Published On: Sat, Apr 14th, 2018

హ‌స్త క‌ళాకారుల‌ను ప్రోత్స‌హించాలి

* పురావస్తు మరియు ప్రదర్శనశాల శాఖ కమీషనర్ డాక్ట‌ర్ జి.వాణీమోహన్

* విజ‌య‌వాడ బాపు మ్యూజియంలో శిల్పారామం ఎగ్జిబిషన్ ప్రారంభం

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రాచీన కళలను భావితరాల వారు గుర్తుంచుకునేలా వాటిని ఆదరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పురావస్తు మరియు ప్రదర్శనశాల శాఖ కమీషనర్ డాక్ట‌ర్ జి.వాణీమోహన్ అన్నారు. శిల్పారామం ఆర్ట్స్ క్రాఫ్ట్ అండ్ కల్చరల్ సోసైటీ ఆధ్వర్యంలో విజయవాడ మ‌హాత్మాగాంధీ రోడ్డులోని బాపు మ్యూజియంలో ఈ నెల 13 నుంచి 22వ తేది వరకు నిర్వహిస్తున్న శిల్పారామం ఎగ్జిబిషన్‌ను శుక్ర‌వారం సాయంత్రం వాణీమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం విలేక‌రుల స‌మావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రాచీన హస్త కళలను ప్రోత్సహించి వాటి ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసేందుకు హస్తకళా ఎగ్జిబిషన్‌ను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎంతో నైపుణ్యాన్ని మేళవించి వినియోగదారులను ఆకట్టుకునే విధంగా హస్తకళాకారులు రూపొందించిన వస్తువులకు మార్కెట్ సౌకర్యం కల్పించడంతో పాటు వినియోగదారులకు తక్కువ ధరకు హస్తకళలను అందించాలన్నదే ప్రదర్శన ఉద్దేశ్యమన్నారు. కనుమరుగౌతున్న హస్తకళలకు ఆదరణ కల్పించి ప్రాచీన సాంప్రదాయాలను భవిష్యత్ తరాల వారికి అందించేందుకు హస్తకళలను ఆదరించాలని ఆమె అన్నారు. వివిధ రాష్ట్రాలలో పేరెన్నిక గన్న హస్తకళాకారులు రూపొందించిన హస్తకళలను ఒకే వేదికపై తీసుకువచ్చి అమ్మకాలు నిర్వహించడం వినియోగదారులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. శిల్పారామం ప్రత్యేక అధికారి బి.జయరాజు మాట్లాడుతూ శిల్పారామం ఆర్ట్స్ క్రాఫ్ట్, క‌ల్చరల్ సోసైటీ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో శిల్పారామాలను నెలకొల్పుతున్న‌ట్లు చెప్పారు. శిల్పారామంలో హస్తకళల ప్రదర్శన ద్వారా అమ్మకాలు నిర్వహించి కళాకారులకు జీవనోపాధిని కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే విశాఖపట్నం, తిరుపతి, కడప, పులివెందుల, అనంతపురం, పుట్టపర్తిలలో శిల్పారామాలను నెలకొల్పామని, విజయనగరం, కాకినాడ, గుంటూరులలో శిల్పారామాలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. రాజధాని అమరావతి నగరంలో 50 ఎకరాల విస్తీరణంలో మహా శిల్పారామం నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ నెల 22 వరకు బాపు మ్యూజియంలో నిర్వహించే శిల్పారామం ఎగ్జిబిషన్‌లో ఉడ్ కార్వింగ్, రోజ్ ఉడ్, కొండపల్లి మరియు ఏటికొప్పాక బొమ్మలు, కార్పెట్స్, బంజార హ్యాండ్, ఎంబ్రాయిడరీ, హైదరాబాద్ పెరల్స్, జ్యూయలరీ, టెంపుల్ జ్యూయలరీ, జూట్ బ్యాగులు, మదనపల్లి టెర్రకోట, పాటరీ ఐటమ్స్ మరియు సిరమిక్ ఐటమ్స్, కలంకారి పెయింటింగ్స్, రెడీమెడ్ ఐటమ్స్, రుద్రాక్ష మరియు పూజా లెదర్ యటిలిటి గూడ్స్ వెదురు మరియు డ్రై ఫ్లవర్స్ ఐటమ్స్ తదితర హస్తకళలతో పాటు మంగళగిరి, పోచంపల్లి, వెంకటగిరి, చీరాల, ఉప్పాడ, కళంకారి, బెంగాలి కాటన్, శిల్క్ జరీ చీరలు, లక్నో, బెంగాలీ కాటన్ శారీస్, ఖాధీ డ్రస్ మెటీరియల్స్, వంటి అనేక చేనేత వస్త్రాలు ప్రదర్శించడం ప్రజలు శిల్పారామం ప్రదర్శనను సందర్శించి హస్తకళారూపాలను కొనుగోలు చేయడం ద్వారా కళాకారులను ఆదరించాలని కోరారు. తొలిరోజున సంద‌ర్శ‌కులు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చి ఆయా ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేశారు.
 

Just In...