Published On: Mon, Jan 13th, 2020

హైపవర్ కమిటీ సమావేశంలో జిల్లాల వారీగా అభివృద్ధి పై చర్చ..

* రైతుల అభిప్రాయాలను సిఆర్‌డిఏ కమిషనరుకు తెల‌పాలి

* 17న హైపవర్ కమిటీ 4వ సమావేశం..

* రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని)

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: రాష్ట్ర సమగ్రాభివృద్ధి పై చర్చించేందుకు భేటీ అయిన ‘ హైపవర్ కమిటి 3వ సమావేశం రాష్ట్ర ఆర్థికశాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన విజయవాడ ఏ.పి.ఎ స్.ఆర్.టి.సి. సమావేశపు హాలులో సోమవారం జరిగింది. సమావేశంలో చర్చించిన అంశాలను రాష్ట్ర మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని), కురసాల కన్నబాబు, కొడాలి వెంకటేశ్వరరావు (నానీ)లు మీడియాకు వివరించారు. రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) మాట్లాడుతూ జిల్లాల వారీగా అభివృద్ధి పై సుదీర్ఘంగా చర్చించామన్నారు. అమరావతి ప్రాంత రైతాంగం ప్రభుత్వానికి ఏం చెప్పదల్చుకున్నారో ఈనెల 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు వ్యక్తిగతంగాగానీ, పోస్టుద్వారాగానీ, ఇ-మెయిల్ ద్వారా గానీ సి.ఆర్.డి.ఏ. కమిషనర్‌కు సూచనలు, సందేహాలు తెలియజేయవచ్చునని చెప్పారు. రైతాంగం గురించి ప్రతి సమావేశంలో చర్చజరుగుతున్నదని, రైతులతో కూడా చర్చిస్తున్నామని, రైతులు మంత్రులను కలిసి సమీక్షలో తెలియజేస్తున్నారన్నారు. రాజకీయం కోసం ఈ అంశాన్ని వాడుకుంటున్నారో వారికి తప్ప అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. ఈ ప్రాంతంలోని రైతాంగం కానివారిని తీసుకువచ్చి ఉద్యమాల పేరుతో వాడుకుంటున్నారన్నారు. వాస్తవపరిస్థితి ఏమితో రైతాంగానికి అర్ధం అయ్యిందన్నారు. రాజకీయంగా
ప్రేరేపించబడి రాజకీయ కోణంలో సానుభూతి పొందాలనుకుంటున్నవారు, ప్లాన్ ప్రకారం పోలీసులను రెచ్చగొట్టేటట్లుగా ధర్నాలు జరుగుతున్నాయన్నారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ పండుగ పూట ప్రజలను ప్రక్కదారి పట్టించవద్దని, కుటుంబాలను అయోమయానికి గురి చేసి లేని ఉద్యమాలను క్రియేట్ చేస్తున్నారన్నారు. భూములు ఇచ్చిన రైతులది ఒక ఆందోళన అయితే చంద్రబాబు నాయుడిది మరొక ఆందోళన అని ఆయన అన్నారు. చంద్రబాబు బాధ కలిగితే ఎ వరు పండుగ చేసుకో కూడదని, ఆయనకు సంతోషం కలిగితే అందరూ పండుగ చేసుకోవాలనే మనస్తత్వం ఆయనది అన్నారు. వ్యవస్థలను కూడా దారుణంగా కించపరుస్తున్నారని, డీజీపి గౌతం సవాంగ్‌ను సైతం ప్రాంతీయ భేధం చూపిస్తూ అవమానపరుస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఈ ప్రభుత్వం ముందుకు వెళుతున్నదన్నారు. ఎందరో త్యాగాలఫలితంగా ఏర్పడిన రాష్ట్రం మరల విడిపోకుండా మనమందరం కలిసి ఉండాలనే భావన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మచిలీపట్నం పార్లమెంటు
ప్రాంతాన్ని సిఆర్‌డిఏ పరిధి లోనికి తెచ్చి వ్యవసాయం చేసుకోమని, వ్యాపారం చేసుకోవాలంటే అమరావతి వచ్చి చేసుకోవాలని గతంలో చంద్రబాబు చెప్పారన్నారు. పోర్టు నిర్మిస్తున్నామన్నారు కానీ ఏమి చేయలేదన్నారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలను సిఆర్‌డిఏ పరిధి నుండి తొలగించి ముడా పరిధి లోనికి తేవాలని, సమావేశంలో మచిలీపట్నం పోర్టు త్వరితగతిన చేపట్టాలని సమావేశం దృష్టికి తీసుకువచ్చామన్నారు. ఎ యిర్‌పోర్టు, హైవేలు, రైల్వే స్టేషన్లు, ఎక్స్పర్టు, ఇంపోర్టులను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ, ఆక్వా పరిశ్రమలు మచిలీపట్నం ప్రాంతంలో ఏర్పాటు చేయాలని సమావేశంలో కోరామన్నారు. హైపవర్ కమిటీ సమావేశంలో రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, డిప్యూటి సియం పిల్లి సుభాష్ చంద్రబాస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డిజిపి గౌతం సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

Just In...