Published On: Thu, Nov 8th, 2018

2019 ఎన్నికల్లో దేశంలో భాజ‌పా భస్మం కావడం ఖాయం

* ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న‌

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: కర్ణాటకలో మోడీకి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పుతో రాక్షస పాలన అంతం ఆరంభమైంద‌ని ప్రభుత్వ విప్, టిడిపి అధికార ప్రతినిధి బుద్దా వెంకన్న అన్నారు. గురువారం ఉద‌యం విజ‌య‌వాడ‌లోని ప్ర‌భుత్వ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ దీపావళికి ముందు రోజు వచ్చిన ఫలితంతో దేశ ప్రజలంతా పండుగను మరింత ఉత్సాహంతో చేసుకున్నార‌ని తెలిపారు. బళ్లారిలో బిజెపిని చిత్తుచిత్తుగా ఓడించారంటే చంద్రబాబు ముఖ్యకారణం అన్నారు. ఎపి ప్రజలకు మోడి చేసిన అన్యాయం కారణంగానే‌ చంద్రబాబు ధైర్యంగా ఎదురు తిరిగార‌ని పేర్కొన్నారు. మోడి డ్రామాలను దేశ ప్రజలకు చాటి చెప్పిన ఘనత చంద్రబాబుదేన‌న్నారు.
కర్నాటక ఫలితాలతో బిజేపి నేతల నోళ్లు మూగబోయాయి. కన్నా, జివియల్ అన్నలు ఎక్కడకి వెళ్లిపోయార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఫలితాల తర్వాత అడ్రస్ లేకుండా పోయిన అన్నలు ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోవాల‌ని వ్యాఖ్యానించారు. మీకు పదవులు, మోడి ముందు మోకరిల్లడం తప్ప ప్రజల ఇబ్బందులు పట్టవ‌న్నారు. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి బుద్ది తెచ్చుకోండి అన్నలూ.. అన్నారు. కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ దత్త పుత్రుడు గాలక జనార్థన్ రెడ్డి కోసం సిబిఐ వేట ప్రారంభమైంద‌న్నారు. అధికారులు ఎక్కడెక్కడో తిరగకుండా.. జగన్ లోటస్ పాండ్‌కు వెళితే చాలు అని ఆయ‌న వ్యాఖ్యానించారు. దేవుడిచ్చిన తమ్ముడు జగన్ అని గాలి జనార్దన్ రెడ్డి ప్రకటించార‌ని, ఇప్పుడు అధికారులు దాడులకు బయపడి జగన్ ఇంట్లో దాక్కున్నాడ‌న్నారు. కోడి కత్తి విషయంలో ఇంత రాద్దాంతం జరిగినా జగన్ నోరు మెదపటం లేదు అన్నారు. జగన్ త‌న స్థాయికి తెలుగు మీడియా కాదని జాతీయ మీడియాకే ఇంటర్వ్యూలు ఇస్తార‌ని, కోడి కత్తి ‌విషయం పై కనీసం జాతీయ మీడియాలో కూడా ఎందుకు స్పందించలేద‌న్నారు. డిల్లీ లెవల్‌లో స్క్రిప్ట్ రెడీ కాకపోవడంతో జగన్ సైలెంట్ అయిపోయాడ‌ని వ్యాఖ్యానించారు. పాదయాత్రకు వెళితే జనాలకు సమాధానం చెప్పాల్సి వస్తుందనే భయంతోనే విరామం ప్రకటించార‌ని తెలిపారు. మోడీని అధికారం నుంచి తరిమికొట్టడం ఖాయం.. అన్ని రాష్ట్రాల ప్రజలు అందుకు సిద్దంగా ఉన్నార‌ని తెలిపారు. ఇందుకు చంద్రబాబే ప్రధాన కారణం, ఆయనపై ఉన్న నమ్మకంతేనే వివిధ పార్టీల నేతలు కలిసేందుకు ముందుకు వస్తున్నారు. 2019 ఎన్నికలలో దేశంలో బిజెపి, ఎపిలో మోడికి కొమ్ము కాస్తున్న నేతలు భస్మం కావడం ఖాయం అని జోస్యం చెప్పారు.

Just In...