Published On: Tue, Jul 20th, 2021

వ్యాధి నిర్ధారణ ముఖ్యం…

* కరోనాపై ప్రజల్లో మరింత అవగాహన కలిగించండి

* ఫీవర్ సర్వే ద్వారా వ్యాధి అనుమానితులను గుర్తించాలి: కృష్ణా జిల్లా కలెక్టర్‌ జె.నివాస్

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రాధమికదశలో వ్యాధి నిర్ధారణ ఒకటే మందు అని కృష్ణాజిల్లా కలెక్టర్‌ జె.నివాస్ అన్నారు. మంగళవారం నగరంలోని 27వ డివిజన్ కరకట్ట సౌత్ లో ఉన్న 122, 123 వార్డు సచివాలయాలను కలెక్టర్  నివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వార్డు వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందితో ఆయన మాట్లాడుతూ చిన్న, పెద్దవాళ్లు ఎవ‌రికైనా ప్రాధమిక దశలోనే వ్యాధి నిర్ధారణ జరిగితేనే వారి ప్రాణాలకు రక్షణ అన్నారు. వ్యాధి అనుమానితులను కోవిడ్ టెస్టు చేయించే బాధ్యత మనపై ఉందన్నారు. ఫీవర్ సర్వేలో అర్ధవంతమైన పనితనం కనిపించాలని పేర్కొన్నారు. ఆయా గృహాల సందర్శన సమయంలో నిర్వహించే ఫీవర్ సర్వేలో ఆయా కుటుంబసభ్యుల ఆరోగ్య లక్షణాలను కనుగొనడంలో ముందుగా కోవిడ్‌పై వారిలో అవగాహన కలిగించాలన్నారు. అప్పుడే వారు సరైన సమాచారాన్ని అందిస్తారన్నారు. సర్వేలో వ్యాధి లక్షణాలు లేవని తేల్చడం సరైన విధానం కాదని తప్పనిసరిగా ఒకటో, రెండో ఆవారంలో కేసులు ఉండవచ్చన్నారు. వార్డు సచివాలయం 122 లో 84.83 శాతం ఫీవర్ సర్వే పూర్తి అయ్యిందన్న సమాచారం ఆధారంగా గ్రామవాలంటీర్లు, ఏయన్‌యంల వద్ద ఉన్న ఫీవర్ సర్వే పత్రాలను కలెక్టర్‌ నివాస్ నిశితంగా పరిశీలించారు. అనుమానిత లక్షణాలు ఉన్నవారికి వెంటనే మందుల కిట్లు అందజేయాలన్నారు. అదేవిధంగా మెడికల్ షాపులు, ఆర్ యంపిలను ఆశ్రయించే వారిని గుర్తించేందుకు సంబంధిత వివరాలు ఫార్మశీ యాప్‌లో నమోదు చేసేలా సంబంధితులను ఆదేశించాలన్నారు. ముఖ్యంగా ఎక్కువ కార్మికులు పనిచేస్తున్న నిర్మాణ భవనాల వద్ద ఉండే కార్మికులకు, దుకాణదారులకు, ప్రధాన మార్కెట్లలో వర్తకులు, కార్మికులు, తదితరులకు తప్పనిసరిగా కోవిడ్ టెస్టు జరిగేలా చూడాలన్నారు. అదేవిధంగా వార్డు సచివాలయ పరిధిలో రోజూ కనీసం 20 కోవిడ్ టెస్టు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు క్రింద అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వివరాలను, సచివాలయాల ద్వారా అందించే సేవలు, వాటి నిర్దేశిత కాలపరిమితి తెలియబరిచేలా పోస్టర్లను సచివాలయంలో ప్రదర్శించాలని తెలిపారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ ఫలాలు అర్హులైన వారికి అందించడంలో వాలంటీర్లదే కీలకపాత్ర అన్నారు. ఈదృష్ట్యా వాలంటీర్ల సహకారం చాలా అవసరం అని కలెక్టరు జె. నివాస్ స్పష్టం చేశారు. ఈసందర్భంగా పలు రిజిష్టర్లను ఆయన పరిశీలించారు. నూతన వర్తక లైసెన్స్ మంజూరుకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ధరఖాస్తులను ఆయన పరిశీలించారు. వీటిని 72 గంటల్లో పరిష్కరించాలన్నారు. సచివాలయాల ద్వారా అందించే సేవలు మరింత మెరుగుగా ఉండాలన్నారు. సేవలను నిర్దిష్ట కాలపరిమితిలో పారదర్శకంగా ప్రజలకు అందించాలన్నారు. ఏకారణం చేతనైనా పరిష్కరించ లేని పక్షంలో సంబంధిత వివరాలు స్పష్టంగా పేర్కొనాలన్నారు. సచివాలయ సిబ్బంది మరింత బాగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలన్నారు. కార్య‌క్ర‌మంలో సిటి మెడికల్ హెల్త్ ఆఫీసర్ గీతాభాయి, హెల్త్ ఆఫీసర్ ఇక్బాల్ హుస్సేన్, వార్డు స్పెషల్ ఆఫీసర్ డి.ఇ.రవికుమార్, తహశీల్దారు రోహిణి, తదితరులు పాల్గొన్నారు.

Just In...