Published On: Mon, Aug 2nd, 2021

విభిన్న ప్రతిభావంతుల్లో ఆత్మసైర్యం నింప‌డ‌మే లక్ష్యం

* వారి సంక్షేమానికి రెండేళ్లలో రూ.37 కోట్లు మంజూరు:

* నూతన ఛైర్‌పర్సన్ ముంతాజ్ పఠాన్

విజయవాడ, సెల్ఐటి న్యూస్‌: విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి గత రెండేళ్ళల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రూ.37 కోట్లు మంజూరు చేయటం జరిగిందని ఉపకరణాలతో పాటు ఈ ఏడాది రూ.16.5 కోట్ల ఖర్చుతో 1750 మంది మూడు చక్రాల మోటరైజ్డ్ స్కూటర్‌ను పంపిణీ చేయనున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ ఛైర్ పర్సన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన ముంతాజ్ పఠాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ చైర్మన్‌గా నియమితులైన ముంతాజ్ పఠాన్ సోమవారం విజయవాడ అశోక్‌నగర్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను స్వీకరించారు. అనంత‌రం ముంతాజ్ పఠాన్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులుల్లో ఆత్మసైర్యం పెంపొందించి వారికి ఆర్థికంగా చేయూత నందించేందుకు కృషి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విభిన్న ప్రతిభావంతులుపై వున్న మమకారంతో వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ఆర్థిక ఇబ్బందులు వున్నప్పటికి రూ.37 కోట్లు వారి సంక్షేమానికి నిధులు కేటాయించార‌ని తెలిపారు. 1750 మందికి శారీరక విభిన్న ప్రతిభావంతులకు మూడు చక్రాల మోటరైజ్డ్ స్కూటర్లను రూ.16.5 కోట్ల ఖర్చుతో త్వరలో పంపిణీ చేసేందుకు, ప్రభుత్వం కల్పించే సంక్షేమ పథకాలతో ఉపకరణాలను సకాలంలో విభిన్న ప్రతిభావంతులకు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి తనపై నమ్మకం వుంచి ఛైర్మన్ పదవికి ఎంపిక చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆయ‌న ఆశయాలకు అనుగుణంగా పనిచేసి విభిన్న ప్రతిభావంతులకు సేవ చేస్తానన్నారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.ఎ.కుమార్ రాజా మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న‌ట్లు చెప్పారు. వారి సంక్షేమానికి గతేడాది రూ.12 కోట్లు ప్రభుత్వం మంజూరు చేయటం జరిగిందని 2020-21 సంవత్సరానికి బడ్జెట్‌లో రూ.25 కోట్ల మంజూరు చేసినట్లు తెలిపారు. సహకార సంస్థ ద్వారా విభిన్న ప్రతిభా వంతులకు మూడు చక్రాల సైకిళ్ళు, వీల్ ఛైర్స్, కృత్రిమ అవయవాలు పంపిణీ చేశామ‌న్నారు. బదిరులకు వినికిడి యంత్రాలు, స్మార్ట్ ఫోన్లు, అంధులకు, ల్యాప్టాప్‌లు, డైసి ప్లేయర్లు, ఎంపి3 ప్లేయర్లు , బ్రెయిలీ ఉపకరణాలు, పాఠ్యపుస్తకాలు, వాకింగ్ స్టిక్స్, స్మార్ట్ కేన్స్ తదితర ఉపకరణాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వయోవృద్ధులకు ఎంసిఆర్ పాదరక్షకులు, కళ్ళజోళ్ళు, చేతికర్రలు, వీల్ ఛైర్స్, వినికిడి యంత్రాలను అందిస్తున్నామని, విభిన్న ప్రతిభావంతులకు పెయింటింగ్, వెల్డింగ్, షీట్ మెటల్, కార్పెంటరీ వంటి వృత్తివిద్యా కోర్సులలో శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది మూడు చక్రాల మోటరైజ్డ్ స్కూటర్లను పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బ్రెయిల్ ప్రెస్ ఏర్పాటు చేసేందుకు నూతన భవనం నిర్మించేందుకు 35 లక్షలరూపాయలు మంజూరు చేయటం జరిగిందని గుంటూరులో ప్రారంభించిన నూతన భవనంలో బ్రెయిలీ ప్రెస్‌ను ఏర్పాటు చేసి 1నుండి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలను ముద్రించి విద్యార్థిని, విద్యార్థులకు సరఫరా చేస్తున్నామ‌ని తెలిపారు. కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బొప్పన భవకుమార్, విభిన్న ప్రతిభా వంతులు మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ జనరల్ మేనేజర్ కె.వెంకటరత్నం, సంస్థ సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు, విభిన్న ప్రతిభావంతులు తదితరులు పాల్గొన్నారు.

Just In...