Published On: Mon, Sep 6th, 2021

పాడిపరిశ్రమ అభివృద్దికి రుణసాయం అందజేయండి

* రాష్ట్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమ అభివృద్ది, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: రాష్ట్రంలో అమలవుతున్న ఏ.పి. అమూల్ ప్రాజెక్టుని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి, పది వేల పైచిలుకు మహిళా పాల ఉత్పత్తి సంఘాల బలోపేతానికి జాతీయ సహకార అభివృద్ది సంస్థ ద్వారా రూ.1,362 కోట్ల రుణ సహాయాన్ని త్వరితగతిన అందజేయాలని రాష్ట్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమ అభివృద్ది, మత్స్య శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర మత్స్య, పశుసంవర్థక, పాడిపరిశ్రమ అభివృద్ది శాఖ మంత్రి పురుషోత్తం రూపాల అద్యక్షతన సోమవారం జరిగిన జాతీయ స్థాయి వర్చ్యువల్ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి డా. సీదిరి అప్పలరాజు రాష్ట్రానికి చెందిన పలు అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వేక్సిన్ ఉత్పత్తి కేంద్రం రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణా పరిధిలోకి పోయిందని, ఆంధ్రప్రదేశ్‌ నూతనంగా వేక్సిన్ ఉత్పత్తి కేంద్రాన్ని రూ.50 కోట్ల అంచనా వ్యయంతో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు కేంద్రానికి పంపామని, సత్వరమే అనుమతి మంజూరు చేయాలని కేంద్రమంత్రిని ఆయన కోరారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా గొర్రెలు, మేకలు మరియు పందులు పెంపకానికి కేంద్రం ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లుగానే పాడి పశువులకు సహితం ఇచ్చినట్ల‌యితే గ్రామీణ పేద రైతులకు మరియు అక్కాచెల్లెమ్మలకు మరింత ఆర్ధిక పరిపుష్టి కలుగుతుందని మంత్రి కేంద్రాన్ని కోరారు. జాతీయ కృత్రిమ గర్భధారణ పధకంలో భాగంగా పశుసంవర్ధక శాఖ ద్వారా అమలవుతున్న పశువుల కృత్రిమ గర్భధారణ పథకాన్ని మరింత సమర్ధవంతంగా అమలు చేయడానికి మరియు గర్భధారణ రేటును పెంచడానికి పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ కార్పోస్కోప్స్ అందజేయుటకు అవసరమైన ఆర్ధిక సహాయాన్ని అందజేసే పైలట్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని మంత్రివర్యులు కోరారు. గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో 45 సంవత్సరాలు నిండిన గ్రామీణ మహిళలకు వైఎస్సార్ చేయూత ద్వారా రూ.75 వేలు అందిస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం నుండి మరింత సహకారం అందినట్లు అయితే గ్రామీణ మహిళలు మరింత ఆర్ధిక పురోగతి సాధిస్తారని మంత్రివర్యులు తెలియజేశారు. వర్చ్యువల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అహ్మద్‌బాబు, పశుసంవర్ధక శాఖ సంచాలకులు డా. ఆర్.అమరేంద్రకుమార్, ఏ.పి.లైవ్ స్టాక్ డెవలెప్మెంట్ ఏజన్సీ సిఇఓ డా.టి.దామోదర్ నాయుడు పాల్గొన్నారు.

Just In...