Published On: Mon, Jul 19th, 2021

గోవధకు పాల్పడవ‌ద్దు…

* స‌హ‌క‌రించివారు కూడా శిక్షార్హులే

* బ్ర‌కీద్ ప‌ర్వ‌దినం స‌మీక్షా స‌మావేశంలో జేసి కె.మోహన్‌కుమార్‌

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: గోవధకు పాల్పడిన వారికి, వారికి స‌హ‌క‌రించిన వారికి చ‌ట్ట‌రీత్యా శిక్ష‌లు త‌ప్ప‌వ‌ని జాయింట్ కలెక్టర్‌ (సంక్షేమం) కె.మోహన్‌కుమార్ హెచ్చ‌రించారు. జిల్లా కలెక్టర్‌ జె.నివాస్ ఆదేశాలు మేరకు బక్రీద్ సందర్భంగా జిల్లా యస్‌పిసిఏ సమావేశం జెసి మోహన్‌కుమార్ అధ్యక్షతన స్థానిక కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధ పశుసంరక్షణ చట్టం-1977 ప్రకారం గోవధ నిషేధించామ‌న్నారు. బక్రీద్ సందర్భంగా గోవధ నియంత్రణకు మండల, డివిజన్ స్థాయిలో సంబంధిత అధికారులతో ప్రత్యేక బృందాలు నియమించడం జరిగిందన్నారు. మండల స్థాయిలో యంఆర్‌ఓ ఛైర్‌పర్సన్‌గా స్థానిక వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్‌తో కూడిన బృందం గోవుల అక్రమ రవాణా, గోవధ నియంత్రణకు అత్యంత అప్రమత్తతతో పనిచేస్తారన్నారు. ఈ బృందాలు గ్రామాల్లో విస్తృతంగా పర్యవేక్షించి ఎక్కడా గోవధకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసేందుకు జిల్లా కలెక్టర్‌ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని మోహన్‌కుమార్ తెలిపారు. గోవధకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను గుర్తించి ఇప్పటికే నియంత్రణా చర్యలను పోలీస్ అధికారులు చేపట్టామ‌ని తెలిపారు. రవాణాశాఖ అధికారులు కూడా గోవుల తరలింపు విషయంలో చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహించాలన్నారు. అక్రమ గోవుల రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతి కార్యదర్శులను అప్రమత్తంగా ఉంచాలని డిఇవోకు సూచించారు. గోవధ నిషేధ, పశుసంరక్షణ చట్టం, గోరక్షణపై విద్యార్ధుల్లో కూడా అవగాహన కలిగించాలని డిఇఓకు సూచించారు. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల వద్ద సంబంధిత అవగాహన గోడపత్రికలు, కరపత్రాలు అందుబాటులో ఉంచాలన్నారు. కబేళాల వద్ద ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్‌ డా.కె.విద్యాసాగర్ గోవధ నిషేధ చట్టం, పశుసంరక్షణ చట్టం-1977, ట్రాన్స్‌పోర్టు నిబంధ‌న‌లు వివరించారు. సిసియస్ డియస్‌పి సిహెచ్ మురళీకృష్ణ మాట్లాడుతూ గోవధకు ఆస్కారం లేకుండా పోలీస్ నిఘా ఏర్పాటు చేశామ‌ని. ఇప్పటికే ఆయా ప్రాంతాలను గుర్తించి గోవధ నియంత్రణకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ సందర్భంగా గోవధ నిషేధంపై అవగాహన కలిగించే కరపత్రాలను జెసి మోహన్‌కుమార్ త‌దిత‌రులు ఆవిష్కరించారు. సమావేశంలో డిపిఓ ఏ.డి.జ్యోతి, డిఇఓ తహేరా సుల్తానా, మార్కెటింగ్ డిడి యం.దివాకర్‌రావు, వీయంసి ఏహెచ్ అసిస్టెంట్ డైరెక్టర్‌ డా.కె.రవిచంద్, కమిటి సభ్యులు గోశాల కార్యదర్శి గోవింద్‌కుమార్ సాబూ, విశ్రాంత పశుసంవర్ధక శాఖాధికారి వి.షణ్ముఖరావు, డి.వెంకటకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Just In...