Published On: Mon, Aug 2nd, 2021

ఉపాధి హామీ బిల్లుల పెండింగ్‌పై మ‌రోసారి టిడిపి నేతలు గ‌ళం

* రాష్ట్ర‌వ్యాప్తంగా వెల్లువెత్తిన నిర‌స‌న‌లు

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: ఉపాధి బిల్లుల మంజూరులో కోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహారించడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లోని హెడ్‌క్వాటర్స్‌లో ఉన్న ఎంపీడీవో కార్యాలయాల్లో టీడీపీ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టారు. కొన్నిచోట్ల ర్యాలీలు నిర్వహించారు. 14,392 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పనులు చేసి బిల్లులు రాని గుత్తేదారులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కోర్డు ఆదేశాలను అనుసరించి రూ.2500 కోట్ల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, జాతీయ ఉపాధి హామీ చట్టం 2005 ప్రకారం 12 శాతం వడ్డీతో సహా చెల్లింపులు జరపాలని, అధికారులు రాజకీయ ఒత్తిడిలకు లోబడి కాకుండా నిబంధనలకు లోబ‌డి పనిచేయాలని, సిఎఫ్‌ఎం‌ఎస్ మరియు పంచాయతీ రాజ్ కమిషనరేట్‌లలో పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీ బిల్లులను పూర్తిగా విడుదల చేయాలన్న డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను ఎంపీడీవో కార్యాలయాల్లో సమర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ హయంలో జరిగిన పనులకు సంబంధించిన ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను జూలై నెలాఖరులోగా చెల్లించాలని కోర్డు ఆదేశాలు ఉన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఇంకా విడుదల చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించినట్లు టీడీపీ నేతలు తెలిపారు. దీనిపై ఇప్పటికే టీడీపీ నాయకులు కలెక్టర్లకు వినతిపత్రాలు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక గ్రామాల అభివృద్ధికి గ్రహణం పట్టిందని టీడీపీ నేతలు ఆరోపించారు. సొంత నిధులను ఖర్చుచేసి చిన్నచిన్న కాంట్రాక్టర్లు, ప్రజా ప్రతినిధులు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. గ్రామాలు అభివృద్ధి కోసం పనులు చేసిన వారి మీద సైతం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. సకాలంలో బిల్లులు రాక అప్పులు, వడ్డీలు కట్టలేక చాలా మంది ఆస్తులు అమ్ముకొన్నారని, 50 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నట్లు తెలిపారు. నిబంధనలను అనుసరించి పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోర్డులు పదే పదే చెప్పినా ఏదో ఒక సాకుతో కాలయాపన చేస్తూ రెండు సంవత్సరాలుగా బిల్లులను పెండింగ్‌లో ఉంచారన్నారు. నిధులు లేవు అని కేంద్రం ఇవ్వడం లేదు అని మరోసారి విజిలెన్స్ ఎంక్వైరీ అని కోర్డుకు అబద్దాలు చెబుతూ కోర్డుకు తప్పుడు సమాచారం ఇవ్వడం వైసీపీ దుర్మార్గపు ఆలోచనకు పరాకాష్ట అని అన్నారు. హైకోర్డు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరీ, జస్టిస్ ఎం సీతారామమూర్తిలతో కూడిన ధర్మాసనం కేంద్రం విడుదల చేసిన విధులను తొలిత పనిచేసిన వారికి నెల రోజుల వ్యవధిలో చెల్లించాలని 08.01.2020న ఆదేశించింది. ఐదు లక్షల లోపు పనులకు సంబంధించి రూ. 877 కోట్లు జీవో నెం 1092 తేదీ 22 ఏప్రిల్ 2021 విడుదల చేశాం అని 23.04.2021 తేదీన కోర్డులో అఫిడవిట్ వేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదని పేర్కొన్నారు. 