Published On: Mon, Jul 26th, 2021

“స్పందనలో” 24 ఫిర్యాదుల‌కు స‌త్వ‌ర ప‌రిష్కారం…

* సీపీ శ్రీనివాసులు ఎదుట గోడు వెళ్ల‌బోసుకున్న బాధితులు

* కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ స్పంద‌నలో పాల్గొనాల‌ని ప్ర‌జ‌ల‌కు పోలీస్ క‌మిష‌న‌ర్ విజ్ఞ‌ప్తి

విజ‌య‌వాడ క్రైం, సెల్ఐటి న్యూస్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘స్పందన’ కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటల నుండి 12.30 గంటల వరకు విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించారు. కార్య‌క్ర‌మంలో భాగంగా న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ బ‌త్తిన శ్రీనివాసులు, అడ్మిన్ డిసిపి మేరీ ప్రశాంతి పాల్గొని బాధితుల నుండి వివిధ సమస్యలు, వినతులు, విజ్ఞప్తులకు సంబంధించి మొత్తం 24 ఫిర్యాదులను స్వీకరించారు. ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన ఫిర్యాదుల్లో వివిధ మోసాలకు సంబంధించినవి 3, సివిల్ వివాదాలకు సంబంధించినవి 2, భార్యాభర్తలు, కుటుంబ కలహాలకు సంబంధించినవి 5, నగదు లావాదేవీలకు సంబంధించినవి 2, అద్దె వివాదాలకు సంబంధించినవి 1, ఇతర వేరువేరు సమస్యలు, ఘటనలకు సంబంధించినవి 11 ఫిర్యాదులు ఉన్నాయి. స్వీకరించిన ఫిర్యాదులను సత్వర పరిష్కారానికి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా పోలీస్ కమిషనర్ బ‌త్తిన శ్రీనివాసులు ఫిర్యాదిదారుల‌తో మాట్లాడి.. సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓలతో నేరుగా అప్పటికప్పుడే ఫిర్యాదు గురించి వివరించి త‌క్ష‌ణం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కరోనా వ్యాప్తి నియంత్ర‌ణ‌కు స్పందన కార్యక్రమానికి వచ్చే బాధితులు, ఫిర్యాదుదారులు ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలి, సామాజిక దూరం పాటించాలి, అలాగే శానిటైజర్ తో చేతులను శుభ్రం చేసుకోవడం తదితర కోవిడ్ నిబంధనలను తప్పకుండా పాటించాలని తెలిపారు. ఒకచోట సమావేశమై తోటి ఫిర్యాదుదారులు లేదా తెలిసిన వ్యక్తులతో సమస్యలు చెప్పుకోవడం, అనవసర చర్చలు జరపడం వంటి ఇతరేతర కార్యక్రమాలు చేయకూడదని పేర్కొన్నారు. స్పందన కార్యక్రమంలో కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ ప్రజలు పాల్గొనాల‌ని కోరారు.

Just In...