Published On: Fri, May 22nd, 2020

హైకోర్టు తీర్పులు ప్రభుత్వ విధానాలకు చెంపపెట్టు

* సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో, ప్రభుత్వ కార్యాలయాలకు వైసిపి రంగుల విషయంలో, మాజీ డిజిపి ఏబి వెంకటేశ్వరరావు విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులు రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు చెంపపెట్టని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ఈ మేరకు ఆయ‌న శుక్ర‌వారం ఒక ప్రకటన విడుదల చేశారు. 30 సంవత్సరాల నుండి ప్రభుత్వ వైద్యునిగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ సుధాకర్ కరోనా వైరస్ ఎదుర్కొనేందుకు మాస్కులు, గ్లౌజులు సమకూర్చడం లేదని చెప్పినందుకు రాష్ట్ర ప్రభుత్వం అతన్ని సస్పెండ్ చేసింది. ఇటీవల విశాఖలో పోలీసులు డాక్టర్ సుధాకర్ పెడరెక్కలు విరిచికట్టి, కొట్టి నడిరోడ్డుపై అవమానపరిచారు. అక్రమ కేసు బనాయించారు. జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలు పరాకాష్ట ఈ వ్యవహారం పై తీవ్రంగా స్పందించిన హైకోర్టు ప్రభుత్వ నివేదిక నమ్మశక్యంగా లేదని, దీని వెనుక భారీ కుట్ర ఉందని భావిస్తున్నామని తెలిపింది. విశాఖ పోలీసులపై కేసు నమోదు చేయాలని, 8 వారాలలోపు సిబిఐ విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
ప్రభుత్వ కార్యాలయాలకు, గ్రామ సచివాలయాలకు వైసిపి రంగులు వేయడంపై ఇటీవల హైకోర్టు, సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. అయినప్పటికీ ప్రభుత్వ తీరు మారలేదు. ప్రభుత్వ కార్యాలయాల రంగులకు సంబంధించి కొద్దిమార్పుతో మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం జివో నెం:623 తీసుకొచ్చింది. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లఘించినట్లుగా భావించిన హైకోర్టు జీవో నెం: 623ని రద్దు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ఐపిఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ, సస్పెన్షన్ కాలం నాటి జీతభత్యాలను చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. మూడు అంశాలు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, నిరంకుశ విధానాలను వ్యతిరేకించిన వారిపై పోలీసుల చేత అక్రమ కేసులు, నిర్బంధాలు, అణచివేత కి గురిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా నిరసిస్తున్నాం. హైకోర్టు ఇచ్చిన తీర్పులు రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు చెంపపెట్టు. హైకోర్టు ఇచ్చిన తీర్పులను సిపిఐ స్వాగతిస్తుంద‌న్నారు. ఇకనైనా ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలని హితవు పలికారు.

Just In...