Published On: Wed, Jul 7th, 2021

రైతు సంక్షేమంలో నూతన విప్లవానికి నాంది…

* రైతు భరోసా కేంద్రాలు.. రైతు కుటుంబాలకు కొండంత భరోసా..

* నేడు ప‌లు ఆర్బీబికెల భవనాల ప్రారంభోత్సవానికి సన్నాహాలు..

* కృష్ణాజిల్లాలో 801 రైతుభరోసా కేంద్రాల ద్వారా పారదర్శక సేవలు

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు సంక్షేమంలో నూతన విప్లవానికి రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికింది. రైతుభరోసా కేంద్రాలతో గ్రామాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. వ్యవసాయంపై ఆధారపడిన రైతు కుటుంబాలకు ఆర్బీకేలు ద్వారా ప్రభుత్వం కొండంత భరోసా అందిస్తోంది. విత్తనాల సరఫరా మొదలు పంటలు విక్ర‌యించుకునే వరకూ రైతన్నకు రైతు భరోసా కేంద్రాలు అన్ని విధాలా అండగా నిలుస్తున్నాయి. జిల్లాలో తొలివిడతలో 158 ఆర్‌బికెలకు భవనాలు నిర్మాణం చేపట్టి గురువారం వైయస్సార్ రైతు దినోత్సవం రోజున ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో 70 శాతం మంది సన్న, చిన్నకారు రైతులే వ్యవసాయం చేస్తున్నారు. వీరందరికీ యాంత్రీకరణ పెట్టుబడి పెట్టే సామర్థ్యం లేదు. తొలివిడతగా 246 ఆర్‌బికెల పరిధిలో కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు ఇప్పటికే 165 రైతు గ్రూపులను గుర్తించి వారికి రూ.1.27 కోట్లు వ్యవసాయ యంత్ర పరికరాలను రైతులకు అందుబాటులో ఉంచేందుకు సన్నాహాలు చేశారు. మొబైల్ యాప్ ద్వారా కావాల్సిన యంత్రాలకై ఆర్‌బికెల ద్వారా పారదర్శకంగా ఉండేలా ఏర్పాట్లు
జ‌రుగుతున్నాయి. ఆర్‌బికెల ద్వారా రైతాంగానికి అవసరమైన అన్ని సేవలూ పారదర్శకంగా అందించబడుతున్నాయి. కలీ లేని నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సరఫరాతో పాటు ఇ-క్రాఫ్, పంటల భీమా, వడ్డీ లేని రుణాలు, పంటకొనుగోలు, తదితర సేవలను సైతం ఆర్ బికెల ద్వారా అందిస్తారు. ఆర్ బికెల ద్వారా రైతులకు ఆయా పంటలకు అవసరమైన సలహాలు, సూచనలు అందించబడుతున్నాయి. సాగుకు ముందే గిట్టుబాటు ధర ప్రకటించడంతో పాటు రైతులకు ఆధర దక్కేలా రైతుభరోసా కేంద్రాలు కృషి చేస్తున్నాయి. అంతేకాకుండా నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను నియంత్రించే లక్ష్యంతో ప్రతీ నియోజకవర్గంలో డా. వై.యస్.ఆర్. ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబు ఏర్పాటు కాబోతున్నాయి. ఈల్యాబ్ ద్వారా రైతులు తీసుకొచ్చిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల నమూనాను పరీక్షిస్తారు.
కృష్ణాజిల్లాలో 801 రైతుభరోసా కేంద్రాల పరిధిలో 556 మంది అగ్రికల్చర్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. వీరి వద్దనున్న ట్యాబ్ లలో సియం యాప్ (కాంప్రహెన్సివ్ మోనటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైసెస్ అండ్ ప్రొక్యూర్ మెంట్ యాప్) లో రోజూ పంటల సమాచారం, మార్కెట్ ధరలు, గిట్టుబాటు ధరల కల్పన, మార్కెట్ ఇంటర్వెన్షన్, తదితరాలను అప్ లోడ్ చేస్తున్నారు. జిల్లా మార్కెటింగ్ అధికారులతో పాటు ఆర్ బికెల కోసం ప్రత్యేకంగా నియమించిన జాయింట్ కలెక్టర్లు రైతు ప్రయోజనాలే లక్ష్యంగా నిర్ణయం తీసుకుంటారు. రైతులకు వసతుల కల్పనతోపాటు ప్రతీ ఏడాది రూ. 13,500/- ఆర్ధిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఐదు సంవత్సరాల్లో రూ. 