Published On: Sat, Jul 3rd, 2021

ప్రేమ మ‌ధ్య‌వ‌ర్తిత్వ‌మే ప్రాణాలు తీసింది..

* దుర్గా అగ్ర‌హారం హ‌త్య కేసులో ఏడుగురు అరెస్టు

* మీడియా స‌మావేశంలో వివ‌రాలు వెల్ల‌డించిన వెస్ట్ డీసీపి విక్రాంత్ పాటిల్‌

విజ‌య‌వాడ క్రైం, సెల్ఐటి న్యూస్‌: విజ‌య‌వాడ‌లోని దుర్గా అగ్రహారంలో జూన్ 25న ఆలమూరి రామారావు దారుణ హత్య కేసులో ఏడుగురు నిందితులను సూర్యారావుపేట పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పాయకాపురం పీఎస్ పరిధిలో కండ్రిక గ్రామానికి చెందిన ఒక బాలిక ప్రేమ వ్యవహారంలో మధ్యవర్తుల మధ్య వచ్చిన గొడవలే ఈ హత్యకు ప్రధాన కారణమని వెస్ట్ డీసీపీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. బాలిక ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడుకుందామని రామారావును నమ్మకంగా పిలిపించి కత్తులతో దాడి చేసి దారుణంగా హతమార్చార‌ని తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన విలేకరుల మావేశంలో హత్యకు దారి తీసిన పరిస్థితులు, నిందితులను అరెస్టు చేసిన విధానాన్ని డీసీపీ వివరించారు. గత నెల 25న మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో దుర్గా అగ్రహారం అచ్చమాంబ వీధిలో ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొంతమంది యువకులు కత్తులతో దాడి చేసి విచక్షణా రహితంగా పొడిచి ఈ హత్య చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న సూర్యారావుపేట సీఐ సూర్యనారాయణ తన సిబ్బందితో అక్కడకు హుటాహుటిన చేరుకున్నారు. హతుని వద్ద లభ్యమైన ఆధారాలను బట్టి చనిపోయిన యువకుడు కండ్రికకు చెందిన ఆలమూరి రామారావుగా గుర్తించారు. కేసు దర్యాపులో పోలీసులు ఆసక్తికరమైన అంశాలను గుర్తించారు. కండ్రిక గ్రామంలో గత నెలలో జరిగిన ఘర్షణే ఈ హత్యకు ప్రధాన కారణమని దర్యాప్తులో తేలింది.
కండ్రికకు చెందిన పవన్‌కుమార్‌కు అదే ప్రాంతానికి చెందిన ఒక బాలికకు మధ్య నాలుగేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ విషయమై జూన్ 16న బాలిక బంధువైన పేరం మురళి అతని స్నేహితులైన కొలకలూరి రవీంద్ర అలియాస్ కుక్కల రవి, కానుబోయిన అశోక్‌కుమార్, మరికొంత మంది బాలిక తరపున పంచాయతీకి వెళ్లారు. పవన్‌కుమార్ తరఫున ఆలమూరి రామారావు వచ్చారు. వీరంతా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ గొడవ పడ్డారు. పోలీసులు రావడంతో అక్కడ నుంచి వారంతా పరారయ్యారు. ఆ తరువాత ఆలమూరి రామారావు ఫోన్ చేసి ప్రేమ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్ద‌ని కుక్కల రవిని బెదిరించినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో భయపడిపోయిన రవి తనకు రామారావు నుంచి ప్రాణభయం ఉందని భయపడ్డాడు. దీంతో అతను తన స్నేహితులైన పేరం మురళి, మట్టపర్తి దుర్గా శివప్రసాద్ (అలియాస్ కోతల శివ)తో చర్చించి రామారావును చంపాలని నిర్ణయించుకున్నారు. ఈ నేప‌ధ్యంలో జూన్ 25న కుక్కల రవి ప్రేమ విషయమై మాట్లాడదామని రామారావును దుర్గా అగ్రహారం రమ్మన్నారు. రామారావు అక్కడకు రాగానే కుక్కల రవి, అశోక్, కరీం, నిహాంత్‌లు అత‌నితో ఘర్షణ పడి కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఆ తరువాత వినయ్ అనే స్నేహితుడు ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహనం ఎక్కి అక్కడ నుంచి పరారయ్యారు. ఇవన్నీ సీసీ కెమెరాల్లో రికార్డు కాగా వీటి ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. రామారావుతో తమకు ఎప్పటికైనా ప్రమాదం ఉంటుందని భయపడి ప‌క్కా ప్రణాళికతో నమ్మకంగా పిలిపించి ఈ హత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. కాగా.. హతుడు రామారావుపై కూడా నున్న పీఎస్‌లో కొన్ని కేసులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. హత్య జరిగిన వెంటనే ఏసీపీ ఎం.వెంకటేశ్వర్లు నేతృత్వంలో సూర్యారావుపేట సీఐ సూర్యనారాయణ, గవర్నర్‌పేట సీఐ నాగరాజుల నేతృత్వం ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. హత్యకు దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు వేగవంతం చేశారు. హత్యలో కుక్కల రవితో పాటు సింగ్‌నగర్‌కు చెందిన కానుబోయిన అశోక్‌కుమార్, వాంబేకాలనీకి చెందిన మహ్మద్ కరీం, పెజ్జోనిపేటకు చెందిన బొల్లి నిహాంత్‌లు ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు తేలింది. వీరికి ఉయ్యూరు మండలం ఆకునూరు గ్రామానికి చెందిన మట్టపర్తి దుర్గాశివప్రసాద్, ప్రకాష్‌నగర్‌కు చెందిన పేరం మురళీ, విద్యాధరపురానికి చెందిన మక్కా వినయ్‌కుమార్‌లు సహకరించినట్లు తేలింది. కుక్కల రవిపై సూర్యారావుపేట పోలీస్‌స్టేష‌న్‌లో సస్ఫెక్ట్ షీటు ఉండగా మహ్మద్ కరీం, మట్టపర్తి దుర్గాప్రసాద్‌పై నున్న పోలీస్‌స్టేష‌న్‌లో రౌడీషీట్లు ఉన్నాయి. వీరందరినీ అరెస్టు చేసి శుక్ర‌వారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. నిందితులను గుర్తించి అరెస్టు చేసిన ఏసీపీలు ఎం.వెంకటేశ్వర్లు, జి.వి.రమణమూర్తి, సీఐలు సూర్యనారాయణ, ఎం.వి.ఎస్.నాగరాజు తదితరులను న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ బ‌త్తిన శ్రీనివాసులు అభినందించారు.

Just In...