Published On: Mon, Dec 2nd, 2019

11వ పీఆర్సీని వెంట‌నే అమ‌లు చేయాలి

* ఏపి ఎన్జీవోస్ నందిగామ తాలూకా యూనిట్ అధ్య‌క్షుడు శ్యామ్‌బాబు

* సీపీఎస్ రద్దు ద్వారా రాష్ట్రంలో లక్షా 86 వేల మంది ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగు

* జిల్లా ఉపాధ్య‌క్షుడు యం.రాజుబాబు

సెల్ఐటి న్యూస్‌, నందిగామ‌: 11వ పీఆర్సీని అమలు చేయాల‌ని, 2018 జులై నుండి బకాయి ఉన్న మూడు విడుతల కరువు భత్యం (డిఏ)ను వెంట‌నే మంజూరు చేయాల‌ని ఏపీ ఎన్జీఓస్ నందిగామ తాలూకా యూనిట్ అధ్యక్షుడు యం.శ్యామ్‌బాబు కోరారు. స్థానిక యంఆర్‌ఓ కార్యాలయం వద్ద శుక్రవారం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (ఏపీ జెఎసి) నందిగామ ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా శ్యామ్‌బాబు మాట్లాడుతూ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించుటలో ప్రభుత్వం అలసత్వం వహించడంతో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు (ఏపీ జేఏసీ) అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు దశల వారిగా ఆందోళన కార్యక్రమాలు చేప‌డుతున్నామ‌ని, అందులో భాగంగా ధర్నాకు దిగ‌డం జ‌రిగింద‌న్నారు. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఆయన కోరారు. జిల్లా ఉపాధ్యక్షుడు యం.రాజుబాబు మాట్లాడుతూ ఎన్నికల ముందు సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పేరని, కానీ ఇంతవరకు సీపీఎస్ రద్దు చేయ‌క‌పోవడంతో ఉద్యోగులతో ఆందోళన మొదలైందని ఆయన అన్నారు. సీపీఎస్ రద్దు ద్వారా రాష్ట్రంలో లక్షా 86 వేల మంది ఉద్యోగుల కుటుంబాలలో వెలుగును నింపిన వరవుతారని పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులకు ఐదు రోజుల ప్రత్యేక సెలవులను మంజూరు చేయాల‌ని, హెల్త్ కార్డుల ద్వారా పూర్తి స్థాయిలో వైద్యం అందించాలని కోరారు. ఉద్యోగులకు సంబందించిన సమస్యలను, న్యాయపరమైన కోర్కెలను సాధించుకోవడానికి ఆందోళన కార్యక్రమాలు చెప్పట్టామని, ప్రభుత్వంపై ఏమాత్రం ఎదురు దాడి కాదని తెలిపారు. పంచాయితీ సెక్రెటరీల సంఘం జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఆందోళన కార్యక్రమాల ద్వారా అయిన ఉద్యోగుల సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తారని ఆశాభావంతో ఉన్నామని అన్నారు. సమస్యల పరిష్కారం కాని ప‌క్షంలో డిసెంబర్ 10వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాలు చేపడతామన్నారు. ధర్నాకు నందిగామ, జగయ్యపేట బార్ అసోసియేషన్ నాయకులు పాల్గొని సంఘీభావాన్ని తెలిపారు. ధర్నాలో సిపియస్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి ముప్పాళ్ళ శ్రీనివాసరావు, పంచాయతీ సెక్రెటరీల సంఘం జిల్లా అధ్యక్షులు కే.శ్రీనివాసరావు, దాసు, పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు ఎన్.నరసింహారావు, ఎం.వెంకటేశ్వరరావు, లక్ష్మినారాయణ, నందిగామ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.రామకృష్ణ, పరమేశ్వరరావు, జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పసుపులేటి సత్యశ్రీనివాస్, ఏపీ ఎన్జీవో నాయకులు సురేష్ , షేక్ బాసు, యల్లమందయ్య, ఝాన్సీ, సాయిరాం, నందిగామ తాలూకా ఏపీఎన్జీవోస్ మాజీ కార్యదర్శి జి.వెంకటరత్నం, ఉద్యోగులు పాల్గొన్నారు.

 

Just In...