Published On: Thu, Apr 1st, 2021

మూడు నెలల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం పూర్తి చేస్తాం‌

* వార్డు/గ్రామ సచివాలయాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభోత్స‌వంలో సీఎం జ‌గ‌న్‌

గుంటూరు, సెల్ఐటి న్యూస్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఈ సంద‌ర్భంగా గురువారం ఉద‌యం గుంటూరు భారత్‌పేటలోని 140వ వార్డు సచివాలయానికి సతీమణి వైఎస్‌ భారతితో కలిసి వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. అనంతరం వార్డు/గ్రామ సచివాలయాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఎం జగన్‌ మాట్లాడుతూ కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతుంది. మూడు నెలల్లో రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. గ్రామాల్లో వ్యాక్సినేషన్‌పై వాలంటీర్లకు అవగాహన కల్పిస్తారు. ఇంటింటికీ వెళ్లి 45 ఏళ్లు దాటినవారి వివరాలను వాలంటీర్లు దగ్గరుండి సేకరిస్తారు. ఏ రోజు వ్యాక్సినేషన్‌ జరుగుతుందో ముందుగానే వాలంటీర్లు చెబుతారు. ప్రతీ మండలంలోని పీహెచ్‌సీల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహించనున్నారు. అని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వ్యాక్సిన్‌ కేంద్రం, వ్యాక్సిన్‌ రూమ్, అబ్జర్వేషన్‌ రూమ్‌ను హోం మంత్రి మేకతోటి సుచరిత, కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌లు‌ బుధవారం పరిశీలించిన సంగతి తెలిసిందే. కార్య‌క్ర‌మంలో ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని), హోం మంత్రి మేకతోటి సుచరిత, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, గ్రామ, వార్డు సచివాలయాల స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేనని భాస్కర్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 

Just In...