Published On: Tue, Mar 16th, 2021

పరిశ్రమలు, పారిశ్రామిక వాడలకు నాణ్య‌మైన నీటిని అందించాలి

* సముద్ర తీర ప్రాంతాల్లో డీశాలినేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు

* మంచినీరు ఆదా, పరిశ్రమలకు శుద్దిచేసిన జలాల పంపిణీపై సీఎం జగన్‌ సమీక్ష

తాడేప‌ల్లి(అమ‌రావ‌తి), సెల్ఐటి న్యూస్‌: మంచినీటిని ఆదాచేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. పరిశ్రమలకు డీశాలినేషన్‌ చేసిన నీటిని, శుద్ధిచేసిన నీటిని అందించడంపై తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో సోమ‌వారం సీఎం జ‌గ‌న్ సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. పరిశ్రమలకు డీశాలినేషన్‌ చేసిన సముద్ర జలాలను అందించాల‌ని పేర్కొన్నారు. డీశాలినేషన్‌ ప్లాంట్లను ప్రమోట్‌ చేసేలా చర్యలు తీసుకోవాలి. అలాగే రీసైకిల్‌ చేసిన నీటిని కూడా పరిశ్రమలకు ఇవ్వాలి. రిజర్వాయర్లు, కాల్వల్లోని ఉపరితల జలాలను పూర్తిగా ఆదా చేసుకోవాలి. పరిశ్రమలకు అందుబాటులో నీటిని ఉంచాల్సిన బాధ్యత ఏపీఐఐసీది. పరిశ్రమలకు అవసరమైన క్వాలిటీ నీటిని అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. ప‌కడ్బందీగా డీశాలినేషన్‌ చేసి.. నాణ్యమైన నీటిని పరిశ్రమలకు, పారిశ్రామిక వాడలకు అందించాలి. సముద్ర తీర ప్రాంతాల్లో డీశాలినేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసి.. పైపులైన్‌ ద్వారా ఈ నీటిని తరలించి. ప‌రిశ్రమలకు అందించేలా ఆలోచనలు చేయాలి. ఈ వ్యవహారాల సమన్వయ బాధ్యత ఏపీఐఐసీ చేపట్టాలి. సాగుకోసం వినియోగించే నీటిని పరిశ్రమలు వినియోగించుకోకుండా డీశాలినేషన్‌ లాంటి ప్రత్యామ్నాయాల ద్వారా ఏరకంగా నీటిని పరిశ్రమలకు అందించవచ్చో కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాలి. ఎక్కడెక్కడ పరిశ్రమలు ఉన్నాయి, ఎక్కడెక్కడి నుంచి ప్రస్తుతం నీటిని వాడుతున్నారు, ఆ నీటికి బదులుగా డీశాలినేషన్‌ లాంటి ప్రత్యామ్నాయాల ద్వారా ఏ రకంగా ఇవ్వగలుగుతాం? అన్న అంశాలపై పూర్తిస్థాయిలో పరిశీలన చేసి ప్రణాళిక సిద్ధంచేయాలి అని సీఎం జ‌గ‌న్ స్పష్టం చేశారు. సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతమ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్, మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, పరిశ్రమలు, వాణిజ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్, జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్‌సి నారాయణరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Just In...