Published On: Tue, Aug 3rd, 2021

వ్యవసాయానికి విత్త‌నాలే తొలిమెట్టు…

* రైతు భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విత్తనాభివృద్ధి సంస్థది కీలక పాత్ర

* ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: వ్య‌వసాయాన్ని రైతులు పండుగలా చేపట్టాలన్నదే ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్మోహన్‌రెడ్డి ఆశయమని, రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించి అధిక దిగుబడులు సాధించేందుకు విత్తనాభివృద్ధి సంస్థ కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌గా నియమితులైన పేర్నాటి హేమ సుష్మిత మంగళవారం ఉదయం విజయవాడ ప్రసాదంపాడులోని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలను స్వీకరించారు. కార్య‌క్ర‌మానికి రాష్ట్ర ప్రభుత్వ ప్ర‌ధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ముఖ్య అతిథిగా హాజర‌య్యారు. విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌ జి.శేఖర్‌బాబు పెర్నాటి హేమ సుష్మితతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ రైతుల వ్యవసాయ విధానంలో తొలిమెట్టు విత్తనమేనన్నారు. నాణ్యమైన విత్తనాలను నాటడం ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించినప్పుడు ఆర్ధికంగా మేలు జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో వ్యవసాయం దండగనే భావనను రైతుల్లో కల్పించి వారిని నిర్లక్ష్యం చేయడం ద్వారా వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి రైతులకు దిక్కుతోచని పరిస్థితులను కల్పించారన్నారు. ఈ దశలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి వ్యవసాయం దేశానికి జీవనాడి అని వ్యవసాయం అంటే ఓ పండుగ అనే భావనను కల్పిస్తూ రైతులను ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి మరో నాలుగు అడుగులు ముందుకు వేసి రైతు భరోసా కేంద్రాలు ద్వారా రైతాంగానికి విత్తనం మొదలుకుని పంటల కొనుగోలు వరకూ సహకారంఅందిస్తూ రైతు పక్షపాతిగా ముద్రవేసుకుంటున్నారన్నారు. ఈ తరుణంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ రైతులకు మేలురకమైన విత్తనాలను సరఫరా చేసి వారిని ప్రోత్సహించి సంస్థను ముందుకు నడిపించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని నూతన ఛైర్మన్ హేమ సుష్మితకు సజ్జల రామకృష్ణా రెడ్డి సూచించారు. ఈ సంద‌ర్భంగా పేర్నాటి ఛారిట‌బుల్ ట్ర‌స్టు ద్వారా నిర్వ‌హిస్తున్న సేవా కార్య‌క్ర‌మాల‌ను కొనియాడుతూ పేర్నాటి శ్యాంప్ర‌సాద్‌రెడ్డి, హేమ సుష్మిత దంప‌తుల‌ను స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అభినందించారు.
రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మాట్లాడుతూ అన్నిరంగాలను అభివృద్ధి బాటలో నడిపించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఒకేసారి 135 కార్పోరేషన్‌లకు చైర్మన్లను నియమించారన్నారు. అత్యంత కీలకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు ఛైర్మన్‌గా రైతు కుటుంబానికి చెందిన హేమ సుష్మితను ఎంపిక చేయడం రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుచూపున‌కు నిదర్శనం అన్నారు. వ్యవసాయ సీజన్‌లో ప్రాంతాల వారీగా రైతులకు అవసరమైన విత్తనాలను ముందుగానే సిద్ధం చేసుకుని సకాలంలో రైతులకు విత్తనాలను పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన హేమ సుష్మిత మాట్లాడుతూ విత్తన ఉత్పత్తిలో చిన్న, సన్న కారు రైతులను భాగస్వాములను చేసి రైతు భరోసా కేంద్రాలు ద్వారా విత్తనోత్పత్తి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే విత్తనాభివృద్ధి సంస్థలో ప్రస్తుతం ఉన్న 4 లక్షల క్వింటాళ్ల విత్తన నిల్వ సామర్ధ్యాన్ని 6 లక్షల క్వింటాళ్ల సామర్ధ్యానికి పెంచేందుకు చర్యలు తీసుకుంటామని, రైతులకు విత్తన నాణ్యత, స్వచ్ఛతతో పాటు సంరక్షించే విధానంలో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామ‌న్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌ జి.శేఖర్‌బాబు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ నుండి అందుకున్న ఇండెంట్లు ప్రకారం ప్రణాళికలను రూపొందించుకుని విత్తనోత్పత్తికి చర్యలు తీసుకుంటున్న‌ట్లు చెప్పారు. సంస్థ ద్వారా రైతులకు తక్కువ ధరకే విత్తనాలను సరఫరా చేయడం జరుగుతున్నదన్నారు. రాష్ట్రంలో 7 లక్షల క్వింటాళ్ల విత్తన నిల్వ సామర్ధ్యం అవసరం కాగా ప్రస్తుతం 8 జిల్లాల్లో ఏపి సీడ్స్ 4 లక్షల క్వింటాళ్ల విత్తన నిల్వల సామర్ధ్యం గల కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వైయస్సార్ రైతు భరోసా కేంద్రాలు ద్వారా విత్తనాలను పంపిణి చేసేందుకు 1210 స్వంత విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు రైతు భరోసా కేంద్రాలకు విత్తన నాణ్యతా పరీక్ష కిట్లను సరఫరా చేయడం జరిగిందని వివరించారు. సంస్థ ద్వారా రాష్ట్రంలోని రైతుల‌తో పాటుగా దేశంలోని నేషనల్ సీడ్ కార్పోరేషన్ కు కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు కూడా వరి విత్తనాలు పంపిణి చేస్తున్నామని, ఇంతవరకూ 35,960 క్వింటాళ్ల వరి విత్తనాలు పంపిణి చేశామని శేఖర్ బాబు తెలిపారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి, శాసన సభ్యులు కాకాని గోవర్ధన్‌రెడ్డి, మెరుగు నాగార్జున, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, కాపు కార్పోరేష‌న్ ఛైర్మ‌న్ అడ‌పా శేష‌గిరిరావు, వైసీపీ నేత‌లు పెర్నేటి శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజర్ పివియస్‌యస్ సుబ్బారావు, మాజీ డైరెక్టర్‌ సలాది మురళీకృష్ణ, తదతరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ప్ర‌ముఖులు, శాఖాప‌రంగా అధికారులు, సిబ్బంది, వైసీపీ నేత‌లు, శ్రేయోభిలాషులు పెద్ద‌సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చి పేర్నాటి శ్యాంప్ర‌సాద్‌రెడ్డి, హేమ సుష్మిత దంప‌తుల‌కు శాలువాలు క‌ప్పి గ‌జ‌మాల‌తో ఘ‌నంగా స‌త్క‌రించి అభినంద‌న‌లు తెలిపారు.

Just In...