Published On: Fri, May 29th, 2020

హైకోర్టు తీర్పు కనువిప్పు కావాలి …

* మాజీ మంత్రి కామినేని శ్రీనివాస‌రావు

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మ‌గ‌డ్డ రమేష్‌కుమార్ తొలగింపును రద్దు చేస్తూ తిరిగి ఆ పదవిలో నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యంపై, న్యాయస్థానాలపై నమ్మకాన్ని మరింత పెంచుతుందని మాజీ మంత్రి, భాజపా నేత కామినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. విజ‌య‌వాడ‌లోని భాజ‌పా నగర కార్యాలయంలో శుక్ర‌వారం ఆయ‌న విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన ఇష్టం వచ్చిన రీతిలో రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించుకునేందుకు ప్రయత్నించి, అడ్డుపడిన ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్‌పై కక్షతో ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏకపక్షంగా తొలగించారన్నారు. దీన్ని సవాలు చేస్తూ భాజపా తరపున హైకోర్టులో ఎన్నికల కమిషనర్ తొలగింపు పై జంధ్యాల రవి అనే న్యాయవాది ద్వారా పిటీషన్ వేశామన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షులు జెపీ.నడ్డా, రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఆదేశాలతో కోర్టు ను ఆశ్రయించామన్నారు. ఈ కేసులో హైకోర్టు రమేష్ కుమార్ ను తిరిగి ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ, ఆయన తొలగిస్తూ చేసిన ఆర్డినెనక్సిను రద్దుచేస్తూ ఇచ్చిన తీర్పు నేడు ప్రజా స్వామ్యం ఇంకా ఉందనే స్పష్టం అయ్యిందన్నారు. జగన్ ఆలోచన విధానం వేరుగా ఉందని, పర్సనల్ ఎజెండా తప్ప.. పబ్లిక్ ఎజెండా అనేది లేకుండా పోయిందని విమర్శించారు. ఎవరైనా తప్పులు ఎత్తి చూపితే… వారిని విరోధులుగా చూస్తున్నారని దుయ్యబట్టారు. కరోనా విషయంలో ఏమీ లేదన్న జగన్.. ఇప్పుడు సహవాసం చేయాలని అంటున్నారని, ఆనాడు ఎన్నికలు నిర్వహించకుండా రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం వల్లే కరోనా వ్యాప్తి చెందలేదని లేకుంటే పరిస్తితి దారుణంగా ఉండేదన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వైఎస్ఆర్ సీపీ రంగులు వేస్తూ, కోర్టు వద్దంటే విమర్విస్తున్నారని, ప్రభుత్వం వేరు, పార్టీ వేరు అనే విషయాన్ని జగన్ గుర్తించాలని సూచించారు. రాజధాని మార్పుకు సంబంధించి బయట ఒకటి చెబుతూ, కోర్టులో మరొకటి మాట్లాడుతున్నారని ఆరోపించారు. జగన్ నిర్ణయాల వల్ల నేడు సంతకాలు చేసే అధికారులు కోర్టుకు వెళుతున్నారని తెలిపారు. డాక్టర్ సుధాకర్ విషయంలో ప్రభుత్వం వ్యక్తిగతంగా టార్గెట్ చేయడాన్ని తప్పుబట్టారు. రాష్ట్ర అభివృద్ధి కి ఈ యేడాదిలో ఏంచేశారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో భాజపా బలహీనపడాలని కోరుకోవడం జగన్ మానసిక పరిస్థితి తెలుస్తుందని అన్నారు. కేంద్రం బలంగా ఉంటే.. ప్రపంచంలో దేశానికి మంచి జరగతుందని, మీ స్వార్థం కోసం బిజెపి బలం తగ్గాలని కోరుకోకూడదని జగన్‌కు హితవు కలిపారు. ప్రత్యేక హోదా అనేది రాజకీయ స్లోగన్ అయిపోయిందని, దాని పై చంద్రబాబుకు, జగన్ కు నిబద్దత లేదని పేర్కొన్నారు. దీనిపై సాధ్యాసాధ్యాలు గురించి వారికి తెలిసినా రాజకీయంతో లబ్ది పొందేందుకు మాట్లాడుతున్నారని విమర్శించారు. హోదా ఇస్తే సంతోషమే… కానీ ఇవ్వరని తెలిసి.. కూడా ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టడం సరికాదన్నారు. 151సీట్లు ఇచ్చి.. అధికారంలో కూర్చోబెడితే.. జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా తీరు మార్చుకుని మంచి పాలన అందించాలని హెచ్చరించారు.
