క‌లెక్ట‌ర్‌, సిపిలదే కీల‌క బాధ్య‌త

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయ‌టం ద్వారా ఎఫ్‌1హెచ్‌2ఓ అంత‌ర్జాతీయ బోట్ రేసింగ్‌ను విజ‌య‌వంతం చేయాల‌ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (హోం) నిమ్మ‌కాయల చిన‌రాజ‌ప్ప అన్నారు. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తిని అంత‌ర్జాతీయ చిత్రప‌టంలో నిలిపేందుకు ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నార‌న్నారు. ప‌వ‌ర్ బోటింగ్ నిర్వ‌హ‌ణ కోసం ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన మంత్రివ‌ర్గ ఉప‌సంఘానికి చిన‌రాజ‌ప్ప అధ్య‌క్ష‌త వ‌హిస్తుండ‌గా, సోమ‌వారం స‌చివాల‌యంలోని రెండ‌వ‌బ్లాక్ స‌మావేశ మందిరంలో ఆయ‌న అధికారుల స‌మ‌న్వ‌య క‌మిటీతో స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఉప ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు క‌ష్ట కాలంలోనూ ఎన్నో సాధించి చూపుతున్నార‌ని , అదే స్పూర్తిని కొన‌సాగిస్తూ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని అకాంక్షించారు. ప‌వ‌ర్ బోట్ రేసింగ్ పోటీలు చూసేందుకు క‌నీసం ల‌క్ష‌మంది వ‌చ్చే అవ‌కాశం ఉన్నందున పోలీసు యంత్రాంగం ట్రాఫిక్ నియంత్ర‌ణ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అద‌న‌పు బ‌ల‌గాల‌ను ర‌ప్పించుకోవాల‌ని సూచించారు.
            న‌ది వెంబ‌డి బ్యారికేడింగ్‌ను ప‌టిష్టంగా అమ‌లు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మికాంతంను ఆదేశించారు. ప్ర‌త్యేకించి దాదాపు 300 మంది విదేశీ ప్ర‌తినిధులు ఈ కార్య‌క్ర‌మానికి వ‌స్తున్న నేప‌ధ్యంలో వారి భ‌ద్ర‌త‌, వ‌స‌తి వంటి విష‌యాల‌పై శ్ర‌ద్ద చూపాల‌న్నారు. అవ‌స‌ర‌మైతే పోలీసు బ‌ల‌గాల‌కు తోడుగా ఎన్‌డిఆర్ ఎఫ్ బృందాల‌ను సిద్దంగా ఉంచాల‌ని న‌గ‌ర పోలీస్ క‌మీష‌న‌ర్ ద్వారాకా తిరుమ‌ల‌రావుకు సూచించారు. గ‌జ ఈత‌గాళ్ల‌ను సిద్దం చేయాల‌ని, ఎవ‌రి ప‌నుల‌ను వారికి స్ప‌ష్టం చేయ‌టం ద్వారా మంచి ఫ‌లితాల‌ను సాధించ‌వ‌చ్చ‌న్నారు. ప్ర‌త్యేకించి జిల్లా క‌లెక్ట‌ర్‌, పోలీస్ క‌మీష‌న‌ర్‌ల‌పైనే అత్య‌ధికంగా బాధ్య‌త ఉంద‌ని చిన‌రాజ‌ప్ప గుర్తు చేసారు. స‌మావేశానికి ముందు రాష్ట్ర ప‌ర్యాట‌క‌, భాషా సాంస్కృతిక శాఖ కార్య‌ద‌ర్శి ముఖేష్‌కుమార్ మీనా ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన ఏర్పాట్లు, రానున్న 10రోజుల ప్ర‌ణాళిక‌ను వివ‌రించారు. ప్ర‌త్యేకించి కార్య‌క్ర‌మం జ‌రిగే ప్ర‌ధాన స‌మ‌యంలో ప్ర‌కాశం బ్యారేజ్‌పై ట్రాఫిక్ నిలుపుద‌ల చేయాలా, వ‌ద్దా అన్న దానిపై పోలీసు యంత్రాంగం స‌త్వ‌రం నిర్ణ‌యం తీసుకోవాల‌న్నారు. ప‌ర్యాట‌క సాధికార సంస్ధ సిఇఓ హిమాన్హు శుక్లా న‌ది వెంబ‌డి ఎక్క‌డ ఏ త‌ర‌హా ఏర్పాట్లు ఉంటాయ‌న్న దానిని విపులీక‌రించారు. ఏ త‌ర‌హా ప్ర‌చారం చేస్తున్నాము, ఇంకా ఏఏ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నాము అన్న విష‌యాల‌ను స‌మావేశం దృష్టికి తీసుకువ‌చ్చారు. కార్య‌క్ర‌మ స్దానిక భాగ‌స్వామి, మాల‌క్ష్మి గ్రూపు ఛైర్మ‌న్ యార్ల‌గ‌డ్డ హరిశ్చంద్ర ప్ర‌సాద్ మాట్లాడుతూ చిరు అవాంత‌రాలను అధిగ‌మించాల్సి ఉంద‌ని, అన్ని స‌వ్యంగానే సాగుతున్నాయ‌న్నారు. స‌మావేశంలో విజ‌య‌వాడ మున్సిప‌ల్ క‌మీష‌న‌ర్ జె.నివాస్‌, ఇండియా ఎక్స్‌ట్రీమ్ ఎడ్వెంచ‌ర్స్ సిఇఓ మండ‌వ సందీప్‌, ఎపిటిడిసి ఇడి కుమార్‌, ఎపిటిఎ సిఎంఓ శ్రీ‌నివాస‌రావు, సాంస్కృతిక శాఖ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ విజ‌య భాస్క‌ర్‌, శిల్పారామం స్పెష‌ల్ అఫీస‌ర్ జ‌య‌రాజ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Just In...