Published On: Mon, May 13th, 2019

15 నుండి చిత్తూరు జిల్లాలో శ్రీనివాస కల్యాణాలు

సెల్ఐటి న్యూస్‌, తిరుమ‌ల‌: టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ నెల 15 నుండి 29వ తేదీ వ‌ర‌కు చిత్తూరు జిల్లాలోని 10 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి.  శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు టిటిడి పలు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణం వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణోత్సవాలు కనువిందు కానున్నాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ నెల 15వ తేదీన సోమ‌ల‌ మండలం కందూరులోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో శ్రీవారి కల్యాణం జరుగనుంది. 16న పెద్ద‌పంజాణి మండలం ముత్తుకూరు గ్రామంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. 17న యాద‌మ‌రి మండలం ముద్దురామాపురంలోని శ్రీ ముత్తు మారియ‌మ్మ ఆల‌యంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు. 18న పూత‌ల‌ప‌ట్టు మండ‌లం పూండిలోని శ్రీ విఘ్నేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యం ఎదురుగా శ్రీనివాస కల్యాణం జరుగనుంది. 19న గుడిపాల మండ‌లం సీలాప‌ల్లెలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. 25న చిత్తూరు మండ‌లంలోని తుమ్మింద‌పాళెంలో గ‌ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మైదానంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది. 26న చిత్తూరు మండ‌లం ముత్తుకూరులోని శ్రీ విఘ్నేశ్వ‌రాల‌యంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు. 27న పాల‌స‌ముద్రం మండ‌లం బ‌లిజ‌కండ్రిగ గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మైదానంలో స్వామివారి కల్యాణం జరుగనుంది. 28న వెదురుకుప్పం మండలంలోని న‌క్క‌లంప‌ల్లి గ్రామంలోని మ‌హాభార‌త ప్రాంగణంలో శ్రీనివాస కల్యాణం నిర్వహించనున్నారు. 29న శ్రీ‌కాళ‌హ‌స్తిలోని శ్రీ విఘ్నేశ్వ‌రాల‌యం ఎదురుగా గ‌ల ఖాళీ స్థ‌లంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. శ్రీ‌నివాస క‌ల్యాణం ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ కె.ప్ర‌భాక‌ర‌రావు ఈ క‌ల్యాణాల ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

Just In...