Published On: Thu, Nov 8th, 2018

2019 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తా

* రాష్ట్ర ప్రయోజనాల కోసమే కాంగ్రెస్‌తో దోస్తి

* నిర్మాణం లేని పార్టీలు అధికారంలో రాలేవు

* ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ కారెం శివాజీ

సెల్ఐటి న్యూస్‌, రాజమహేంద్రవరం: 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని, తెలుగుదేశం పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేసి విజయసాధిస్తానని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ కారెం శివాజీ అన్నారు. స్థానిక ఆర్‌ అండ్‌ బి అతిథి గృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని పోరాటాలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు జగన్మోహన్‌ రెడ్డి రాబోయే ఎన్నికల్లో హోదా ఇస్తానని చెప్పిన పార్టీకే మద్దతు ఇస్తానని చెప్పాడని, నాలుగున్నరేళ్ల పాటు నమ్మించి మోసం చేసిన బిజెపితో ఏవిధంగా అంటకాగుతున్నారని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక ¬దాను ఇస్తానని స్పష్టమైన హామీని కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిందని, అందుకే నాలుగున్నరేళ్లు నమ్మించి మోసం చేసిన బిజెపికి దేశవ్యాప్తంగా తగిన గుణపాఠం చెప్పేందుకే కాంగ్రెస్‌ పార్టీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్దతు ప్రకటించారని తెలిపారు. రాష్ట్రానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తున్నా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా చెప్పుకుంటున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కేవలం తనపై ఉన్న కేసులకు భయపడే ఆ పార్టీని ప్రశ్నించకుండా పాదయాత్ర పేరుతో ఊరూరు తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. జగన్మోహన్‌ రెడ్డి చేస్తున్న పాదయాత్ర ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం కాదని, కేవలం కేసుల నుంచి బయటపడేందుకు మాత్రమేనని పేర్కొన్నారు. కొత్తగా సానుభూతి కోసం కోడి కత్తి డ్రామాను ఆడుతున్నారని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆడుతున్న కోడికత్తి డ్రామాలో ఒక ఎస్సీ యువకుడి జీవితాన్ని బలి చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తుందని, తెలుగు ప్రజల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. తెలుగు ప్రజలపై కక్షకట్టిన బిజెపి రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తుందన్నారు. వైకాపా, జనసేన పార్టీ నాయకులు ఇద్దరూ కేంద్రంతో కుమ్మక్కు అయ్యి రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కుల, మతాలను రెచ్చగొట్టేందుకు పవన్‌ కళ్యాణ్‌ ప్రయత్నిస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి అవసరమైన నిధులన్నీ ఇచ్చామని కేంద్రం నోటిఫై చేయడాన్ని కారెం కొట్టి పారేశారు. విభజన హామీలు వేరని, కేంద్రం ఇచ్చిన నిధులు వేరని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విభజన హామీల్లో ఏమి అమలు చేశారనే దానిపై బహిరంగ చర్చకు బిజెపి నాయకులు రావాలని ఆయన సవాల్‌ చేశారు. కళ్లబొళ్లి కబుర్లతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు బిజెపి నాయకులు ప్రయత్నిస్తున్నారని, బిజెపి నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. ఒక సామాజికవర్గాన్ని వెనుకపెట్టుకున్న వ్యక్తి అధికారంలోకి ఎలా రాగల్గుతారని, పవన్‌ పార్టీ వల్ల ప్రజలకే నష్టమని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పవన్‌, జగన్లు బిజెపి డైరెక్షన్‌లో నడుస్తున్నారని పేర్కొన్నారు. సినీ గ్లామర్‌తో పవన్‌, తండ్రిపై ఉన్న సానుభూతిని జగన్‌ ప్రజల్లోకి వెళ్తున్నారని అన్నారు. పార్టీ నిర్మాణం లేని పార్టీలు అధికారంలోకి రాలేవని, పవన్‌, జగన్‌లకు పార్టీ నిర్మాణం లేదని, ఎక్కడైనా ఆయా పార్టీలకు గ్రామ కమిటీలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో మాలమహానాడు జిల్లా అధ్యక్షులు బొచ్చా వెంకటరమణ, కో-ఆప్షన్‌ సభ్యురాలు కప్పల వెలుగు కుమారి, తదితరులు పాల్గొన్నారు.

Just In...