Published On: Fri, Jul 23rd, 2021

ఏపీలో ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు విడుదల

* ఇంటర్, డిగ్రీ అడ్మిషన్లు ఆన్‌లైన్‌లోనే నిర్వహ‌ణ‌, వారం రోజుల్లో ప‌ద‌వ త‌ర‌గ‌తి ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తాం

* విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ వెల్ల‌డి

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: ఇంటర్మీడియెట్‌ సెకండియర్‌ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఫలితాలను విజ‌య‌వాడ‌లోని ఆర్ అండ్ బి భ‌వ‌న స‌ముదాయంలో మీడియా స‌మావేశంలో విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ.. సెకండియర్‌ విద్యార్థులందరూ పాస్‌ అయినట్లు ప్రకటించారు. ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులను ప్రమోట్‌ చేస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు పరీక్షలు రద్దు చేశామని, కరోనా నిబంధనలు పాటించి ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించామని మంత్రి సురేష్‌ పేర్కొన్నారు. పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన మూడు సబ్జెక్ట్‌ల యావరేజ్‌కి 30 శాతం.. ఇంటర్ మొదటి ఏడాదిలో ప్రతిభకి 70 శాతం వెయిటేజ్‌తో ఫలితాలు ప్రకటించామని ఆయన పేర్కొన్నారు. ఫస్ట్ ఇయర్‌లో ఫెయిల్ అయిన  విద్యార్థులను పాస్ చేశామని తెలిపారు. విద్యార్థులకు ఈ ఫలితాలపై అసంతృప్తి ఉంటే కోవిడ్ తగ్గిన తర్వాత పరీక్షలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఇబ్బంది లేకుండా మార్కులే ప్రకటించామన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులను కూడా ప్రమోట్ చేస్తున్న‌ట్లు తెలిపారు. భవిష్యత్‌లో పరిస్థితులు అనుకూలిస్తే బెటర్‌మెంట్ పేరుతో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పదవ తరగతి ఫలితాలను వారం రోజులలో ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. ఇంటర్, డిగ్రీ అడ్మిషన్లు ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని పేర్కొన్నారు. అడ్మిషన్లలో అవకతవకలకి పాల్పడే కళాశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని మంత్రి సురేష్‌ హెచ్చరించారు. మీడియా స‌మావేశంలో విద్యా శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ బి.రాజ‌శేఖ‌ర్‌, ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు ఉన్న‌తాధికారి వి.రామ‌కృష్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఫలితాల కోసం… www.sakshieducation.com, www.examresults.ap.nic.in, www.results.bie.ap.gov.in, www.bie.ap.gov.in, www.results.apcfss.in క్లిక్ చేయాల‌ని తెలిపారు.

Just In...