Published On: Sun, Jul 25th, 2021

కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే వ్యాపారుల‌పై చర్యలు..

* వినియోగదారులు నిబంధనలు పాటించేలా చూడాల్సిన బాధ్యత వారిదే

* కోవిడ్ నియంత్ర‌ణ‌పై వ్యాపారులతో కలెక్టర్‌, సీపీ సమీక్ష

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: వినియోగదారులు కోవిడ్ నిబంధనలు పాటించేలా చూడాల్సిన బాధ్యత వ్యాపారుల అంద‌రిపైనా ఉంద‌ని, ఈ విష‌యంలో ఉల్లంఘనకు పాల్పడి చర్యలు తీసుకునే అవకాశం తమకు కల్పించవద్దని వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలకు జిల్లా కలెక్టర్‌ జె.నివాస్, పోలీస్ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు స్పష్టం చేశారు. వ్యాపార వాణిజ్య సముదాయాల్లో కోవిడ్ నిబంధనలు పాటించడంపై వర్తక, వాణిజ్య, హోటల్ అసోసియేషన్స్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, రైతుబజార్ల కమిటీ ప్రతినిధులతో శనివారం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కలెక్టరు నివాస్, సీపీ శ్రీనివాసులు ప్రత్యేక  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ వినియోగదారులు కోవిడ్ నిబంధనలు తూచతప్పకుండా పాటించాల్సిన అవసరం వ్యాపార వర్గాలలో అత్యవసరం అన్నారు. కరోనా వైరస్ సోకే అవకాశాలు రద్దీ ఎక్కువగా వర్తక వాణిజ్య సముదాయాల ద్వారానే ఉంటుందన్నారు. వైరస్ సోకితే ముందుగా రిస్క్యూ యజమానుల పైనే ఉంటుందన్నారు. వాణిజ్య సముదాయాలలో ఏమాత్రం అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించినా కరోనా వైరస్ ఒకరి నుండి మరొక‌రికి వేగంగా వ్యాప్తి చెందుతుంద‌ని.. కాబట్టి అటువంటి పరిణామాలకు తావు లేకుండా యాజమాన్యాలు పూర్తి పర్యవేక్షణ బాధ్యతలను తీసుకోవాలన్నారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగానే ముందస్తు హెచ్చరికలు చేస్తున్నామే తప్ప వ్యాపారుల‌పై పెనాల్టీలు వేయాలన్నది తమ అభిమతం కాదన్నారు. వాణిజ్య ప్రాంతాల్లో యజమానులు క‌మిటీగా ఏర్పడి కోవిడ్ నిబంధనలు అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి పద్ధతి ప్రకారం నడుచుకోపోతే తొలిసారి హెచ్చరికతో, రెండోసారి రూ.10 వేలు నుండి రూ.25 వేల వరకూ పెనాల్టీలు విధిస్తామ‌ని పేర్కొన్నారు. అప్పటికీ నిబంధనలు పాటించడంలో  అలసత్వం వహిస్తే ఆయా దుకాణాలు, షాపింగ్ మాల్స్, మార్కెట్లను మూసివేసేందుకు కూడా వెనుకాడబోమన్నారు. గత డిశంబరు ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో కరోనా సంగతి మరచిపోయి అన్ని వ్యవస్థల్లో తేలికభావం ఏర్పడిందన్నారు. ఇది కరోనా వ్యాప్తికి మార్గం తెరవడమేనని పేర్కొన్నారు. అప్పుడు అది మన తప్పిదమే అవుతుందే తప్ప ఇతరులు వేరేవారు అందుకు కారణం కాదన్నారు. థర్డ్ వేవ్ దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం 144 సెక్షన్ అమల్లో ఉందని, దానిని ఈ నెల 22 నుంచి 30వ తేదీవరకూ 144 సెక్షన్ ను అమలు పొడిగించడం జరిగిందన్నారు. కోవిడ్ నిబంధనలు అనుసరించని ఆసుపత్రులపై ముఖ్యమంత్రి ఆదేశాలుమేరకు రెండవసారి తప్పుచేస్తే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరిగిందన్నారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడితే పెనాల్టీలు విధించే విషయం పై ప్రభుత్వ ఉత్తర్వులు నెం. 371 లో స్పష్టంగా తెలియజేయబడిందన్నారు. చిన్నా, పెద్ద హోటల్స్‌లో హ్యాండ్ వాష్, శానిటైజేషన్ సౌకర్యం కల్పించాలన్నారు. లాడ్జీలలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శానిటైజేషన్ సౌకర్యం కల్పించాలన్నారు. ఏర్పాట్లు కోసం 3 రోజుల సమయం ఇస్తున్నామని ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలించి కోవిడ్ నిబంధనలు పాటించ‌ని వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఇందుకోసం డివిజన్ వారీగా ఆయా సచివాలయ వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్, మహిళా పోలీసులతో కూడిన 60 బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. న‌గర పోలీస్ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు మాట్లాడుతూ స్వీయ క్రమశిక్షణతోనే కరోనా వ్యాప్తి కట్టడి సాధ్యమని, విచ్చలవిడిగా వ్యవహరిస్తే మాత్రం సెప్టెంబరు మాసంలో కరోనా వ్యాప్తి శిఖరాగ్రానికి వెళుతుందన్నారు. ఇప్పటికే రెండు వేవ్‌ల ద్వారా కరోనా బారిన పడిన వారిని, చవిచూసినవారిని చూసామన్నారు. ఆసుపత్రుల పడకలు, ఇతర సౌకర్యాలు అందక ఒక్కసారిగా దేశమంతా ఊగిపోయిందన్నారు. ఇటువంటి పరిస్థితులు భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే స్వీయ నియంత్రణ అవసర‌మ‌న్నారు. కరోనాకు స్పష్టమైన వైద్యం అంటూ ఏదీ లేదని వ్యాక్సిన్ పొందడమే ఊరట కలిగించేదన్నారు. కరోనా సోకి రూ.30 లక్షలు ఖర్చు పెట్టినా ఒక డీసీపీ హాస్పటల్‌లో మరణించారని, మరో డియస్పీ నెలా పది రోజులు కరోనాతో పోరాటం చేస్తూ ఇప్ప‌టికీ ఇబ్బందులు పడుతున్నార‌నే విషయాన్ని సీపీ శ్రీనివాసులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. మాస్క్ లేనివారిపై పెనాల్టీలు విధించడం జరుగుతుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారుల‌పై చట్ట ప్రకారం చర్యలు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దిశా యాప్‌పై అవగాహన కలిగించేందుకు ప్రచురించిన పోస్టర్లను, తదితరాలను షాపులకు అందజేస్తామని వాటిని ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. సెల్‌ఫోన్ షాపులకు వచ్చే వారితో దిశాయాప్ డౌన్‌లోడ్ చేసేలా చూడాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్‌ (అభివృద్ధి) యల్.శివశంకర్, ఇన్‌ఛార్జ్ మున్సిపల్ కమిషనర్‌ యు.శారదాదేవి, డియంహెచ్‌ఓ యం.సుహాసిని, యుసిడి పిడి జె.అరుణ, సియంహెచ్‌ఓ గీతాభాయి, తదితరులు పాల్గొన్నారు.

Just In...