Published On: Tue, Apr 6th, 2021

హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం..

* సీపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: ఎంపిటిసి, జెడ్ పిటిసి ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులివ్వడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్వాగతించారు. ఈ మేరకు ఆయ‌న మంగ‌ళ‌వారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులివ్వడంపట్ల సిపిఐ హర్షం వ్యక్తం చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు, అందుకు వంత పాడుతున్న ఎస్ఈసి వైఖరికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు. కనీసం 4 వారాల పాటు ఎన్నికల కోడ్ అమల్లో ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకుండా నూతనంగా ఎస్ ఈసి పదవీ బాధ్యతలు చేపట్టిన రోజే హడావిడిగా నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదు. అధికారులు పాలకుల దుష్ట ఆలోచనకు లొంగితే ప్రజాస్వామ్యమే అపహాస్యం పాలవుతుంది. ఇప్పటికే ఎంపిటిసి, జెడ్పిటిసిల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులపై వైఎస్ఆర్ సిపి బెదిరింపులు, దౌర్జన్యాలు, దాడులకు పాల్పడింది. చాలా చోట్ల ఇతర పార్టీల అభ్యర్ధులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంది. రాష్ట్రంలో ఎన్నడూ లేనట్లు దాదాపు 2 వేలకుపైగా ఎంపిటిసిలు, 125 జెడ్ పిటిసి స్థానాలను ఏకగ్రీవం చేసుకున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించుకుంది. బెదిరింపులు, ప్రలోభాలు, పోలీసులతో కుమ్మక్కై అక్రమ కేసులు బనాయింపచేసి ఆయా స్థానాలను వైసిపి ఏకగ్రీవం చేసుకుంది. నిజంగా ప్రజాబలం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇన్ని అక్రమాలకు పాల్పడేదికాదు. ఇది అప్రజాస్వామికం. ప్రజాస్వామిక వ్యవస్థ మనుగడకే ప్రమాదకరం. ఎంపిటిసి, జెడ్ పిటిసిల ఏకగ్రీవాలన్నింటినీ రద్దుచేయాలి. తిరిగి నామినేషన్ల ప్రక్రియ నుండి మొదలుపెడుతూ రీ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతున్నాం అని రామ‌కృష్ణ పేర్కొన్నారు.

Just In...