భాజపా తరపు న్యాయవాది జంధ్యాల రవి శంకర్ మాట్లాడుతూ కామినేని శ్రీనివాసరావు వేసిన పిటిషన్‌ను కొట్టి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నం చేసిందన్నారు. 12 పిటిషన్లు ఉన్నా… కామినేని పిటిషన్ పైనే కౌంటర్లు వేశారని చెప్పారు. నాలుగు సార్లు పిటిషన్ పై అడ్వకేట్ జనరల్ స్పందించారన్నారు. ప్రజా స్వామ్యాన్ని కాపాడేందుకు తాము చేసిన ప్రయత్నం ఫలించిందని చెప్పారు. పూర్తి అర్ధం తెలీకుండా ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిందని, రమేష్‌కుమార్‌ను తొలగించేందుకు ఆర్డినెన్స్ తేవడం కుదరదని, గవర్నర్ కు కూడా ఇటువంటివి ఆమోదించే హక్కు ఉండదని అన్నారు. ఒక చట్టానికి గవర్నర్ తండ్రి వంటివారని, .అటువంటి వారు నిబంధనల ప్రకారం పని చేయాలని కోరారు. ఆర్టికల్ 14 ప్రకారం ఐ.ఎ.యస్‌ను తొలగించి, అతని స్థానంలో రిటైర్డ్ జడ్జిని నియమించడం కుదరదని, ఎన్నికల కమిషనర్ గా నియమించేందుకు అనేక చట్టపరమైన నిబంధనలు ఉన్నాయన్నారు. ఇవేమీ పట్టించుకోకుండా ఎపి ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉండేలా చట్టాలను మార్చాలని ప్రయత్నం చేసిందని, ప్రాధమిక ప్రజాస్వామ్య వ్యవస్థ కు విరుద్ధంగాగా నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు. 77 యేళ్ల వయసులో ఏరకంగా తన విధులను నిర్వహిస్తారని ఎన్నికల కమిషనర్ పదవిని ఇచ్చారని ప్రశ్నించారు. తమ వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం మంచి తీర్పును ఇచ్చిందని, ప్రజాస్వామ్య పరిరక్షణ కు భాజపా చేసిన కృషి అభినందనీయమని అన్నారు.
భాజపా అధికార ప్రతినిధి శ్రీనివాసరాజు మాట్లాడుతూ మంత్రివర్గం, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు బాధ్యతను మరచి, రాజకీయాలే పరమావధిగా మాట్లాడటం సరికాదన్నారు. న్యాయమూర్తుల నిర్ణయాలు కూడా తప్పుబడుతూ, విమర్శించడం చూస్తుంటే రాజ్యాంగం పట్ల వారికి ఏ మాత్రం గౌరవం లేదని అర్ధం అవతుందన్నారు. కోవిడ్‌-19 సమస్యను గుర్తిస్తూ ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయ కోణంలో రాష్ట్ర ప్రభుత్వం చూడటాన్ని తప్పుపట్టారు. ఇప్పుడు కోర్టు తీర్పుతో అయినా ప్రభుత్వం తీరు మార్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల రాష్ట్రం రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్లిందని, జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు మాని.. అందరిని కలుపుకుని, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం పై దృష్టి పెట్టాలని సూచించారు. విలేకరుల సమావేశంలో నాయకులు మువ్వల వెంకటసుబ్బయ్య, చిగురుపాటి కుమారస్వామి, కూర్మారావు, పీయూష్ దేశాయ్, షేక్‌ ఖాజా అలీ, వల్లూరి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Just In...