15.07.2021 రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందు జరిగిన విచారణ సందర్భంగా ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు చెల్లింపులు చేపట్టాలని ఎన్ని సార్లు చెప్పించుకుంటారని కోర్డు ప్రశ్నించిన వైసీపీ ప్రభుత్వానికి చలనం లేదని ఆరోపించారు. పెండింగ్ బిల్లులకు సంబంధించి కేంద్రం ఇప్పటికే నిధులు విడుదల చేసింది. కానీ వైసీపీ ప్రభుత్వం వాటిని దారి మళ్లించి రాష్ట్ర వాటా చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టిందన్నారు. ఈ పెండింగ్ బిల్లులకు సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో బిల్లులు చెల్లింపు చేయడం లేదన్నారు. ఉపాధి హామికి సంబంధించిన బిల్లులు అన్నీ విజిలెన్స్ విచారణ పూర్తి చేసుకుని, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు తనిఖీ పూర్తి అయి గ్రామ సభ తీర్మాణం చేసిన తరువాత సంబంధిత ఇంజనీర్లు ఏంబుక్‌లో నమోదు చేసి, ఫండ్ ట్రాన్స్ ఫర్ ఆర్డర్ ఇవ్వటం జరిగింది కానీ ఈ ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ కాఫీలను పంచాయతీ రాజ్‌ కమిషనర్ కార్యాలయంలో పెట్టుకుని సిఎఫ్‌ఎంఎస్‌కి పంపడం లేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నెం.350 తెచ్చి గ్రామాల్లో రూ 3118 కోట్లు విలువైన 7782 పనులను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత 30.12.2019న రాష్ట్ర ప్రభుత్వం మెమో నెం. 1060306/PR11/J1/2019 ద్వారా 1 జూన్ 2019 తరువాత చేసిన పనులకు మాత్రమే చెల్లింపులను చెపట్టాలని ఆదేశించారు. ఇది పూర్తిగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005కి విరుద్దంగా ఆదేశాలు జారీ చేశారని అన్నారు. జూన్ నెలాఖరులోగా పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తామని కోర్టుకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే ఆర్థిక, పంచాయితీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌ కోర్టుకు రావాల్సి ఉంటుందని కోర్డు ఇప్పటికే చెప్పినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. టిడిపి హయాంలో ఉపాధి హామీ చట్టం ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి పనులు చేశామన్నారు. రాష్ట్రానికి జాతీయ స్థాయిలో పలు అవార్డులు ఏపీకి తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచినట్లు తెలిపారు. నరేగా పనులు 4200 కోట్లతో 35.64 లక్షల కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టించగా బహిరంగా మలవిసర్జన రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత టీడీపీ అని అన్నారు. పంచాయతీలలో 27 లక్షల ఎల్‌ఈడి దీపాలు ఏర్పాటు చేసి దేశంలోనే ప్రధమ స్థానంలో నిలిచామన్నారు. అలాగే 4950 గ్రామ పంచాయతీ భవనాలను నిర్మించడం, 6500 స్మశాన వాటికలు అభివృద్ధి చేయడం, రూ. 5694 కోట్లతో 24,000 కిలోమీటర్లు సి.సిరోడ్లు, 16,000 కి.మీ గ్రావెల్ రోడ్లు వేయడం, రూ 1673.99 కోట్ల వ్యయంతో 6,15,809 పంట కుంటలను తవ్వి రైతులకు మేలు చేయడం, రూ. 187.96 కోట్లతో 5,855 అంగన్‌వాడీ కేంద్రాలను నిర్మించడం వంటి అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో పార్లమెంట్ అధ్యక్షులు గుమ్మడి సంధ్యారాణి, కూన రవికుమార్, కిమిడి నాగార్జున, బుద్దా నాగజగధీష్, రెడ్ది అనంతకుమారి, గన్నీ వీరాంజనేయులు, కొనకళ్ల నారాయణ, జీవీ ఆంజనేయులు, నూకసాని బాలాజీ, మల్లెల లింగారెడ్డి, గొల్లా నరసింహ యాదవ్, అబ్దుల్ అజీజ్, కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మంతెన రామరాజు, డొలా స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, మాజీ మంత్రులు గొల్లపల్లి సూర్యరావు, కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ, కొండపల్లి అప్పలనాయుడు, కొళ్ళ లలితకుమారి, బొబ్బిలి చిరంజీవులు, భంజ్‌దేవ్, గిడ్డి ఈశ్వరి, బొగ్గు రమణమూర్తి, అయితబత్తుల ఆనందరావు, బండారు సత్యనందరావు, జ్యోతుల నెహ్రూ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎస్.వి.ఎస్.ఎన్ వర్మ, చింతమనేని ప్రభాకరరావు, ముద్రబోయిన వెంకటేశ్వరరావు, జయమంగళ వెంకటరమణ, బోడే ప్రసాద్, ముప్పుడి వెంకటేశ్వరరావు, , తంగిరాల సౌమ్య, శ్రీరాం తాతయ్య, భూమా బ్రహ్మానంద్ రెడ్డి, దివి శివరాం, హెమలత, కందుల నారాయణ రెడ్డి, అశోక్ రెడ్డి, బి.సి జనార్థన్ రెడ్డి, జితేంద్ర గౌడ్, కందికుంట ప్రసాద్, పాశీం సునీల్ కుమార్, కురుగుండ్ల రామకృష్ణా, దొమ్మలపాటి రమేష్, ఎమ్మెల్సీ బిటెక్ రవి, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Just In...