Published On: Fri, Jan 4th, 2019

హ‌స్త‌క‌ళాకారుల‌కు చేయూత‌నిద్దాం

* విజ‌య‌వాడ‌లో శిల్పారామం ప్ర‌ద‌ర్శ‌న‌, విక్ర‌యాలు ప్రారంభోత్స‌వంలో కృష్ణా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీకాంతం

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా హస్తకళలకు మార్కెట్ సౌకర్యం కల్పించి హస్త కళాకారులకు ఆదరణ కల్పించటానికి శిల్పారామం ప్రదర్శనను పదిరోజుల పాటు నగర‌వాసుల‌కు అందుబాటులోకి తీసుకువ‌చ్చిన‌ట్లు జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం పిలుపునిచ్చారు. గురువారం నగరంలోని మేరిస్ స్టెల్లా ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన శిల్పారామం హస్తకళల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ముఖ్య అతిథిగా హాజ‌రై ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ల‌క్ష్మీకాంతం మాట్లాడుతూ శిల్పారామం ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేది వరకు కొన‌సాగుతుంద‌ని తెలిపారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది హస్తకళల కార్మికులు ఈ పరిశ్రమపై ఆధారపడి జీవ‌నం సాగిస్తున్నారన్నారు. శిల్పారామం అంటేనే చేతితో అందంగా తయారుచేసిన వస్తువులకు వేదిక అని అన్నారు. జిల్లాలో శిల్పారామం ఏర్పాటుకు భూమి కేటాయింపు ప్ర‌క్రియ ముగింపు ద‌శ‌కు చేరుకుంద‌ని, త్వ‌ర‌లోనే కేటాయింపు చేయటం జరుగుతుందన్నారు. వివిధ రాష్ట్రాలలో తయారైన హస్తకళలు ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. నల్గొండలోని దేవరకొండ, సికింద్రాబాద్, మచిలీపట్నం జ్యూయలరీ, కొండపల్లి బొమ్మలు, అనంతరపురం తదితర ప్రాంతాలకు చెందిన కళాకారులు తయారు చేసిన హస్తకళలను ప్ర‌ద‌ర్శ‌న‌లో విక్ర‌యాలు సాగిస్తార‌ని చెప్పారు. నగర వాసులు వీటిని ఆదరించి మన ప్రాచీన సంపదకు మద్దతుగా నిలవాలన్నారు. మన ప్రాచీన కళారూపం అయిన తోలుబొమ్మలాట ఇక్కడ ప్రదర్శించటం బాగుందన్నారు. రాబోయే రోజుల్లో నగరంలో ఎన్నో పోటీలకు ఆతిధ్యం ఇవ్వనుందన్నారు. విజయవాడ నగరం దేశంలో టాప్ టెన్ సిటీస్‌లో ఒక నగరంగా ఉందన్నారు. శిల్పారామం సిఈవో బి.జయరాజు మాట్లాడుతూ మన ప్రాచీన హస్తకళలను ఆదరించాల్సిన అవసరం నేటి సమాజంపై ఉందన్నారు. నగర వాసులు ఈ ప్రదర్శనను ఆదరించి హస్తకళాకారులకు చేయూతను అందించాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్ శ్రీభక్తర్, అసిస్టెంట్ డైరెక్టర్ మనోజ్, శిల్పారామం అధికారులు కె.గురుప్రసాద్, డి.పార్ధసారది, తదితరులు పాల్గొన్నారు.

Just In...