Published On: Wed, May 16th, 2018

14వ డివిజన్‌ను మోడల్ డివిజన్‌గా తీర్చిదిద్దుతా

* విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం శాసనసభ్యులు గద్దె రామమోహన్ 
సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: నియోజకవర్గంలో తాను దత్తత తీసుకున్న 14వ డివిజన్‌ను రాబోయే కాలంలో మోడల్ డివిజన్‌గా తీర్చిదిద్దుతానని, వచ్చే ఎన్నికల నాటికి స్థానిక సమస్యలు అన్ని పరిష్కరించే విధంగా వేగంగా చర్యలు చేపడుతున్నట్టు విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం శాసనసభ్యులు గద్దె రామమోహన్ పేర్కొన్నారు. ద‌ళితతేజం- తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన డివిజన్ పార్టీ అధ్యక్షులు రత్నం రమేష్, దళితతేజం కన్వీనర్ సొంగా రవీంద్రవర్మ, స్థానిక నాయకులు, పెద్దలు, కార్యకర్తలతో కలిసి 14వ డివిజన్ గాంధీ కాలనీలో పర్యటించారు.  గాంధీ కాలనీలోని విఎమ్ఆర్ రోడ్డు, రఘురోడ్డులతో పాటు పలు రహదారుల వెంట పర్యటిస్తూ స్థానిక మహిళలు, వృద్ధులు, చిన్నారులతో మాట్లాడారు. వారి సమస్యలను ఆలకించారు. కొంతమంది రేషన్ కార్డులు, వృద్ధాప్య పింఛన్లు వంటి వాటిని లిఖిత పూర్వకంగా ఇచ్చిన అర్జీలను స్వీకరించి వారి సమస్యలను అధికారులకు ఫోన్‌లో తెలియజేసి అక్కడిక్కడే పరిష్కరించారు. పర్యటన సందర్భంగా రఘురోడ్డులోని స్థానికులు ఎమ్యెల్యేను అభినందించారు. సైకిల్ చైతన్యయాత్రలో తాము లేవనెత్తిన రఘురోడ్డు నిర్మాణం విషయంలో వెంటనే స్పందించి నూతన రహదారి పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గద్దె రామమోహన్ మాట్లాడుతూ నియోజకవర్గ డివిజన్లలో ప్రజా సమస్యల పరిష్కార పర్యటనతో పాటు దళితతేజం కార్యక్రమంలో భాగంగా గాంధీకాలనీలో పర్యటించడం జరిగిందన్నారు. 14వ డివిజన్‌లో గతంలో టిడిపికి 7,500 ఓట్లు తక్కువగా రావటం జరిగిందన్నారు. అటువంటి డివిజన్ వాసుల మన్ననలను పొందాలని ప్రత్యేకంగా ఈ డివిజన్ ను దత్తత తీసుకుని స్థానికులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని ధృఢ నిశ్చయం తీసుకోవటం జరిగిందన్నారు. పర్యటనలో అధికంగా స్థానిక మహిళలు మంచినీటి పంపులు ఏర్పాటు చేయాలని తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఇప్పటికే నూటికి తొంభై శాతం సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశామని, ప్రతిష్టాత్మకంగా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. రూ.7 కోట్లతో ఓవర్‌హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేసి స్థానికులకు సమృద్ధిగా మంచినీరు అందించే ప్రయత్నం చేస్తామన్నారు. ఇటీవల సైకిల్ చైతన్యయాత్రలో తన దృష్టికి తీసుకువచ్చిన రఘురోడ్ నిర్మాణ పనులు చేపట్టటం జరిగిందన్నారు. కొద్ది రోజులలోనే నూతన రహదారి ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. గత శాసనసభ్యులు చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. పర్యటనలో స్థానికులు చాలామంది గత శాసనసభ్యులు అధికారంలో ఉన్న ఐదేళ్ళు, అనంతరం నాలుగేళ్ళు ఎక్కడా ఆయన కనపడలేదని బాహటంగానే చెపుతున్నారన్నారు. ప్రస్తుతం ఆయన చేపట్టలేని పనులన్ని తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టి విజయవంతంగా పూర్తి చేయటం జరుగుతుందన్నారు. ప్రజలు గత ప్రభుత్వ పాలనను, ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వ పాలనను బేరీజు వేసుకొని, రాబోయే కాలంలో దానికనుగుణంగా ప్రజాతీర్పును వెల్లడించాలన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆళ్ళ చెల్లారావు, సొంగా ర‌వీంద్ర‌వ‌ర్మ‌, ముమ్మనేని ప్రసాద్, చిన్నం ఈశ్వరరావు, రహీం అప్సర్, తాడికొండ రంగారావు, గద్దె రమేష్, షేక్ కరీముల్లా, గళ్ళా రవి, పడాల గంగాధర్, తాడిబోయిన వేణు, కొల్లిపర శ్రీను, సింగంశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Just In...