65,700/-లు రైతు ఆర్థిక లబ్ది చేకూరుస్తున్నారు. యస్‌సి, యస్టీ, బిసి, మైనారిటీ వర్గాలకు చెందిన భూమిలేని కౌలు రైతు కుటుంబానికి కూడా సంవత్సరానికి రూ. 13,500/-లు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. 2019 అక్టోబరు 15న జిల్లాలోని 3,07,227 మంది రైతు కుటుంబాలకు రూ. 244.83 కోట్లు పెట్టుబడి సాయం అందించారు. ప్రతీ ఏటా మే నెలలో ఖరీఫ్ పంట వేసే సమయంలో రూ. 7,500/-లు, అక్టోబరు నెలలో పంటకోత లేదా రబీ అవసరాల కోసం రూ. 4,000/-లు, సంక్రాంతి వేళ రూ. 2,000/-లు మొత్తం 3 విడతలుగా అర్హులైన రైతు కుటుంబాలకు రూ. 13,500/-లు చొప్పున అందిస్తున్నారు. 2వ ఏడాది 2020-21 సంవత్సరంలో 3,18,704 రైతు కుటుంబాలకు రూ. 319.79 కోట్లను రైతు భరోసా క్రింద అందించారు. ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడి సాయంతో 2020 ఖరీఫ్ సీజన్లో 3,26,443 ఎకరాల్లో (103 శాతం), రబీలో 2,36,973 ఎకరాల్లో (1 18 శాతం) రైతులు వివిధ రకాల పంటలను సాగుచేశారు. వైయస్ఆర్ రైతుభరోసా క్రింద వరుసగా మూడవ ఏడాది 2021-22 మే నెలలో మొదటి విడతగా స్వంత భూమి కలిగి ఉండి సాగుచేయుచున్న భూయజమానులకు, అటవీ భూములను సాగుచేయుచున్న 3,26,326 రైతుకుటుంబాలకు రూ. 244.74 కోట్లు అందించారు. ఈమూడు సంవత్సరాల్లో డా. వైయస్ఆర్ రైతుభరోసా, పియం కిసాన్ పధకం క్రింద ఇంతవరకూ మొత్తం రూ. 809.36 కోట్లు కృష్ణా జిల్లాలోని రైతుకుటుంబాలు లబ్దిపొందాయి.
జిల్లావ్యాప్తంగా సుమారు 4 వేల పైన మెట్రిక్ టన్నుల ఎరువులను రైతుభరోసా కేంద్రాలు ద్వారా సరఫరా చేసేందుకు సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్, రబీలలో ఆయా మాసాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల పంటలను కొనుగోలు చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల వ్యవసాయ, ఉద్యానవన పంటల రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం డా. వైయస్ఆర్ ఉచిత పంటల భీమాను అమలు చేస్తున్నది. ఇప్పటికే కృష్ణా జిల్లాలో ఖరీఫ్ 2020 కు సంబంధించి 84,648 మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.170.44 కోట్లు జమచేసింది. 2019-20 సంవత్సరంలో సంభవించిన కృష్ణానది వరద ప్రభావంతో దెబ్బతిన్న పంటలకు రూ.2.81 కోట్లు సంబంధిత రైతుల ఖాతాలకు జమ చేయడం జరిగింది. మొబైల్ యాప్ ద్వారా కావాల్సిన యంత్రాల కోసం ఆర్ బికెల ద్వారా పారదర్శకంగా ఉండేటట్లు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖరీఫ్ 2020-21లో రైతుభరోసా కేంద్రాలు ద్వారా రైతుల నుంచి పంట సేకరణ చేయాలనే లక్ష్యంతో కృష్ణా జిల్లాలో 801 రైతు భరోసా కేంద్రాల పరిధిలో 755 రైతు భరోసా కేంద్రాలను ధాన్యం సేకరణ కొరకు 342 ధాన్యం కొనుగోలు కేంద్రాలను అనుసంధానం చేశారు. ప్రస్తుత రబీలో కూడా ఆర్ బికెల ద్వారా మద్ద తుధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం రైతన్నకు ఇస్తున్న ప్రాధాన్యతతో సాగువిస్తీర్ణం కూడా పెరిగింది. 2019 ఖరీఫ్ లో 3,16,770 హెక్టార్ల సాధారణ విస్తీర్ణం కాగా, 3,26,443 హెక్టార్లలో పంటలు వేశారు. రబీలో 2,00,572 హెక్టార్లు సాధారణ విస్తీర్ణం కాగా, 2,31,421 హెక్టార్లలో పంటలు వేశారు. 2020-21లో ఖరీఫ్‌లో 3,26,326 హెక్టార్లలో పంటలు వేశారు. మొత్తం మీద రైతుభరోసా కేంద్రాలు రైతుముంగిట్లోనే వ్యవసాయ అనుబంధ రంగ సేవలు అందిస్తూ పల్లె ప్రగతికి సోపానాలుగా నిలుస్తున్నాయి.

Just In...