Published On: Wed, Jul 21st, 2021

ప‌రిపాల‌న వ్య‌వ‌హారాల‌పై సర్పంచ్‌లకు అవ‌గాహ‌న స‌మావేశాలు

* నేటి నుండి ఆగస్టు 7వ తేది వరకు ద‌శ‌ల వారీగా శిక్షణ: కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: కృష్ణా జిల్లాలో నూతనంగా ఎన్నికైన 778 మంది గ్రామ పంచాయతి సర్పంచ్‌లకు గ్రామ పంచాయతీ పరిపాలన వ్యవహారాలపై ప్రాధమిక అవగాహన శిక్షణా కార్యక్రమం ఈ నెల 22 నుండి ఆగష్టు 7వరకు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆయా గ్రామ సర్పంచ్‌లకు నిర్దేశించిన తేదీల్లో హాజరై గ్రామ పంచాయతీ పాలనపై పూర్తి అవగాహన పొందాలని కలెక్టర్ నివాస్ సర్పంచ్‌లను కోరారు. శిక్షణ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం డివిజన్‌కు సంబంధించి 194 మంది సర్పంచ్‌లకు 5 ద‌శ‌ల్లోనూ, నూజివీడు డివిజన్‌కు సంబంధించి 223 మంది సర్పంచ్‌లకు 5 ద‌శ‌ల్లోనూ, విజయవాడ డివిజన్‌కు సంబంధించి 169 మంది సర్పంచ్‌లకు 3 ద‌శ‌ల్లోనూ, గుడివాడ డివిజన్‌కు సంబంధించి 192 మంది సర్పంచ్‌లకు 4 ద‌శ‌ల్లోనూ శిక్ష‌ణ ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. 40 నుండి 90 మందితో బ్యాచ్‌లను ఏర్పాటు చేయడమైందని, ఒక్కో బ్యాచ్‌కు మూడేసి రోజుల చొప్పున శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. విజయవాడ డివిజన్‌కు ఇబ్రహీంపట్నం మండలం జూపూడి వద్ద నిమ్రా ఇంజినీరింగ్ కళాశాలలోను, నూజివీడు డివిజిన్ వారికీ నూజివీడు ట్రిపుల్ ఐటీలోను, మచిలీపట్నం డివిజన్ వారికి మచిలీపట్నం, చిలకలపూడిలోని జడ్పీ ఆఫీస్ మీటింగ్ హాల్లో, గుడివాడ డివిజన్ వారికి గుడివాడ ఎంపిపి కార్యాలయం మీటింగ్ హాల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణకు అవసరమైన సామాగ్రిని, టేబుళ్ళ ను, హాజరు పట్టికలను, ఐ.డి కార్డులను సిద్ధం చేయడం జరిగిందన్నారు. శిక్షణలో ప్రధానంగా గ్రామ సచివాలయాల ఏర్పాటు, ప్రాముఖ్యత, పంచాయతీల విధులు, అధికారాలు బాధ్యతలు, లక్ష్యాలు, మౌలిక సదుపాయాల కల్పనలో గ్రామాభి వృద్ధి తాగు నీరు, రోడ్లు, విద్యుత్తు దీపాలు, పంచాయతీల ఆర్ధిక పరిపుష్టి, ఆర్ధిక వ్యవహారాలు, సంక్షేమ పధకాలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం తదితర అంశాలపై శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణకు హాజరయ్యే సర్పంచులు అందరికి ధర్మల్ స్కానర్‌తో పరీక్షించాలని, ఎవరికైనా జ్వరం ఉంటే పంపించి వేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. శిక్షణలో భౌతిక దూరాన్ని పాటించాలని, మాస్క్ తప్పనిసరిగా వాడాలని, కోవిడ్ నిబంధనలను పాటించడంతో పాటు శిక్షణ‌లో కోవిడ్‌పై కూడా తరగతి నిర్వహించి అవగాహన కల్పించాలని క‌లెక్ట‌ర్ నివాస్ పేర్కొన్నారు.

Just In...