Published On: Sat, May 19th, 2018

11వ పీఆర్‌సీ ఏర్పాటు

* త్వరలో కమిషనర్‌ నియామకం 

* విధివిధానాలు ఖరారు 

* ఏడాదిలోగా నివేదిక ఇవ్వాలని నిర్దేశం 

* ఉత్త‌ర్వులు జారీ చేసిన సీఎస్ దినేష్‌కుమార్‌

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రభుత్వం 11వ వేతన సవరణ సంఘాన్ని శుక్రవారం నియమించింది. దీనికి కమిషనర్‌ నియామకానికి సంబంధించి త్వరలో ఆదేశాలు జారీ చేయనుంది. బాధ్యతలు చేపట్టిన తేదీ నుంచి ఏడాదిలోగా ప్రభుత్వానికి నివేదికను సమర్పించాలని పేర్కొంది. అనుసరించాల్సిన విధివిధానాలను నిర్దేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగ సంఘాల ఐకాస నుంచి అందిన వినతి మేరకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. 11వ వేతన సవరణ సంఘం అనుసరించాల్సిన విధివిధానాలివి.
* రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఎయిడెడ్‌ సంస్థల ఉద్యోగులు, విశ్వవిద్యాలయాల బోధనేతర సిబ్బంది, వర్క్‌ఛార్జ్‌డ్‌, ఫుల్‌టైమ్‌ కంటింజెంట్‌ ఉద్యోగులకు సంబంధించిన వేతన సవరణ అంశాన్ని ఈ సంఘం పరిశీలించాలి.
* ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ పథకంపై అధ్యయనం చేయాలి. ప్రస్తుత తరహాలోనే ఈ పథకాన్ని అమలుచేయాలా? ఏదైనా మార్పుచేర్పులు చేయాలా? అనేది పరిశీలించాలి.
* ప్రస్తుతమున్న పింఛను విధానాన్ని పరిశీలించి అవసరమైన మార్పులు సూచించాలి.
* రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఈ సిఫార్సులు చేయాలి.
* స్పెషల్‌పే, ఇతర భత్యాలను కొనసాగించాలా? కొనసాగిస్తే ఎలాంటి మార్పులు చేయాలనే దానిపై పరిశీలించాలి.
* ప్రస్తుతమున్న డీఏను ఎంతమేర వేతనంలో కలపాలి? తదనుగుణంగా కొత్త వేతన స్కేళ్లు ఉండాలనేది పరిశీలించాలి.

Just In...