Published On: Wed, Jul 21st, 2021

జర్నలిజంలో డిప్లొమా సర్టిఫికెట్ కోర్స్…

* ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి వెల్ల‌డి

విజయవాడ, సెల్ఐటి న్యూస్‌: నెల్లూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీ ద్వారా జర్నలిజంలో డిప్లొమా సర్టిఫికెట్ కోర్స్ అందిస్తున్నామని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి చెప్పారు. విజ‌య‌వాడ మొగ‌ల్రాజ‌పురంలోని రాష్ట్ర ప్రెస్ అకాడమీ కార్యాలయంలో బుధవారం విక్రమ సింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ కృష్ణారెడ్డితో కలిసి జర్నలిజం డిప్లొమా సర్టిఫికెట్ కోర్స్‌కు సంబందించిన బ్రోచర్‌ను శ్రీనాధరెడ్డి విడుదల చేశారు. అనంత‌రం శ్రీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రెస్ అకాడమీ ద్వారా రాష్ట్రంలోని 6 వేల మందికి శిక్షణ, 5 వేల మందికి జర్నలిజం పై ముద్రించిన పుస్తకాల పంపిణీ చేయడం జరిగిందన్నారు. చాలామంది విలేఖరులు పీడీఎఫ్ రూపంలో ఉన్న పుస్తకాలను డౌన్లోడ్ చేసుకున్నారని, మారుతున్న కాలానికనుగుణంగా ప్రెస్ అకాడమీ తన కార్యక్రమాలను మార్పు చేసుకుంటున్న‌ట్లు తెలిపారు. విలేకరులకు ఏ రకమైన శిక్షణ అవసరమో తెలుసుకుని, తమ కార్యక్రమాలను మార్చుకుంటున్నామన్నారు. గ్రామీణ విలేఖరులకు జర్నలిజంపై ప్రాధమిక అవగాహనకు, జర్నలిజంపై ఆసక్తి ఉన్న వారికి అనుకూలంగా ఉండే విధంగా జర్నలిజంలో డిప్లొమా సర్టిఫికెట్ కోర్స్‌ను నెల్లూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీ ద్వారా అందిస్తున్నామన్నారు. జర్నలిజం కోర్స్ నడిపే యూనివర్సిటీ కళాశాలల్లో సంవత్సరం పాటు కాలం వెచ్చించడం , హాజరు, అధిక ఫీజు, తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని, యూజీసీ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా సర్టిఫికెట్ కోర్స్ రూపొందించడం జరిగిందన్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో క్లాసులకు వెళ్లడం కష్టతర‌మైనందున ఆన్‌లైన్ క్లాస్‌ల ద్వారా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కోర్స్‌లో మొత్తం 4 పేపర్లు ఉంటాయని, జర్నలిజంలో రచన నైపుణ్యం, రిపోర్టింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎడిటింగ్, కొత్తగా వచ్చిన సోషల్ మీడియా, యూట్యూబ్ , ఇన్స్టాగ్రామ్ అంశాలతో న్యూ మీడియా పేరుతో 4వ పేపర్ ఉంటాయన్నారు. ఒక్కో పేపర్‌కి 20 గంటలు, మొత్తం కోర్స్‌కి 80 గంటలపాటు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలలో జర్నలిజం బోధించే ప్రొఫెసర్లు, జర్నలిజంలో అనుభవం, మంచి పేరున్న జర్నలిస్టుల‌తో క్లాసులు నిర్వ‌హిస్తామ‌ని, స్టడీ మెటీరియల్ కూడా సరఫరా చేస్తామని తెలిపారు. వివిధ వార్తా సంస్థలలో ఇంటీరియం శిక్షణ అందిస్తామ‌న్నారు. ఉతీర్ణులైనవారికి వివిధ మీడియా సంస్థలలో ఉపాధికి కూడా సహకరిస్తామన్నారు. ఈ కోర్స్ 3 నెలల పాటు ఉంటుందన్నారు. అనంతరం రాష్ట్రంలోని ప్రముఖ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వర్కింగ్ జర్నలిస్ట్‌లకు రూ.1500, డిగ్రీ చదివి వర్కింగ్ జర్నలిస్ట్స్ కానివారికి కూడా అవకాశం ఉందని వారికి రూ.3వేలు కోర్స్ ఫీజుగా నిర్ణయించిన‌ట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంత విలేఖరులు, జర్నలిజంపై ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని శ్రీనాధ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎల్.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో పనిచేసే ఆచార్యుల కమిటీ ఈ కోర్స్ సిలబస్ రూపొందించిందన్నారు. ఈ కోర్స్ సర్టిఫికెట్‌కు గుర్తింపు ఉంటుందని, ఈ కోర్స్‌కు దరఖాస్తు చేసేందుకు వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటర్మీడియట్, జర్నలిస్ట్ కానివారు డిగ్రీ ఉతీర్ణులై ఉండాలన్నారు. 20 క్లాసులు పూర్తి అయ్యాక అసైన్మెంట్‌లు రాయాల్సి ఉంటుందని, 30 మార్కులు చొప్పున ఉంటాయని, తుది పరీక్షలకు ఒక్కో సబ్జెక్టుకు 70 మార్కులు ఉంటాయన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 22వ తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తామని, దరఖాస్తుకు ఆగష్టు 20వ తేదీ ఆఖ‌రు అని తెలిపారు. విలేక‌రుల స‌మావేశంలో ప్రెస్ అకాడమీ కార్యదర్శి కె.బి.జి.తిలక్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Just In...