Published On: Mon, Apr 5th, 2021

బాబూ జగ్జీవన్‌రామ్ జీవితం అందరికీ ఆదర్శం

* ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమార్

* విజ‌య‌వాడ‌లో ఘనంగా జయంతి వేడుకలు

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: భారతదేశ మాజీ ఉప ప్రధాని, సమతావాది డా.బాబూ జగ్జీవన్ రామ్ 114వ రాష్ట్ర స్థాయి జయంతి వేడుకలు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజ‌య‌వాడ‌లో సోమ‌వారం ఘనంగా నిర్వహించారు. రామవరప్పాడు రింగ్ రోడ్డు సెంటరులో బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.సునీత, వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల సహకార ఆర్ధిక సంస్థ కార్యదర్శి ఐ.శామ్యూల్ ఆనందకుమార్, కృష్ణాజిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్ పాల్గొని బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కార్య‌క్ర‌మంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ప ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఫ్రీడమ్ ఫైటర్, హ్యూమన్ రైట్స్ ఛాంపియన్ ఆఫ్ ఇండియా, లెజండరీ, భారతదేశ మాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవన్ రామ్  జీవితం అందరికీ ఆదర్శం అన్నారు. జీవితంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని సమాజంలోని అణగారిన వర్గాల కోసం పోరాడారన్నారు. 1946లో జవహర్ లాల్ నెహ్రూ యొక్క తాత్కలిక ప్రభుత్వంలో అతి పిన్నవయస్కులైన మంత్రి, భారతదేశపు మొదటి మంత్రి వర్గంలో కార్మిక మంత్రిగా సేవలందించారన్నారు. సమాజ అభివృద్ధి కోసం ఎన్నో కొత్త చట్టాలు, సంస్కరణలు తీసుకురావడంలో ఆయన పాత్ర మరువ లేనిదన్నారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 1947 పారిశ్రామిక వివాదాల చట్టం, 1948 కనీస వేతనాల చట్టం, 1952 భవిష్యనిధి చట్టం, ఎయిర్ ఇండియా మరియు ఇండియన్ ఎయిర్ లైన్స్ స్థాపన, రైల్వే జోన్లు మరియు రైల్వే బోర్డు ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారన్నారు.
ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.సునీత మాట్లాడుతూ బాబూజీగా ప్రసిద్ది చెందిన బాబూ జగ్జీవన్ రామ్ సమాజంలో అంటరానివారికి సమానత్వం సాధించడానికి జీవితాన్నే అంకితం చేశారన్నారు. నవభారత నిర్మాణానికి ఆయన అలు పెరుగని కృషి చేశారన్నారు. బీహారుకు చెందిన గొప్ప రాజకీయవేత్త అయిన బాబూ జగ్జీవన్ రామ్ భారత రాజ్యాంగ పరిషత్ సభ్యునిగా, రాజ్యాంగంలో సామాజిక న్యాయం పొందుపరచడానికి భరోసా ఇచ్చిన గొప్ప దార్శినికుడన్నారు. అలాగే ఆయన రక్షణ మంత్రిగా ఉన్న కాలంలో 1971లో పాకిస్థాన్ పై జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించడానికి ముఖ్య భూమిక పోషించారన్నారు. వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సహకార ఆర్ధిక సంస్థ కార్యదర్శి ఐ.శామ్యూల్ ఆనందకుమార్ మాట్లాడుతూ బహుజన నేత బాబూ జగ్జీవన్ రామ్ షెడ్యూల్డు కులాల వారికి రాజ్యాంగం కల్పించిన హక్కులను పూర్తిస్థాయిలో అందే విధంగా జీవితాంతం కృషిచేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీల హక్కుల కోసం న్యాయవాది అవతారం ఎత్తారన్నారు. రాజ్యాంగ సభలో దళితుల హక్కుల కోసం, ఎన్నుకోబడిన సంస్థలు, ప్రభుత్వ సేవలలో కులం ఆధారంగా దృవీకరించే చర్య కోసం వాదించాడన్నారు. అణగారిన వాళ్లల వారికోసం చేసిన అచంచలమైన మద్దతు మరియు రాజీలేని పోరాటం చేయడం వలన ఆయనను  “మెక్సియా ఆఫ్ దళిత్” అని పిలుస్తారన్నారు. జగ్జీవన్ విద్యాభవన్‌ను స్థాపించి ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు పోటీపరీక్షలకు సిద్ధమైయ్యేందుకు ఉచిత బోర్డింగ్ సౌకర్యాలు కల్పించి అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారన్నారు. కృష్ణాజిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్ మాట్లాడుతూ భారతదేశం అందించిన గొప్ప వ్యక్తుల్లో బాబూ జగ్జీవన్ రామ్ ఒకరని అన్నారు. నాటి సమాజంలో వున్న సాంఘిక వివక్షపై ఆయన ఎనలేని పోరాటం చేశారన్నారు. స్వాతంత్ర్య సమర యోధుడిగా, సంఘ సంస్కర్తగా, మేధావిగా దేశానికి ఎన్నో సేవలు అందించిన ఆయన లాంటి గొప్ప జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని నేటి సమాజంలో శత్రువులుగా ఉన్న కులం, మతం, పేదరికం, నిరుద్యోగం వంటి వాటికి వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులను అతిథులు సత్కరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.మోహన్‌కుమార్ (ఆసరా, సంక్షేమం), విజయవాడ ఇన్‌ఛార్జి సబ్ కలెక్టర్ రాజ్యలక్ష్మి, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సరస్వతి తదితరులు పాల్గొన్నారు. 

Just In...